రేపే గ్రూప్స్ సిలబస్ ప్రకటన

రేపే గ్రూప్స్ సిలబస్ ప్రకటన

  • వీలైతే ఆ వెంటనే.. లేదంటే ఎల్లుండి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి

  •  పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు మరింత సమయం

  •  సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా భర్తీ చేయనున్న గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4తోపాటు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన పూర్తి స్థాయి సిలబస్‌ను కమిషన్ సోమవారం ప్రకటించనుంది. ఆ సిలబస్‌ను వీలైతే ఆ వెంటనే కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తేనుంది. లేదంటే మంగళవారం అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతోంది. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి సోమవారం సాయంత్రం పూర్తిస్థాయి సిలబస్‌ను స్వయంగా ప్రకటించనున్నారు. ప్రధాన పోటీ పరీక్షల సిలబస్‌ను  ముందుగానే ప్రకటించాలని, ఆయా పరీక్షలకు కొత్త సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో కమిషన్ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ప్రధానంగా గ్రూప్-1 మెయిన్స్‌లో తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలు జోడించారు. ప్రధానంగా తెలంగాణ ఉద్యమంపైనా గ్రూప్-1, గ్రూప్-2లో ప్రత్యేకంగా పేపర్లను పెట్టారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు సిద్ధం కావాల్సిన కొత్త సిలబస్‌కు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను ప్రకటించేందుకు కమిషన్ చర్యలు చేపట్టింది.

     

     పూర్తి సిలబస్ ఇవ్వనున్న ప్రధాన కేటగిరీలు, అంశాలివే..

     గ్రూప్-1 మెయిన్స్

     జనరల్ ఇంగ్లిష్: తప్పనిసరిగా క్వాలిఫై కావలసిన పరీక్ష

     పేపర్-1 (జనరల్ ఎస్సే):

     సమకాలీన సామాజిక అంశాలు, సమస్యలు; ఆర్థిక అభివృద్ధి న్యాయపరమైన అంశాలు; భారత రాజకీయ స్థితిగతులు, భారతీయ చరిత్ర సాంస్కృతిక వారసత్వం; సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి; విద్య, మానవ వనరుల అభివృద్ధి అంశాలు.

     పేపర్-2 (హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ): భారత దేశ చరిత్ర, సంస్కృతి, ఆధునిక యుగం (1757-1947); తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం; భారతదేశం, తెలంగాణ జాగ్రఫీ.

     పేపర్-3 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, పరిపాలన): భారతీయ సమాజం, నిర్మాణం, అంశాలు, సామాజిక ఉద్యమాలు; భారత రాజ్యాంగం; పరిపాలన .

     పేపర్-4 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్): భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి; తెలంగాణ ఆర్థిక వ్యవస్థ; అభివృద్ధి, పర్యావరణ సమస్యలు.

     పేపర్-5 (సైన్స్ అండ్ టెక్నాలజీ; డేటా ఇంటర్‌ప్రిటేషన్): శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పాత్ర, ప్రభావం; విజ్ఞాన శాస్త్ర వినియోగంలో ఆధునిక పోకడలు; డేటా ఇంటర్‌ప్రిటేషన్- సమస్య పరిష్కారం.

     పేపర్-6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం): తెలంగాణ తొలి దశ (1948-70); ఉద్యమ దశ (1971-90); తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ.

     గ్రూప్-2:

     పేపర్-2 (హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ): భారతదేశ, తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర; భారత రాజ్యాంగం, రాజకీయాలు అవలోకనం; సమాజ నిర్మాణం, ప్రజా విధానాలు.

     పేపర్-3 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్): భారత ఆర్థిక వ్యవస్థ: వివిధ అంశాలు- సవాళ్లు; తెలంగాణ ఆర్థిక వ్యవస్థ-అభివృద్ధి; అభివృద్ధి, మార్పు.

     పేపర్-4 (తెలంగాణ ఉద్యమం, ఆవిర్భావం): తెలంగాణ తొలి దశ -ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-70); ఉద్యమ దశ (1971-90); తెలంగాణ ఏర్పాటు దశ, ఆవిర్భావం (1991-2014).

     గ్రూప్-3

     పేపర్-2 (హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ): తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం; భారత రాజ్యాంగం, రాజకీయాలు అవలోకనం; సమాజ నిర్మాణం, అంశాలు, ప్రజా విధానాలు.

     పేపర్-3 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్): భారత ఆర్థిక వ్యవస్థ-అంశాలు, సవాళ్లు; తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి; అభివృద్ధి, మార్పు.

     గ్రూప్-4

     గ్రూప్-4లో జనరల్ స్టడీస్, సెక్రటేరియల్ ఎబిలిటీస్‌లో అడిగే అంశాలు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top