పంచాయతీలకు సర్కార్ ‘షాక్’

పంచాయతీలకు సర్కార్ ‘షాక్’ - Sakshi


కరీంనగర్ సిటీ: గ్రామపంచాయతీలు బకాయిపడ్డ విద్యుత్ బిల్లుల చె ల్లింపులో ప్రభుత్వం తిరకాసు పెట్టింది. బిల్లుల చెల్లింపు నుంచి తెలివిగా తప్పుకున్న సర్కారు... బకాయిల భారాన్ని పంచాయతీలపైనే వేసింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలు మంజూరు చేస్తున్న 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్‌ఎఫ్‌సీ) నిధుల్లోంచి 25 శాతం విద్యుత్ బిల్లుల కోసం వినియోగించుకోవాలని ఆదేశించింది. అసలే అంతంతమాత్రంగా వస్తున్న నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలా? కరెంటు బిల్లులు చెల్లించాలా? అని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



 పైగా సర్కారు విడుదల చేస్తున్న అరకొర నిధుల్లోంచి 25 శాతంతో సగం బకాయిలు కూడా తీర్చే పరిస్థితి లేదని అంటున్నారు. జిల్లాలో 1207 పంచాయతీలు ఉండగా, పలుచోట్ల ఏళ్ల తరబడి విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. జిల్లావ్యాప్తంగా రూ.64 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ట్రాన్స్‌కో అధికారులు పలుసార్లు నోటీసులు జారీ చేసినా.. ప్రభుత్వమే చెల్లిస్తుందని పంచాయతీలు స్పందించలేదు. ఈ బకాయిలు రాబట్టుకునేందుకు విద్యుత్ అధికారులు పంచాయతీల్లో వీధిదీపాలు, తాగునీటి పథకాలకు కరెంట్ కట్ చేశారు.



దీంతో స్పందించిన జిల్లా పంచాయతీ అధికారి విద్యుత్ బకాయిలు చెల్లించడానికి గ్రామపంచాయతీలకు అనుమతిస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఆ బకాయిలను ప్రభుత్వం నేరుగా చెల్లించకుండా, గ్రామపంచాయతీలే తమకు వస్తున్న నిధుల నుంచి చెల్లించాలంటూ మెలిక పెట్టారు. ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి కేటాయిస్తున్న 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధుల నుంచి 25 శాతం వాడుకోవాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా, వీధిదీపాలు తదితర అవసరాల కోసం గ్రామపంచాయతీలు విద్యుత్‌ను వినియోగిస్తుంటాయి.



ఈ చార్జీలను మేజర్ పంచాయతీలు భరిస్తుండగా, మైనర్ పంచాయతీల బిల్లులన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేది. ఇప్పుడు ఆ భారాన్ని పంచాయతీల నెత్తిన వేసింది. అసలే అంతంతమాత్రంగా నిధులు వస్తుంటే, అందులోంచి విద్యుత్ చార్జీలు చెల్లిస్తే పంచాయతీలకు చిల్లిగవ్వ కూడా మిగిలే పరిస్థితి లేదని సర్పంచులు పేర్కొంటున్నారు. కొన్ని పంచాయతీల్లో మంజూరయ్యే నిధులకంటే విద్యుత్ బకాయిలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే నేరుగా చెల్లించాలని సర్పంచుల సంఘం డిమాండ్ చేస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top