అర మీటర్‌కు అడ్డు

అర మీటర్‌కు అడ్డు


 వరంగల్ : జాతీయ రహదారి అభివృద్ధికి పట్టిన గ్రహణం వీడడం లేదు. జాతీయ రహదారి విభాగం అధికారులు ఎన్ని వివరణలు, ప్రత్యామ్నాయాలు చూపినా అటవీశాఖ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని భూపాలపట్నం వరకు ఉన్న రహదారిని 2002లోజాతీయ రహదారిగా మార్చేందుకు కేంద్రం నిర్ణయించింది. హైదరాబాద్-భూపాలపట్నం జాతీయ రహదారి వరంగల్, ములుగు, ఏటూరునాగారం మీదుగా రాష్ట్రంలో 307 కిలోమీటర్ల మేరకు ఉంది. హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా పసరా వరకు రెండులేన్లుగా అభివృద్ధి చేసేందుకు సుమారుగా పదేళ్లకు పైగా పట్టింది.



జాతీయ రహదారిలో పస్రా-ఏటూరునాగారం మధ్య 27 కిలో మీటర్ల సింగిల్ రోడ్డు అభివృద్ధికి అటవీ శాఖ పలు రకాల కొర్రీలు పెట్టింది. ఈ ప్రాంతం మొత్తం అభయారణ్యంతో వన్యప్రాణి సంరక్షణ చట్టం పరిధిలో ఉన్నందున ఉన్న రహదారి కంటే ఎక్కువగా వెడల్పు చేసేందుకు వీలు లేదని అభివృద్ధి పనులు అడ్డుకుంది. దీంతో ఎన్‌హెచ్ అధికారులు వన్యప్రాణి సంరక్షణ చట్టం 1957లో వచ్చిందని అంతకు ముందే నిజాం ప్రభుత్వంలో ఈ రహదారి 100 ఫీట్లు ఉందన్న రికార్డులు తీసుకువెళ్లి ఢిల్లీలోని భూఉపరితల రవాణ శాఖకు అప్పగించారు.



ఈ రికార్డులను సుప్రీంకోర్టుకు సమర్పించడంతో అనుమతి లభించింది. కోర్టు ఆదేశాల మేరకు అటవీశాఖ పలు సూచనలతో 2013 జనవరి 17న క్లియరెన్స్ ఇచ్చింది. క్లియరెన్స్ ఇవ్వడంతో ఎన్‌హెచ్ అధికారులు టెండర్లు నిర్వహించి ఖరారు చేశారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మార్చి నెలాఖరులో అగ్రిమెంటు చేసుకున్నారు. ఈ రహదారి నిర్మాణం మొత్తం ఈపీసీ పద్ధతిలో ఉండడం వల్ల కాంట్రాక్టర్ సర్వే చేయించడంతో మరో మూడు నెలలు పట్టింది.



 అర మీటర్‌తో ఇబ్బంది..

 పసరా-ఏటూరునాగారంల మధ్య ఉన్న రహదారి ప్రస్తుతం మూడున్నర మీటర్లు ఉంది. దీన్ని 7 మీటర్ల వరకు వెడల్పు చేసేందుకు అటవీశాఖ అనుమతి ఇచ్చింది. రెండు లైన్ల రహదారి అంటే 7 మీటర్లు కచ్చితంగా ఉండాల్సిందే. ఈ రహదారికి ఇరుపక్కల అర మీటరు చొప్పున సైడ్ బర్మ్స్ నిర్మించాల్సి ఉంటుంది. సైడ్‌బర్మ్స్ లేకుంటే వర్షాలకు రోడ్డు కోతకు గురి అయ్యే ప్రమాదం ఉంటుంది. దీనికి తోడుగా రోడ్డు పక్కనే చెట్లు ఉండడం ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. దీని కోసం అర మీటర్ వరకు అనుమతి ఇవ్వాలని అటవీశాఖ అధికారులను ఎన్‌హెచ్ ఇంజనీర్లు కోరినా పట్టించుకోవడం లేదు.



 వణ్యప్రాణులకు ప్రత్యేక కల్వర్టులు..

 ఈ రహదారికి అనుమతి ఇచ్చిన అటవీశాఖ పలు సూచనలు చేసేంది. ఈ రహదారి పూర్తిగా అభయారణ్యంలో ఉన్నందున వన్యప్రాణి చట్టం ప్రకారం వాటికి ఇబ్బంది లేకుండా నిర్మాణాలు ఉండాలని సూచించింది. అందువల్ల ఈ 27 కిలోమీటర్ల రహదారిలో సుమారు 10 ప్రాంతాల్లో అండర్ బ్రిడ్జీలు నిర్మిస్తారు. ఈబ్రిడ్జీల నిర్మాణం వల్ల ఇటు ఉన్న వణ్యప్రాణులు స్వేచ్ఛగా మారో పక్కకు వెళ్లేందుకు వీలు ఉంటుంది. ఈ బ్రిడ్జీలు ఎక్కడ నిర్మించాలన్న విషయాలు ఇటీవలే అటవీశాఖ అధికారులు ఎన్‌హెచ్ అధికారులుకు తెలిపారు.



అయినా రహదారి 7 మీటర్ల లోపలే పనులు చేసుకోవాలని వారు సూచించినట్లు తెలిసింది. పనులు జరిగే సమయంలో రహదారికి ఇరుపక్కల మీటరు వరకు యంత్రాలు ఉపయోగానికి స్థలం అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇన్నీ జరుగుతున్నా పాలక వర్గ నేతలు మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు.



 మేడారానికి మళ్లీ తిప్పలే..

 పసరా-ఏటూరునాగారంల మధ్య రహదారి రెండు లైన్లుగా అభివృద్ధి కాకుంటే వచ్చే ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతరకు ట్రాఫిక్ తిప్పలు తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. రిజర్వు ఫారెస్టులో వేలాది ఎకరాలు పోడు జరుగుతున్నా చూసీచూడనట్లు వహిస్తున్న అటవీశాఖ ప్రజలకు నిత్యం ఉపయోగపడే రహదారులను అడ్డుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. అభివృద్ధిలో భాగస్వాములమని అని ఊదర గొడుతున్న ప్రజాప్రతినిధులు ఈ రహదారి అభివృద్ధికి ఏం చొరవ తీసుకుంటారో చూడాల్సిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top