రూ.18,643 కోట్లతో గ్రేటర్ వాటర్‌గ్రిడ్

రూ.18,643 కోట్లతో గ్రేటర్ వాటర్‌గ్రిడ్


హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ జనాభా ప్రస్తుతం 88 లక్షలు. సమీప భవిష్యత్‌లో ఐటీఐఆర్ ప్రాజెక్టుతో నగరంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సుమారు 25 లక్షల మేర పెరగనున్నాయి. మరో పదేళ్లలో మహానగర జనాభా రెండు కోట్లకు చేరుకుంటుం దని సర్కారు అంచనా వేస్తోంది. 2021 నాటికి మహానగరంతోపాటు శివారు ప్రాంతాలకు మంచినీటిని సరఫరా చేసేందుకు జలమండలి రూ.18,643 కోట్ల భారీ అంచనా వ్యయంతో వాటర్‌గ్రిడ్ పథకానికి శ్రీకారం చుట్టింది. కృష్ణా మూడో దశ, నాలుగో దశ, గోదావరి మంచినీటి పథకాల కింద నగరానికి తరలించనున్న నీటిని నగరం నలుమూలలకు సరఫరా చేయడమే గ్రిడ్ ప్రధాన లక్ష్యం. గోదావరి, కృష్ణా జలాలను కొరత ఉన్న ప్రదేశాలకు మళ్లించడం గ్రిడ్‌తో సాధ్యపడుతుంది.

 

గ్రేటర్ చుట్టూ వాటర్ గ్రిడ్


 

గ్రేటర్ తాగునీటి సమస్యపై డిప్యూటీ సీఎం సహా నలుగురు మంత్రుల సమీక్ష


 

మహానగరం చుట్టూ నలుచెరుగులా మంచినీటిని సరఫరా చేసేందుకు వీలుగా వాటర్‌గ్రిడ్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి తెలిపారు. గ్రేటర్ వాటర్‌గ్రిడ్ స్వరూపంపై ఆయన ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ మంత్రి పద్మారావు, రవాణా మంత్రి మహేందర్‌రెడ్డిలతో కలసి మంగళవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో రెండుగంటలపాటు సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతూ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లతోపాటు ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నీరందించేందుకు ఈ గ్రిడ్‌ను రూపొందిస్తున్నామన్నారు. గ్రిడ్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలు, నిధుల అంశాలపై వారంలోగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించనున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వేసవి రాకముందే నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి కృష్ణా మూడోదశ, వచ్చే ఏడాది ఆగస్టు నాటికి గోదావరి ప్రాజెక్టులను ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తిచేస్తామని వారు వివరించారు.  ఈ సమావేశంలో జలమండలి ఎండీ జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

 

వాటర్‌గ్రిడ్ సర్వేకు రూ.105 కోట్లు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం




వాటర్‌గ్రిడ్ ప్రాజె క్టు సర్వే నిమిత్తం రూ.105 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం పరిపాలన ఉత్తర్వులు జారీచేసింది. సర్వేలో భాగంగా పంపిణీ వ్యవస్థ, ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు, 133 కేవీ సబ్‌స్టేషన్ల నుంచి ఫీడర్ లైన్ల ఏర్పాటు తదితర పనుల నిమిత్తం ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం.. 5,227 కిలోమీటర్ల మెయిన్ గ్రిడ్  సర్వేకు రూ.4.20 కోట్లు, 45,809 కిలోమీటర్ల సెకండరీ నెట్‌వర్క్ కోసం రూ.18.32 కోట్లు, గ్రామస్థాయి సర్వే కోసం రూ.7.5 కోట్లు, జీపీఎస్ పరికరాలకు రూ.1.34 కోట్లు, స్టేషన్ పరికరాల కోసం రూ.5.17 కోట్లు, ఇంజినీరింగ్ ప్రిపరేషన్ నిమిత్తం రూ.67.50 కోట్లు, పర్మినెంట్ బేస్ స్టేషన్లకు రూ.50 లక్షలు, సాఫ్ట్‌వేర్ కోసం రూ.45.94 లక్షలు కేటాయిస్తూ నిధులను మంజూరు చేసింది.



http://img.sakshi.net/images/cms/2014-10/81413921273_Unknown.jpg

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top