కూర్మావతారంగా ‘గుట్ట’


యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం రూపురేఖలు మరో రెండు మూడేళ్లలో పూర్తిగా మారిపోనున్నాయి. దీనికి సంబంధించిన ఊహాచిత్రాన్ని ఆలయం అధికారులు విడుదల చేశారు. మొత్తం 14 ఎకరాల విస్తీర్ణంలో కొండ గుట్టను చదును చేసి నాలుగు అంత్రాలు(వరుసలు)గా ఏర్పాటు చేయనున్నారు. ఒక అంత్రంలో కార్యాలయాలు, మరో అంత్రంలో భక్తుల వసతి గదులు, మూడో అంత్రంలో పూర్తిగా గర్భాలయం, నాలుగో అంత్రంలో గ్రీనరీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్కిటెక్టు అధికారులు చెబుతున్నారు. ఇక గుట్ట చుట్టూ నాలుగు లేన్ల రోడ్డు ఏర్పాటుచేసే అవకాశం ఉంది. కొండపైన గర్భాలయం చుట్టూ ప్రాకారం ఉండి 4 మాడ వీధులు 4 రాజ గోపురాలతో అలరారేలా అధికారులు, స్థపతులు మోడల్ తయారు చేస్తున్నారు. ఆలయాన్ని సైతం విస్తీర్ణం పెంచి స్వామివారి నిత్యకల్యాణంలో సుమారు వెయ్యిమంది కూర్చునే విధంగా తయారుచేయాలని సీఎం ఆదేశించారు.



లోపల ఉన్న గర్భాలయాన్ని ముట్టుకోకుండా స్వయంభూవు మూర్తులకు పైన ఉన్న విమాన గోపురాన్ని తీయకుండా విస్తీర్ణం చేసే దిశగా ఆలయ స్థపతులు సుందర్‌రాజన్ కృషి చేస్తున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయితే గుట్ట వ్యూ పూర్తిగా కూర్మావతారంగా (తాబేలు) మాదిరిగా కనిపిస్తుందని అంటున్నారు. ఈ పనులు మరో రెండు నెలల్లో  ప్రారంభం కావచ్చునని తెలుస్తోంది. కొండపైన గల దుకాణాలన్నీ ఒకే సముదాయంలోకి వచ్చే విధంగా  ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ అభివృద్ధికి సుమారు 2000 ఎకరాలు అవసరం ఉన్నప్పటికీ దేవస్థానం పరిధిలో 1000 ఎకరాలు మాత్రమే ఉందని, మిగతా  స్థలం సేకరణ మాత్రం 22 లోగా పూర్తిగా చేసి త్వరలో మాస్టర్‌ప్లాన్ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాలని సీఎం నుంచి ఉన్నతాధికారులకు ఆదేశాలందాయని సమాచారం.

 

 ‘గుట్ట’ భూసేకరణకు కమిటీ ఏర్పాటు




 సాక్షి, హైదరాబాద్: యాదగిరి గుట్ట ఆలయాభివృద్ధికి భూములను సేకరించేందుకు నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో భువనగిరి ఆర్డీవో, స్థానిక తహశీల్దార్‌ను సభ్యులుగా నియమించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జి గోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top