మద్దతుధర ఇవ్వడంలో సర్కార్‌ విఫలం

మద్దతుధర ఇవ్వడంలో సర్కార్‌ విఫలం - Sakshi


- మిర్చి, ధాన్యం, కందులు, పసుపు రైతుల కష్టాలు పట్టవా..?

- వైఎస్సార్‌ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి




సాక్షి, ఖమ్మం: ‘‘మిర్చి, ధాన్యం, కందులు, పసుపునకు మద్దతుధర ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రైతులు నానా కష్టాలు పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు’’వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్చికి రూ.12 వేల నుంచి రూ.14 వేలు మద్దతు ధర ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.2.500 నుంచి రూ.3 వేలు వరకే ఇస్తున్నారని, దీంతో కడుపు మండిన రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారన్నారు. మిర్చి రైతులు సాగు ఖర్చులు కూడా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కంది, ధాన్యం, పసుపు రైతులది కూడా ఇదే పరిస్థితి అన్నారు. రాష్ట్రంలో రూ.17వేల కోట్ల రుణమాఫీ చేయడానికి మూడేళ్లు పట్టిందని, దీంతో బ్యాంకుల్లో తీసుకున్న అప్పుకు రైతులే వడ్డీ చెల్లించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో మూడేళ్లలోనే రాష్ట్రంలో 2,256 మంది రైతులు చనిపోయారన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ తెలం గాణ రాష్ట్ర శాఖ ప్లీనరీ జూలైలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్లీనరీకి ముందు లేదా ఆ తర్వాత నిజాం కళాశాల గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.

మండుటెండలో వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ

వైఎస్సార్‌సీపీ ఖమ్మం జిల్లా పార్టీ సమావేశం సందర్భంగా ఖమ్మం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక్కడ పార్టీ నూతన జిల్లా కార్యాలయానికి తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. అనం తరం ఏర్పాటు చేసిన పార్టీ సమావేశానికి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నాయకులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా  శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఐదు ఎమ్మెల్యే స్థానాలతోపాటు ఎంపీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుందని, జగనన్న లక్ష్యం ఇదేనని అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top