కలెక్టర్ సారు.. కరుణించరూ..

కలెక్టర్ సారు.. కరుణించరూ.. - Sakshi


నేరుగా కలవలేక.. రాస్తున్నాం ఈ లేఖ..

* తాగేందుకు నీళ్లు లేవు.. తినేందుకు సరైన భోజనం లేదు

* మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక అవస్థలు

* 30 పాఠశాలల్లో టెన్త్‌కు టీచర్లే కరువు


* 46 ఎంఈవో పోస్టులకు గాను 42 ఖాళీ

* జిల్లాలో డిప్యూటీ డీఈవోలు లేరు


* సమస్యల వలయంలో సరస్వతీ నిలయాలు

* జిల్లా విద్యార్థుల గోడు


 

మాన్యశ్రీ కలెక్టర్ గారికీ...

‘మేము.. మెతుకుసీమ సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులం. చిన్న తరగతి.. పెద్ద తరగతి పిల్లలను కలుపుకుంటే మొత్తం 5.15 లక్షల మంది పిల్లలం ఉన్నాం.  జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత ప్రభుత్వ పాఠశాలలు 2,899 ఉండగా.. ఇందులో 1,160 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 32 పాఠశాలలకు అసలే ఉపాధ్యాయులు లేరు. 920  ఏకోపాధ్యాయ పాఠశాలలు కావడంతో ఏ కారణం చేతనైనా ఉపాధ్యాయుడు రాకపోతే ఆ బడికి అనధికారిక సెలవు ప్రకటించినట్లే. అదేవిధంగా జిల్లాలో 46 మండలాలకు గాను 42 మండల విద్యాశాఖ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 5 డిప్యూటీ డీఈవోలుకు గాను  అన్ని పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. వీరిని భర్తీ చేయక పోవడంతో ఆయా మండలాల్లో ఉన్న సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు, పదోతరగతి సబ్జెక్టు టీచర్లు లేని ప్రాంతాలకు సర్దుబాటు చేస్తూ డిప్యుటేషన్లు వేశారు.



ఇందులో పలు అక్రమాలకు తావిచ్చారని, అధికార, అండ బలం ఉన్నవారికి మంచి ప్రదేశాల్లో వేశారని, పలువురు ఉపాధ్యాయులు డిప్యుటేషన్‌పై వెళ్ళేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో జిల్లాలోని 30 పాఠశాలల్లో పదో తరగతిలో కీలక సబ్జెక్టులు బోధించే వారే కరువయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో ఎక్కువమంది హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో నివాసం ఉంటూ వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్నారు. దీంతో సమయ పాలన విస్మరిస్తున్నారు. వందలాది పాఠశాలల్లో బస్సు వచ్చే సమయమే బడి సమయంగా మారింది. వర్షం కురిసినా సమయానికి బస్సు రాకపోయినా బడికి సెలవే. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కొల్పోయి మా తల్లిదండ్రులు అప్పులు చేసైనా ప్రైవేట్ పాఠశాలలకు పంపించాల్సి వస్తుంది.  పాఠశాలల్లో స్వీపర్లు లేక, ఉన్న వారికి సకాలంలో వేతనాలు అందక పోవడంతో పాఠశాలలను ఊడ్చి, నీళ్లు చల్లే పనులు మేమే చేసుకుంటున్నాం. చిట్టీ చేతులతో బడిని ఊడ్చడం, గంట కొట్టడం చేస్తున్నా మమ్ములను చూసి అయ్యో అన్నారే తప్పా. స్వీపర్లను నియమించిన వారు లేరు.



జిల్లాలో 240 పాఠశాలలకు తాగునీటి సౌకర్యం లేదు, విద్యార్థులు తాగడానికే నీరు లేకపోవడంతో ఉన్న టాయిలెట్స్‌ను శుభ్రం చేసే పరిస్థితి లేక కంపు కొట్టడంతో అక్కడ మలవిసర్జన చేయలేక పోతున్నాం. ఆడ పిల్లలైతే పాఠశాలకు దూరంగా వెళ్ళి మలవిసర్జన చేయాల్సి వస్తుంది. రాజీవ్‌విద్యామిషన్, ఆర్‌ఎంఎస్‌ఏ తోపాటు ఇతర పాఠశాల గ్రాంట్లు 2012-13, 2013-14 విద్యాసంవత్సరంలో జిల్లాలో ఉన్నత పాఠశాలలకు 562, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు మరో 1200 అదనపు తరగతి గదులు కావాలని ఉన్నతాధికారులే గుర్తించారు. అయితే జిల్లా అధికారుల కోరిక మేరకు జిల్లాకు రూ. 32.84కోట్లు మంజూరు చేశారు. వీటిలో ఇప్పటి వరకు 1058 అదనపు తరగతి గదుల నిర్మాణం పనులు ప్రారంభించారే తప్పా. వాటిని పూర్తి చేయడంలేదు. దీంతో శిథిలావస్థకు చేరుకున్న గదులు ఎప్పుడు కూలిపోతాయో అని బిక్కు బిక్కు మంటూ ఉండాల్సి వస్తోంది.



వర్షం వస్తే చెరువును తలపించే విధంగా పాఠశాలలు ఉండటంతో అష్టాచెమ్మా ఆడిన విధంగా బురుదలో వేసిన రాళ్ళపై నుండి బడిలోపలకి వెళ్తున్నాం. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉండాలని అధికారులు మీటింగ్‌లు పెట్టి చెబుతున్నారు. ఈ లెక్కన 1867 మరుగుదొడ్లు అవసరమని అధికారులు లెక్క తేల్చారు. కానీ వీటి నిర్మాణం చేపట్టలేదు. గత సంవత్సరం మంజూరైనా ఆర్వీఎం, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల మధ్య సమన్వయం లోపించి సుమారు 130పైగా మరుగుదొడ్ల నిర్మాణాలు నిలిచి పోయాయి.

 

కాకి లెక్కలే మాకు పాఠాలు...


మధ్యాహ్న భోజన పథకం కింద 2025 వంట గదులు కాగ 900 గదులు పూర్తి చేసినట్లు అధికారులు నివేదికలు సిద్ధం చేశారు కానీ అవి ఎక్కడ పూర్తి చేశారో అంతు చిక్కడం లేదు.  ఏజెన్సీలకు  మూడు నెలలుగా  రూ. 3.75 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ ఏడాది ఇంకా డబ్బులు రాలేదటా!.. దీంతో అప్పు చేసి వంట చేస్తున్నామంటూ భోజనంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. అధికారులేమో వంట డబ్బులు బాకీ లేమంటున్నారు.  అన్నీ కకిలెక్కలే పట్టణాల్లో ఉన్న పాఠశాలలకు ఒక్కరిద్దరు ఏజెన్సీలు తీసుకొని ఎక్కడో వంట చేసి ట్రాలీ ఆటోలపై తీసుకవచ్చి పెడుతున్నారు.  నాణ్యతను ప ట్టించుకున్న వారే లేరు.  కంప్యూటర్ విద్యను నేర్పిస్తామని కంప్యూటర్లు పంపించారు. గతేడాది క్లాసులు చెప్పినవారు.  జీతాలు ఇవ్వడంలేదని సార్లు మానేశారు.    మా స్కూళ్లపై మీరు దృష్టి పెడితే తప్ప గాడిన పడే అవకాశంలేదు. మీ మీద నమ్మకంతో ఈ ఉత్తరం రాస్తున్నాం..

 ఇట్లు.. తమ విధేయులు, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top