డబ్లింగ్‌కు పచ్చజెండా


సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :  జిల్లావాసులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సికింద్రాబాద్- మహబూబ్‌నగర్ రైలుమార్గం డబ్లింగ్ పనులకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. కేంద్రమంత్రి సురేశ్‌ప్రభు గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2015-16 రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు ఓ మోస్తరు ప్రాధాన్యత దక్కింది. అయితే, బడ్జెట్ ప్రసంగంలో కొత్త రైళ్లు, రైలుమార్గాల ప్రతిపాదన ఊసే లేకపోవడం జిల్లావాసులను నిరాశ పరిచింది.

 

  నత్తనడకన సాగుతున్న మహబూబ్‌నగర్- మునీరాబాద్ మార్గానికి నిధులు విడుదల కావడం కొంత ఊరటనిచ్చేదిగా ఉంది. సికింద్రాబాద్- మహబూబ్‌నగర్ మధ్య 110 కిలోమీటర్ల మేర రైలుమార్గాన్ని డబ్లింగ్ చేసేందుకు రైల్వే బడ్జెట్ 2015-16లో ఆమోదం లభించింది.

 

 రూ.1200కోట్లు అవసరమవుతాయని అంచనా వేయడంతో పాటు, పనులు ప్రారం భించేందుకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.27.44 కోట్లు కేటాయించారు. ఈ మార్గం డబ్లింగ్ సర్వే కోసం 2009-10 బడ్జెట్‌లో రూ.5 కోట్లు కేటాయించారు. సర్వే పూర్తయినా ఇన్నాళ్లూ నిధులు విడుదల కాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. జిల్లా కేంద్రం మీదుగా ప్రతిరోజూ 54 రైళ్లు, అంతే సంఖ్యలో గూ డ్సు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. డబ్లింగ్ పనులు పూర్తయితే జిల్లా కేంద్రం మీదుగా మరిన్ని రైళ్ల రాకపోకల పెరగడంతో పాటు ప్రయాణ సమయం తగ్గే అవకాశముంటుంది.

 

 ‘మునీరాబాద్’కు ఊతం

 రూ.245 కోట్ల అంచనాతో మొదలైన మహబూబ్‌నగర్- మునీరాబాద్ రైలుమార్గం పనులు ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతున్నాయి. దేవరకద్ర నుంచి కృష్ణావరకు సుమారు 65కి.మీ దూరానికి మక్తల్ మండలం జక్లేర్ వరకు సుమారు 34కి.మీ మేర పనులు పూర్తయ్యాయి. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.35 కోట్లు కేటాయించారు. భూసేకరణ సమస్యలతో సతమతమవుతున్న ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేందుకు ప్రస్తుత కేటాయింంపులు ఊతమివ్వనున్నాయి. ఇప్పటికే వున్న మహబూబ్‌నగర్- గుత్తి మార్గంలో అదనపు లైను సర్వేకు రూ.63.74 లక్షలు కేటాయించారు. హైదరాబాద్- శ్రీశైలం నడుమ 170 కిలోమీటర్ల రైలు మార్గం సర్వేకు రూ.25.5 లక్షలు కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిర్మాణం పూర్తి కావస్తున్న గద్వాల- రాయిచూరు మార్గానికి రూ.7 కోట్లు కేటాయిస్తున్నట్లు రైల్వేమంత్రి ప్రకటించారు.

 

 ప్రస్తావనకు నోచుకోని కొత్త మార్గాలు

 గద్వాల- రాయిచూరు, జడ్చర్ల- నంద్యాల రైలుమార్గం పనులు చేపట్టాలంటూ జిల్లాకు చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు కేంద్రాకి ప్రతిపాదనలు సమర్పించారు. మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇటీవల రైల్వేమంత్రి సురేశ్‌ప్రభును కలిసి నూతన రైలు మార్గాలకు ఆమోదం తెలపాల్సిందిగా కోరారు. మరోవైపు గద్వాల- రాయిచూరు నడుమ కొత్త రైళ్లు నడిపై ప్రతిపాదన కూడా ప్రస్తావనకు నోచుకోలేదు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top