ప్రభుత్వ భూమిలో ‘ప్రైవేటు' పట్టా


ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. సర్కారు స్థలమైతే ఏకంగా పట్టాలనే సృష్టిస్తున్నారు. జిల్లాలో ఇలాంటి సంఘటనలు రోజుకో చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. వీటిని తలదన్నే రీతిలో తాజాగా సోమవారం మంథనిలో ఓ భూబాగోతం బయటపడింది.



ఖాళీ స్థలంతో పాటు ఆర్డీవో వసతిగృహం, రెండు ప్రభుత్వ కార్యాలయాలున్న స్థలాన్ని పట్టా, రిజిస్ట్రేషన్ చేసుకుని దానిని మరో ముగ్గురికి అమ్మినట్టు రిజిస్ట్రేయడంతో పాటు దానిని ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తీరు అధికారులనే నివ్వెరపర్చింది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు కూపీ లాగుతున్నారు.

 

మంథని : మంథని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట 108 సర్వే నంబరులో 36 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో సుమారు 18 గుంటల్లో ఆర్డీవో వసతిగృహం, మరో రెండు కార్యాలయాల పక్కా భవనాలు నిర్మించారు. మిగిలిన 18 గుంటల్లో నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘానికి కేటాయించారు. ఈ సంఘానికి కేటాయించిన భూమిలో ఇటీవల ప్లాట్లు చేస్తుండడంతో అనుమానం వచ్చిన ఉద్యోగులు సంబంధిత అధికారులను సంప్రదించారు.  



అధికారులు దీనిపై ఆరా తీయగా.. ఈ 36 గుంటల భూమి ముస్కె రాజు అనే వ్యక్తి పేరిట పట్టా అయిన విషయం బయటపడింది. సదరు పాసు పుస్తకాలు ఆన్‌లైన్‌లోనూ నమోదయ్యాయి. మరింత లోతుగా ఆరా తీస్తే.. ఈ భూమిని మరో ముగ్గురికి విక్రయించడంతో పాటు వారి పేరిట రిజిస్ట్రేషన్ అయిన విషయం వెలుగుచూసింది. ఈ ప్రాంతంలో గుంట స్థలానికి రూ.6-8 లక్షల ధర పలుకుతోంది. అంటే ఈ భూమి విలువ సుమారు 3కోట్లు.



 ఎలా జరిగింది..?

 ఫోర్జరీ సంతకాలతో పాసుపుస్తకాలను సృష్టించడం ఈ మధ్యకాలంలో పెద్ద కష్టమేమీ కాకపోయినా ఆన్‌లైన్ నమోదు మాత్రం అంత ఆషామాషీ కాదు. రైతు తన పేరును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే.. వీఆర్వో ధ్రువీకరించిన అనంతరం తహశీల్దార్ తన డిజిటల్ సంతకం ద్వారా నమోదు చేస్తారు. కానీ ఇక్కడ అలా కాకుండా గతంలో తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసిన ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్లు మంథని ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో తమకున్న కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఈ వ్యవహారాన్ని నడిపినట్లు తెలుస్తోంది.



విచారణ వేగవంతం

ప్రభుత్వ స్థలం ఓ ప్రైవేటు వ్యక్తి పేరిట పట్టా, రిజిస్ట్రేషన్ జరిగిందని తెలిసిన వెంటనే రెవెన్యూ అధికారులు తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది. సబ్‌రిజిస్ట్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందో వివరాలు సేకరించి అక్కడ సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ చేపడుతున్నట్లు సమాచారం. ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరి పాత్ర ఉందనే కోణంలో అధికారులు విచారణ ముమ్మరం చేశారు.



ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అక్రమంగా పాస్‌బుక్‌లు నమోదు చేయడాన్ని సైబర్ నేరంగా భావించి ఆ దిశగా ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. అలాగే పట్టా, రిజిస్ట్రేషన్ రద్దు చేయించి సదరు బాధ్యులపై చర్యలకు కఠిన చర్యలకు సిద్ధమైనట్టు తెలిసింది.

 

 పాస్‌బుక్ ఆధారంగానే రిజిస్ట్రేషన్

 పట్టాదారు పాస్‌బుక్, ఆన్‌లైన్ నమోదు రికార్డుల ఆధారంగానే మేం రిజిస్ట్రేషన్ చేశాం. భూమి వివరణలో పట్టా ఉండడమే కాకుండా పట్టాదారు, అనుభవదారు ఖాతాలో యజమాని పేరు నమోదైంది. అన్ని ఆధారాలున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయకపోతే తమను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇందులో మాత తప్పేమీ లేదు.

 - మురళీకృష్ణ,  సబ్ రిస్ట్రార్, మంథని

 

పూర్తిగా ప్రభుత్వ భూమే..

మంథని ఎంపీడీవో కార్యాలయం ఎదుట 108 సర్వే నంబర్‌లో ఉన్న 36 గుంటల భూమి ప్రభుత్వానిదే. ఈ భూమి అక్రమంగా పట్టా కావడం అయి, పాస్‌బుక్ జారీ కావడం, ఆన్‌లోన్‌లో నమోదవడం, రిజిస్ట్రేషన్ చేయడంపై వివచాణ జరుపుతున్నాం. దీనికి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటాం.  

 - జల్ల సత్తయ్య, తహశీల్దార్, మంథని

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top