ఆదుకుంటామని.. ముఖం చాటేశారు


ఐదేళ్లుగా ఎదురు చూస్తున్న బాధిత కుటుంబం

రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన ఇల్లాలు

దీనావస్థలో భర్త, పిల్లలు

ఇప్పటికైనా స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి

 

 రోడ్డు ప్రమాదంలో ఓ ఇంటి దీపం ఆరిపోయింది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ఇల్లాలు అకాల మరణంతో ఆగమైంది. అండగా ఉండి ఆదుకుంటామని, ఆడపిల్లలను చదివిస్తామని, గుడిసె జీవితానికి స్వస్తి చెప్పి ఇల్లు కట్టిస్తామని చెప్పిన నాయకులు ఆ తర్వాత ముఖం చాటేయడంతో మానసిక స్థితి సరిగా లేని తండ్రిని చూసుకుంటూ అష్టకష్టాలు పడుతున్నారు పేదింటి పిల్లలు. నాడు హామీ ఇచ్చిన నేతల సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

- వెల్దుర్తి

 

 వెల్దుర్తి మండలం కుకునూర్ గ్రామ శివారులోని బుడగజంగాల కాలనీకి చెందిన మోతె సత్తెమ్మ, చంద్రయ్య నిరుపేద దంపతులు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జీవనోపాధి కోసం భార్యాభర్తలు వివిధ గ్రామాల్లో నిర్వహించే సంతల్లో పూసలు, అద్దాలు, బొట్టు, పిన్నీసులు తదితర వస్తువులను విక్రయించే వారు. వచ్చిన దాంతో తమ పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ ఆనందంగా సాగుతున్న వారి జీవితం ఒక్కసారిగా ఆగిపోయింది. కలల గూడు చెదిరిపోయింది.



 రోడ్డు ప్రమాదంలో మృత్యువాత

 టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో 2011 ఫిబ్రవరి 6న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు హాజరయ్యేందుకు నియోజకవర్గంలోని చిన్నశంకరంపేటకు చెందిన నాయకులు, కార్యకర్తలు వెల్దుర్తి మీదుగా నర్సాపూర్ బయలు దేరారు. ఈ క్రమంలో కుకునూర్ నుంచి వెల్దుర్తికి టీవీఎస్‌పై వెళ్తున్న మోతె సత్తెమ్మ, చంద్రయ్యను బహిరంగ సభకు వెళ్తున్న వాహనాల శ్రేణిలో ఓ డీసీఎం వీరిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన సత్తెమ్మ అదే రోజు మృత్యువాత పడింది.



విషయం తెలుసుకున్న స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు, ప్రస్తుత టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళియాదవ్ మృతురాలి కుటుంబాన్ని సందర్శించి ఓదార్చారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పిల్లలకు బట్టలు, బియ్యం, కొంత ఆర్థిక సహాయం అందజేశారు. ఇద్దరు ఆడపిల్లలను హాస్టల్‌లో చదివించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని, పక్కా గృహం నిర్మించి ఇస్తామని చెప్పారు. కాలం గడిచిపోయింది కానీ హామీ ఇచ్చిన నేతలు మళ్లీ కానరాలేదు.

 

 ప్రభుత్వమే ఆదుకోవాలి..

 అమ్మ మృతితో మా సంతోషం పోయింది. నాన్న ఆరోగ్యం సరిగా ఉండడం లేదు. అన్న పేతూరు కూలీపనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నేను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నా. రెండేళ్ల క్రితం అక్క వివాహం కాలనీ వాసుల ఆర్థికసాయంతో చేశాం. ఉండేందుకు ఇల్లు లేక ఇప్పటికీ గుడిసెలోనే జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వమే మమ్ములను ఆదుకోవాలి.

 - మౌనిక, మృతురాలి కుమార్తె

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top