‘గ్రేటర్’లో గ్రీన్ యూరినల్స్


సాక్షి, హైదరాబాద్: దేశమంతా ‘స్వచ్ఛ భారత్’ మంత్రాన్ని వల్లిస్తున్న ప్రస్తుత తరుణంలో జీహెచ్‌ఎంసీ సైతం ఇందుకోసం తనవంతు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇళ్లనుంచి బయటకు వెళ్లిన ప్రజల ‘యూరినల్స్’ బాధ తప్పించేందుకు గ్రేటర్‌లో అధునాతన గ్రీన్ యూరినల్స్ ఏర్పాటుకు సిద్ధమైంది. తద్వారా ఓవైపు ప్రజల ఇబ్బందులు తొలగించడంతోపాటు మరోవైపు పరిసరాలు పరిశుభ్రంగా ఉండగలవని భావిస్తోంది. వీటిని తక్కువ స్థలంలోనే ఫుట్‌పాత్‌లపై కూడా ఏర్పాటు చేయవచ్చు. నిర్వహణ భారం తక్కువ కావడమేకాక.. అన్నివిధాలుగా సదుపాయవంతమైన గ్రీన్ యూరినల్స్‌ను    కిలోమీటరుకొకటి చొప్పున ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రధాన మార్గాల్లో వెయ్యి ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా వాటి  పనితీరు పరిశీలన కోసం ఇప్పటికే  ఏడు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. పైలట్ ప్రాజెక్టుగా వారం పది రోజుల్లో మరో 20 ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. అనంతరం అవసరాన్ని బట్టి వాటిలో తగిన మార్పుచేర్పులు చేయనున్నారు. మద్రాస్ ఐఐటీ సాంకేతిక పరిజ్ఞానం (జీరో అడోర్ టెక్నాలజీ)తో రూపొందించిన ఈ గ్రీన్ యూరినల్స్‌ను అతితక్కువ నీటితోనే నిర్వహించవచ్చు. వీటి వినియోగంతో ఒక్కో యూరినల్‌కు సంవత్సరానికి 1.51 లక్షల లీటర్ల నీటిని ఆదా చేయవచ్చు. ఇందుకోసం సోలార్‌పవర్‌ను వినియోగిస్తారు. వీటిని ఏర్పాటు చేసే సంస్థే నిర్వహణ పనులు కూడా చేస్తుంది.

 

 నిర్వహణలో భాగంగా పది యూరినల్స్‌కు వెరసి ఒక వాహనాన్ని వినియోగిస్తారు. సదరు వాహనం తన పరిధిలోని పది యూరినల్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంది. ప్రతి అరగంటకోమారు ఇలా శుభ్రం చేస్తారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌గా నిర్మితమయ్యే వీటిపై ఏర్పాటుచేసే ప్రకటనల బోర్డుల ద్వారా కూడా జీహెచ్‌ఎంసీకి ఆదాయం వస్తుందని కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ప్రతి అరకిలోమీటరుకు ఒక యూరినల్‌ను ఏర్పాటు చేయాలనేది లక్ష్యమన్నారు. ఇవి పురుషుల కోసం డిజైన్ చేసినవని, త్వరలోనే మహిళలకుపకరించే డిజైన్‌తోనూ యూరినల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలో తగినన్ని యూరినల్స్ లేక రహదారుల వెంబడి.. ఎక్కడ పడితే అక్కడ బహిరంగ మూత్రవిసర్జన చేస్తున్నారని.. దీన్ని నివారించేందుకు ఫుట్‌పాత్‌ల వెంబడి ఖాళీ ప్రదేశాలు లేకుండా ‘గ్రీన్‌కర్టెన్’లు ఏర్పాటు చేయడంతో పాటు ఆయా మార్గాల్లో గ్రీన్ యూరినల్స్ ఏర్పాటు చేస్తామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top