డీఈవోపై వేటు

డీఈవోపై వేటు


సస్పెండ్ చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ

- టీచర్ల బదిలీల్లో అక్రమాల ఫలితం

- వరంగల్‌ను విడిచి వెళ్లకూడ దని ఆంక్షలు

- ఇన్‌చార్జి డీఈవోగా ఆర్‌జేడీకి బాధ్యతలు

- ఇక డిప్యూటీ డీఈవోల వంతు!

విద్యారణ్యపురి :
టీచర్ల బదిలీల్లో అక్రమాల వ్యవహారంపై సర్కారు స్పందిం చింది. జిల్లా విద్యాశాఖాధికారి వై.చంద్రమోహన్‌ను సస్పెండ్ చేసింది. ప్రజాప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. బదిలీల్లో అక్రమాలపై సమగ్ర విచారణ నేపథ్యంలో చంద్రమోహన్ వరంగల్ నగరం విడిచి వెళ్లవద్దని స్పష్టం చేసింది. పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ బాలయ్యకు డీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య శనివారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

 

ఇదీ జరిగింది..

ఇటీవల జరిగిన టీచర్ల బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకోవడంతో.. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన నియోజకవర్గంలోని పలుచోట్ల టీచర్ల అక్రమ బదిలీలు జరిగాయని జాబితాతో సహా వచ్చి డీఈవోను నిలదీశారు. విద్యాశాఖ బాధ్యతలను చూస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి పిర్యాదు చేశారు. జిల్లాలోని టీచర్ల బదిలీల అక్రమాలపై ఫిర్యాదుల అంశాన్ని ‘సాక్షి’ పత్రిక వరుస కథనాలు ప్రచురించింది. దీంతో ఈ అంశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బదిలీల్లో అక్రమాలపై ఆరోపణల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ చిరంజీవులు.. అడిషనల్ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. సత్యనారాయణరెడ్డి ఈనెల 29న డీఈవో కార్యాలయానికి వచ్చి విచారణ జరిపారు.



ఆరోపణలపై సంబంధిత టీచర్ల ఆప్షన్‌ల ఫారాలు పరిశీలించారు. ప్రధానంగా ఒక్కసారి టీచర్లను బదిలీ అయ్యాక ఎట్టి పరిస్థితుల్లో మాడిఫికేషన్ చేయకూడదు. డీఈవో చంద్రమోహన్ పలువురి టీచర్లకు ఇలా మాడిఫికేషన్ చేసినట్లు వెల్లడైంది. మరోవైపు పలుచోట్ల టీచర్లు తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్‌టైటిల్‌పాయింట్లు పొంది బదిలీ చేయించుకున్నారని తేలింది. ఇలా బదిలీల్లో అనేక ఆరోపణలు వచ్చాయి. మొత్తంగా జిల్లాలో టీచర్ల బదిలీల్లో అనేక రకాలుగా అక్రమాలు చోటుచేసుకోవడం, ముడుపులు తీసుకొనే అవకతకలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో సత్యనారాయణరెడ్డి విచారణ నివేదికను పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ అందజేశారు.



పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అక్రమాలు జరిగాయనేది వెల్లడికావడంతో డీఈవో చంద్రమోహన్‌పై ప్రభుత్వం వేటు వేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రజాప్రయోజనాల దృష్ట్యా డీఈవో చంద్రమోహన్‌ను సస్పెన్షన్ చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. బదిలీలపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని తెలుస్తోంది. కాగా, చంద్రమోహన్ వరంగల్ డీఈవోగా 2014 నవంబర్ 18న బాధ్యతలను స్వీకరించారు. 8 నెలల 14 రోజులు బాధ్యతలు నిర్వర్తించి సస్పెండ్ అయ్యారు.

 

ఆర్‌జేడీ బాలయ్యకు అదనపు బాధ్యతలు

వరంగల్‌లోని పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ బాలయ్యకు ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇన్‌చార్జి డీఈవోగా అదనపు బాధ్యతలు ఇస్తున్నట్లుగా హైదరాబాద్‌లోని పాఠశాల విద్యా శాఖ డెరైక్టర్ కార్యాలయం నుంచి సమాచారం బాలయ్యకు అందజేశారు. బాలయ్య ఖమ్మం జిల్లా గార్లబయ్యారం ప్రాంతానికి చెందిన వారు. గత రెండేళ్లగా వరంగల్‌లో పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీగా పని చేస్తున్నారు. మూడురోజుల క్రితమే ఖమ్మం డీఈవోగా పని చేస్తున్న రవీందర్‌రెడ్డిని ప్రభుత్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు రిలీవ్ చేసింది.



బాలయ్యకు ఖమ్మం జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించింది. బాలయ్య ఈ నెల 3న ఖమ్మం డీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తాజాగా వరంగల్ జిల్లా బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. బాలయ్య రెండు జిల్లాల బాధ్యతలను నిర్వర్తించడం ప్రస్తుత పరిస్థితులో ఇబ్బందికరంగానే ఉండనుంది. వరంగల్‌కు పూర్తిస్థాయి డీఈవోగా ఎవరు వస్తారనేది చర్చనీయాంశంగా మారింది. రాజేష్, రాజీవ్, లక్ష్మిబాయిలలో ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

ఇక డిప్యూటీ డీఈవోల వంతు!

టీచర్ల బదిలీల అక్రమాలల్లో డిప్యూటీ డీఈవోల పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ఫిర్యాదులు అందుతున్నాయి. డిప్యూటీ డీఈవోలపై పలు ఉపాధ్యాయ సంఘాలు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. బదిలీల్లో అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే బాధ్యులైన డిప్యూటీ డీఈవోలపైనా చర్యలు ఉంటాయని భావిస్తున్నారు.



ముగ్గురు డిప్యూటీ డీఈవోలపై ఆరోపణలున్నాయి. మరోవైపు కలెక్టర్ వాకాటి కరణ టీచర్ల బదిలీల అక్రమాల వ్యవహారంపై విచారణకు ఏజేసీ తిరుపతిరావు నియమించటంతో ఇక అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరగబోతుంది. విద్యాశాఖాధికారితోపాటు డిప్యూటీ డీఈవోల పాత్ర కూడా ఇందులో వెలుగులోకి రానుందని భావిస్తున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చిన టీచర్లు, సరిగా స్రూట్నీని చేయని ఇన్‌చార్జి ఎంఈవోలపాత్రపైనా విచారణ జరిగే అవకాశం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top