విద్యుత్ ప్రమాదాల నివారణకు కదిలిన సర్కార్

విద్యుత్ ప్రమాదాల నివారణకు కదిలిన సర్కార్


 ప్రత్యేక కార్యాచరణతో ముందుకు..

- పెలైట్ ప్రాజెక్ట్ కింద గజ్వేల్ ఎంపిక

- వెల్లడించిన ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి

- ఎర్తింగ్ లోపాల నివారణకు మండలానికో రూ. లక్ష

- సబ్‌స్టేషన్లను సందర్శించిన సీఎండీ


 గజ్వేల్: పంటపొలాల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద సొంత మరమ్మతుల కారణంగా జిల్లాలో రైతులు పిట్టల్లా రాలిపోతున్న దుస్థితిపై సర్కారు ఎట్టకేలకు దృష్టిసారించింది. ప్రత్యేకించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పరిస్థితి అధ్వానంగా ఉండటంతో ఈ నియోజకవర్గాన్ని పెలైట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి పూర్తి స్థాయిలో ప్రమాదాల నివారణకు కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 15న జిల్లాలోని సమస్య తీవ్రతను ఎత్తిచూపుతూ ‘సాక్షి’  కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో స్పందించిన ఎస్పీడీసీఎల్ (సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) సీఎండీ రఘుమారెడ్డి బుధవారం గజ్వేల్‌ను సందర్శించారు.



ఈ సందర్భంగా పట్టణంలోని 33/11కేవీ, 133/33కేవీ సబ్‌స్టేషన ఆవరణలోని ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాల నివారణకు అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు వెల్లడించారు. పంటపొలాల్లో వేలాడుతున్న స్తంభాలు, వైర్లను సరిచేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడతామన్నారు. మరోవైపు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఎర్తింగ్ లోపాల నివారణకు మండలానికో లక్ష రూపాయలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.



ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోని ఏఈ కార్యాలయాల్లో ఫిర్యాదుల రిజిష్టర్‌ను నిర్వహిస్తామని తెలిపారు. రైతులు, ప్రజలు ఎవరైనా తమ ఫిర్యాదును నమోదు చేస్తే పరిశీలన జరిపి వారంరోజుల్లో నివారణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.  రైతులు సొంతంగా మరమ్మతులు చేసి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దని కోరారు. సిబ్బంది కొరత వల్ల గ్రామాల్లో ఇబ్బందులు వస్తున్న మాట వాస్తవమేనని వెల్లడించారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. మరోవైపు ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కేంద్రాల్లో వేగంగా సేవలందించేందుకు కూడా చర్యలు చేపడుతున్నామన్నారు.



రైతులు ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయి వచ్చిన వెంటనే రెండుగంటల్లోపు దానిని మరమ్మతు చేయించి ఇవ్వడం లేదా కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఇవ్వడం చేస్తామన్నారు. మరమ్మతు కేంద్రాల్లో సేవలకు రైతులు ఒక్కరూపాయి కూడా ఇవ్వొద్దని, ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. గజ్వేల్‌లో లోడింగ్, అన్‌లోడింగ్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని కొందరు ఫిర్యాదు చేయగా ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ రాములు, డీఈ యాదయ్య, గజ్వేల్ ఏడీఈ జగదీష్, ఏఈ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top