11,000 కోట్ల భారం

11,000 కోట్ల భారం - Sakshi


► సాగు, తాగునీటి ప్రాజెక్టులపై జీఎస్టీ ఎఫెక్ట్‌

► తగ్గించాలంటూ కేంద్రంపైఒత్తిడి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలపై జీఎస్టీ తీవ్ర ప్రభావం చూపనుంది. నీటి పారుదల ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ తాగునీటి పనులు, డబుల్‌ బెడ్రూం ఇళ్లపై దాదాపు రూ.11 వేల కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది.  ప్రస్తుత వ్యాట్‌ ప్రకారం వర్క్స్‌ కాంట్రాక్టులపై 5 శాతం పన్ను అమల్లో ఉంది. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాలో జమవుతుండటంతో ప్రాజెక్టులపై రూ.వేలాది కోట్లు వెచ్చించినప్పటికీ అందులో 5% తిరిగి ఖజానాకు వచ్చి చేరేది. కానీ జీఎస్టీలో ఖరారు చేసిన పన్ను స్లాబ్‌ల ప్రకా రం వర్క్స్‌ కాంట్రా క్టులపై 18% పన్ను పడినట్లయింది.


దీంతో ప్రాజెక్టులకయ్యే వ్యయం రూ.లక్ష కోట్లలో రూ.18 వేల కోట్లు జీఎస్టీకి జమ చేయాల్సి ఉంటుంది. అందులో సగం రాష్ట్ర ఖాతాకు, మిగతా సగం కేంద్రానికి జమవుతుంది. దీంతో దాదాపు రూ.9 వేల కోట్లు భారం పడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టీ పెరిగిందనే కారణంగా ప్రాజెక్టుల అంచనా వ్యయాలూ పెరిగే ప్రమాదముందని పేర్కొంటున్నాయి.



వరుసగా కేంద్రంపై ఒత్తిడి

మిషన్‌ భగీరథ, నీటి పారుదల ప్రాజెక్టుల పనుల ను జీఎస్టీ నుంచి మినహాయించాలని ఇప్పటికే పలు మార్లు కేంద్రాన్ని సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఇటీవలే ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి జైట్లీకి లేఖలు రాశారు. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశానికి హాజరయ్యేం దుకు వెళ్లిన మంత్రి కేటీఆర్‌ కూడా ఈ విషయాన్ని ఆర్థిక మంత్రికి నివేదించారు. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం.. మరోసారి ఆర్థిక మంత్రిని కలసి ప్రాజెక్టులకు జీఎస్టీ పన్నును కనిష్ట స్లాబ్‌కు తగ్గించాలని విన్నవించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top