అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం - Sakshi


- ఆత్మహత్యలతో సమస్యలుపరిష్కారం కావు

- గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి

- గోదావరి నీటితో కరువును పారదోలుతాం

- అప్పులోళ్లు వేధిస్తే..అధికారులకు చెప్పండి

- బాధిత రైతు కుటుంబాలకు మంత్రి హరీశ్‌రావు భరోసా

సిద్దిపేట రూరల్:
‘రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుం దని.. ఏ రైతు ఆధైర్యపడొద్దు’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం స్థానిక శివమ్స్ గార్డెన్‌లో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలతో హరీశ్‌రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని, ఆత్మస్థైర్యం కోల్పోవద్దని సూచించారు.



జిల్లాలో రైతు ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయని దీనికి కారణం గత పాలకుల నిర్లక్ష్యమేనని మండిపడ్డారు. అదే విధంగా సీమాంధ్రుల పాలనలో మెదక్ జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా మంజూరు కాకపోవడంతో  కరువు ప్రాంతంగా మారిందన్నారు. కరువును పారదోలేందుకు గోదావరి నీళ్లు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భగీరత యత్నం చేస్తున్నారన్నారు. గోదావరి నీళ్లు సిద్దిపేటకు వస్తే మెదక్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లోని సుమారు 20 నియోజకవర్గాలకు మేలు జరుగుతుందన్నారు.



ఆత్మహత్య బాధిత కుటుంబాలకు అప్పుల వాళ్లు వేధిస్తే తహశీల్దార్, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పూర్తి సహకారం అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. తెలంగాణలో ఏర్పడిన విద్యుత్ సమస్య కూడా తీరుస్తామన్నారు. అంతకు ముందు నియోజకవర్గంలోని సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లో తొమ్మిది మంది రైతు కుటుంబాలకు రూ. 1.50లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. అలాగే ఆపద్బంధు పథకం కింద ఐదుగురికి రూ. 50వేల చొప్పున చెక్కులను అందించారు.

 

రైతు కుటుంబాలతో కలిసి భోజనం...

రైతు ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలతో  మంత్రులు హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డిలు కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఆయాకుటుంబాల్లో చదువుకునే పిల్లలుంటే పూర్తి సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ కుటుంబాలకు సంబంధించి వైద్య ఖర్చులుంటే ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ కింద అదుకుంటామన్నారు. అదే విధంగా ఆయా కుటుంబాలకు పింఛన్ సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌బొజ్జా, ఆర్డీఓ ముత్యంరెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ నర్సింహారెడ్డి, ఎంపీడీఓలు, నాయకులు రాజనర్సు, మణిక్యరెడ్డి, రాధాకృష్ణశర్మ, రవీందర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top