సర్కారు బడులకు విద్యుత్ గుదిబండ?


ఘట్‌కేసర్ టౌన్: వాణిజ్య కేటగిరి కింద బిల్లులు రావడంతో సర్కారు బడులకు విద్యుత్ బిల్లుల చెల్లింపు భారంగా మారాయి. పాఠశాలల నిర్వహణకు ఏటా ప్రభుత్వమిచ్చే నిధుల్లో కోతలు విధించడంతో ఏమి చేయాలో తోచక ప్రధానోపాధ్యాయులు అయోమయంలో ఉన్నారు. మన టీవి, కంప్యూటర్ల ద్వారా సాంకేతిక విద్య,  మీనా కార్యక్రమంతో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు రేడియో ద్వారా విజ్ఞానాన్ని అందించే  కార్యక్రమాలను అమలు చేయడానికి పాఠశాలల్లో విద్యుత్ కనెక్షన్ తప్పనిసరి.



గతంలో సర్కారు బడుల విద్యుత్  బిల్లులన్నీ ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు చెల్లించేది. కొంత కాలంగా రాజీవ్ విద్యామిషన్ విడుదల చేస్తున్న నిధుల నుంచి విద్యుత్ బిల్లులను చెల్లిస్తున్నారు. పాఠశాల యాజమాన్య  కమిటీ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంయుక్త బ్యాంకు ఖాతాకు ప్రభుత్వం నిధులను విడుదల చేస్తోంది. మండలంలో 72 ప్రభుత్వ పాఠశాలలుండగా జిల్లాలో 2500లకు పైగా ప్రభుత్వ పాఠశాలలున్నాయి.  



సర్కారు చదువు వాణిజ్యమా?

పాఠశాలల నిర్వహణ కు ప్రభుత్వ పాఠశాలలకు  కేటాయించే అరకొర నిధులు ఏ మూలకూ  సరిపోవడం లేదని, సర్కారు బడులకు వాణిజ్య కేటగిరి కింద విద్యుత్ బిల్లును వేయడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుగా ఉందని ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



రాజీవ్ విద్యా మిషన్ ద్వారా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు నిర్వహణకు రూ. 5 వేలు, గ్రాంట్స్ రూపేణా గదుల సంఖ్యను బట్టి రూ.7 వేలు , అలాగే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ద్వారా ఉన్నత పాఠశాలల నిర్వహణకు రూ.10 వేలు, గ్రాంట్స్ రూపేణా రూ. 7 వేల నిధులను ఏటా అందిస్తున్నారు.



పాఠశాలల్లో విద్యార్థులకు మరుగుదొడ్లు, తాగునీరు, రేడియో, టీవీ, కంప్యూటర్ల వినియోగం ఎక్కువ కావడంతో చెల్లింపులు ఇబ్బందిగా మారింది. సర్కారు బడులకు వాణిజ్య కేటగిరి కింద విద్యుత్ బిల్లులు రావడంతో నెలకు సరాసరి రూ. 1000లకు పైగా బిల్లు రావడంతో వచ్చిన నిధులన్నీ విద్యుత్ బిల్లుల చెల్లింపులకే సరిపోతున్నాయంటున్నారు.  పేదలు చదివే ప్రభుత్వ బడులకు వాణిజ్య కేటగిరిగా పరిగణించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. గృహ కేటగిరి, వాణిజ్య కేటగిరి మధ్యన చాలా వ్యత్యాసం ఉందని గుర్తు చేస్తున్నారు.



తక్షణమే సర్కారు బడుల కనెక్షన్లను గృహ విభాగంలోకి మార్చి ప్రభుత్వమే బిల్లులు చెల్లించేలా తగు చర్యలు తీసుకోవాలని యాజమాన్య కమిటీలు కోరుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top