కలహాల కమలం

కలహాల కమలం - Sakshi


* బీజేపీ ధర్నాలో బయటపడ్డ వర్గపోరు

* దత్తాత్రేయ పర్యటనలో తేటతెల్లం

* జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డికి అవమానం

* నగర పార్టీ నేతల తీరుతో ఇబ్బంది

* గ్రూపు రాజకీయాలపై శ్రేణుల అసంతృప్తి

సాక్షి ప్రతినిధి, వరంగల్ : భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో వర్గపోరు మళ్లీ బహిర్గతమైంది. కరెంట్ కోతలు, రైతు సమస్యలపై మంగళవారం బీజేపీ నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడిలో విభేదాలు బయటపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ కార్యక్రమం బీజేపీ నగర శాఖ, జిల్లా శాఖ నేతల మధ్య పోరుకు వేదిక కావడంతో ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ కార్యక్రమానికిసికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా వచ్చారు.



ధర్నా ప్రారంభానికి ముందు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, మరికొందరు ముఖ్య నేతలు మడికొండ వద్దకు వెళ్లి దత్తాత్రేయకు స్వాగతం పలికారు. వీరు హ న్మకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్దకు చేరుకునే లోపే బీజేపీ నగర శాఖ నేతలు ధర్నా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. పార్టీ జి ల్లా అధ్యక్షుడు, ముఖ్య అతిథి రాకముందే కార్యక్రమం ప్రారంభించడంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.



మైక్ లాక్కున్న నగర నేతలు

ప్రధానంగా జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డికి ఈ పరిస్థితుల్లో నగర పార్టీ నేతలు ఇబ్బందికర పరిస్థితి తెచ్చారు. ధర్నాలో పాల్గొనే నేతలను మాట్లాడేందుకు పిలిచే క్రమంలో అశోక్‌రెడ్డి దగ్గర ఉన్న మైక్‌ను బీజేపీ నగర అధ్యక్షుడు చింతాకుల సునీల్ లాక్కున్నారు. దీంతో చిన్నబుచ్చుకున్న అశోక్‌రెడ్డి వేదికపై నుంచి కిందికి వెళ్లిపోయారు. ధర్నా కార్యక్రమం నుంచి దూరంగా వెళ్లేందుకు ముందుకుసాగారు. దీని కోసం తన వాహనాన్ని తెప్పించుకున్నారు. అశోక్‌రెడ్డితోనే వెళ్లిపోవాలని బీజేపీ గ్రామీణ నేతలు భావించారు.



కార్యక్రమానికి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో పలువురు నేతలు వెళ్లి అశోక్‌రెడ్డిని వారించారు. వీరు సర్దిచెప్పడంతో ఆయన వేదికపైకి వచ్చారు. బండారు దత్తాత్రేయకు అశోక్‌రెడ్డి పరిస్థితి వివరించారు. అనంతరం మిగిలిన నేతలు ఎవరు మాట్లాకుం డా దత్తాత్రేయ ప్రసంగించారు. తర్వాత కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ర్యాలీలో వెళ్లకూడదని అశోక్‌రెడ్డి భావించారు. అక్కడే ఆగిపోయేందుకు ప్రయత్నించారు. రాష్ట్ర నేత రావు అమరేందర్‌రెడ్డి మరికొందరు ఆయనను వారించి ర్యాలీకి తీసుకెళ్లారు. ధర్నా దగ్గర జిల్లా ముఖ్యనేతల మధ్య విభేదాలను చూసిన బీజేపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి.

 

ఆ రోజే విభేదాలకు బీజం

గతంలో జిల్లాలో బలమైన పార్టీగా ఉన్న బీజేపీ ఇప్పడు దయనీయంగా ఉంది. ముఖ్యమైన అంశాల్లో పార్టీ విధానాలు, జిల్లా నేతల గ్రూపు రాజకీయాల వల్లే పరిస్థితి దిగజారిందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ జిల్లా ముఖ్యనేతల మధ్య వర్గపోరు ఎప్పటి నుంచో ఉండగా, ఇటీవల కాలంలో బాగా ముదిరింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చే ముందు జిల్లాలోని ముఖ్యనేతలు కొందరు ఢిల్లీ వెళ్లారు.



రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చాక వీరంతా తిరిగొచ్చారు. అదే రోజున మడికొండ నుంచి హన్మకొండ చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆ రోజు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద జరిగిన సంఘటన బీజేపీ జిల్లా, నగర పార్టీ నేతల మధ్య విభేదాలను బాగా పెంచింది. అమరవీరుల స్తూపం వద్ద నగర పార్టీ నేతల వైఖరి అశోక్‌రెడ్డికి ఇబ్బంది కలిగించింది. అవమానంగా భావించిన అశోక్‌రెడ్డి అక్కడి నుంచే వెళ్లిపోయారు. అప్పటి నుంచి రెండు కమిటీల నేతల మధ్య వర్గపోరు పెరుగుతూనే ఉంది. నగరంలో పార్టీ కార్యక్రమాలన్నీ ఇద్దరు నేతల ఇష్టప్రకారమే జరుగుతున్నాయని.. వీరి వైఖరితో పార్టీ ప్రతిష్ట దిగజారుతోందని బీజేపీ శ్రేణులు వాపోతున్నాయి.

 

ఇలా రెండు కమిటీల మధ్య విభేదాలకు తోడు జిల్లాలోని ముఖ్య నేతలు మార్తినేరి ధర్మారావు, టి.రాజేశ్వరరావు మధ్య వర్గపోరు పార్టీకి మరింత నష్టం చేస్తోంది. రాష్ట్ర నేతలుగా ఉన్న ఈ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు. జిల్లా పార్టీని పటిష్టం చేయడం పక్కన బెట్టి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. బీజేపీ జిల్లా, నగర అధ్యక్ష పదవుల విషయంలోనూ ఇదే వర్గపోరు పార్టీకి నష్టంగా మారిందనే అభిప్రాయం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ఉన్న బలంతో.. రాష్ట్రంలోని సమస్యలపై పోరాడి ప్రజల మద్దతును పెంచుకోవాల్సిన బీజేపీ ముఖ్యనేతలు ఇలా వర్గపోరులో మునిగిపోతుండడం కమలం పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top