డీసీసీకి ప్రెసిడెంట్ రూలే..!


ఖమ్మం: ‘అన్ని ప్రాంతాల పార్టీ వ్యవహారాలు చక్కబెట్టాం.. కానీ ఖమ్మం పార్టీ అధ్యక్షుడి ఎన్నిక మాత్రం చేయలేక పోతున్నాం. అక్కడ ఏఐసీసీ నాయకుల పర్యవేక్షణలో ఓ ప్రతినిధిని పంపించాల్సి వస్తుందేమో..(ప్రెసిడెంట్ రూల్)’ అని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఇరత పార్టీ వ్యవహారాలపై ఆదివారం హైదరాబాద్ గాంధీ భవన్‌లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ నాయకులు దిగ్విజయ్‌సింగ్, కుంతియా, సల్మాన్‌ఖుర్షిద్, కొప్పుల రాజులు హాజరయ్యారు.



జిల్లా తరఫున హాజరైన మధిర, ఖమ్మం ఎమ్మెల్యేలు మల్లు భట్టివిక్రమార్క, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన డీసీసీ ఇన్‌చార్జ్‌లు ఐతం సత్యం, శీలంశెట్టి వీరభద్రం, శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఏఎస్ అయూబ్‌లతో ఏఐసీసీ నాయకులు జిల్లా పార్టీ వ్యవహారాలపై చర్చించారు.



డీసీసీ అధ్యక్షుడు లేని కారణంగా ఖమ్మం జిల్లాలో పార్టీ సభ్యత్వం అనుకున్న స్థాయిలో కొనసాగడం లేదని అభిప్రాయపడ్డారు. డీసీసీ ఎంపిక కోసం ఏకాభిప్రాయం కుదరడంలేదని, ఇతర ప్రాంతాల నుంచి నాయకున్ని అక్కడి పార్టీ అధ్యక్షుడిగా పంపించడమే మార్గమని ఏఐసీసీ నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. జిల్లాలో సభ్యత్వ నమోదు కోసం ప్రతి నియోకవర్గానికి 500 పుస్తకాలు ఇస్తే వాటిని పూర్తి చేయడంలో అందరూ వెనకబడి ఉన్నారని అన్నారు.



ఖమ్మం, మధిర, పాలేరు, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన ఐదు నియోకవర్గాల్లో సభ్యత్వ నమోదు కొనసాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏదిఏమైనా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినం డిసెంబర్ 9న ప్రతి నాయకుడు తమ ఓటు నమోదైన బూత్‌కు వెళ్ళి అక్కడ సభ్యత్వాలు చేయించాలని ఆదేశించారు. డిసెంబర్ 15 నాటికి అనుకున్న లక్ష్యం నెరవేర్చాలని, కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో భవిష్యత్తు ఉంటుందన్నారు. లేకపోతే ఎంత పెద్ద నాయకుడినైనా పక్కన పెట్టాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలిసింది.



సమావేశానికి నాయకులు డుమ్మా

టీపీసీసీ సమన్వయకమిటీ సమావేశం, సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆదివారం జరిగిన సమావేశానికి జిల్లా నుంచి పలువురు నాయకులు డుమ్మా కొట్టారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, మాజీ ఎమ్మెల్యేలు కుంజ సత్యవతి, రేగా కాంతారావు, సంభాని చంద్రశేఖర్, పాలేరు ఎమ్మెల్యే రాం రెడ్డి వెంకట్‌రెడ్డి గైర్హాజరైనట్లు సమాచారం. ఇందులో మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం హాజరు కాలేక పోతున్నానని అధిష్టానానికి సమాచారం అందించినట్లు తెలిసింది.



మిగిలిన వారిలో కుంజా సత్యవతి ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యం లోనే భద్రాచలం నియోజకవర్గం పార్టీ వ్యవహారాలకోసం సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని జిల్లా ఇన్‌చార్జి ప్రకటిం చినట్లు తెలిసింది. ఇటువంటి పరిస్థితిలో ఆమె ఆదివారం సమావేశానికి హాజరు కాకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

 

పార్టీ జిల్లా ఇన్‌చార్జిగా హరిరమాదేవి?


జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా వరంగల్ జిల్లాకు చెందిన పీసీపీ ప్రధాన కార్యదర్శి హరి రమాదేవిని నియమించినట్లు సమాచారం. తెలంగాణ రాష్టంలో అన్ని జిల్లాల ఇన్‌చార్జిల మార్పులో భాగంగా ఇక్కడ ఇన్‌చార్జిగా ఉన్న జట్టి కుసుమకుమార్‌ను రంగారెడ్డి ఇన్‌చార్జిగా నియమించినట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లేకపోవడంతో పార్టీ చుక్కాని లేని నావలా మారింది. సభ్యత్వ నమోదు కొనసాగుతున్న సమయంలో ఇన్‌చార్జిని మార్చడంపై నాయకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top