ఐదేళ్ల బాలిక @ రూ.600

ఐదేళ్ల బాలిక @ రూ.600 - Sakshi


- మనవరాలిని విక్రయించేందుకు యత్నించిన తాతయ్య, అమ్మమ్మలు

- నల్లగొండ జిల్లాలో సంఘటన




చందంపేట: తెలంగాణలో బంగారు తల్లుల విక్రయం ఇంకా కొనసాగుతోనే ఉంది. తల్లీదండ్రులు వదిలివేయడంతో తమ వద్దే పెరుగుతోన్న ఐదేళ్ల చిన్నారిని విక్రయించాలనుకున్నారు అమ్మమ్మా, తాతయ్యలు. పోలీసుల ఎంట్రీతో ఈ దారుణానికి తాత్కాలిక బ్రేక్ పడింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..



నల్లగొండ జిల్లా చందంపేట మండలం కొత్తపల్లి పంచాయితీ పరిధిలోని తండాలో నివసిస్తున్న కంబ్లి, మంగ్లా అనే దంపతులు తమ మనవరాలైన ఐదేళ్ల చిన్నారిని రూ. 600 వందలకు విక్రయించాలనుకున్నారు. ఆమేరకు ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అదే జిల్లాలోని దేవరకొండ మండలం కొండమల్లేపల్లికి చేరుకుని ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారికి బాలికను అప్పగించేందుకు ప్రయత్నించారు.



అయితే బాలికా విక్రయం జరుగుతుందన్న సమాచారం తెలియడంతో రంగంలోకి దిగిన చందంపేట పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి విక్రయాన్ని అడ్డుకున్నారు. చిన్నారి పోషణ తమకు భారంగా మారిందని విక్రేతలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులు, ఇతర బంధువులను పిలిపించి మాట్లాడాలని నిర్ణయించిన పోలీసులు.. కొత్తపల్లి గ్రామ పెద్ద లాలుకు బాలిక సంరక్షణ బాధ్యతలను అప్పగించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top