గీత.. మారని రాత

గీత.. మారని రాత - Sakshi


ఈత వనాలు మగ్గిపోవడంతో గీత కార్మికుల జీవనం ప్రశ్నార్థకంగా మారింది. ఉపాధి లేక ఆదాయం చాలక పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు తాళలేక గీత కార్మికులు వలసలు పోవాల్సిన దుస్థితి నెలకొంది. రెంటల్ తగ్గించి రాయితీలు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా శాశ్వత పరిష్కారాలను చూపించడం లేదు. ఆదాయ వనరుల కోసం మద్యాన్ని ప్రోత్సహిస్తూ గీత వృత్తిని నీరుగారుస్తోందన్న ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.

 

* అంతరిస్తున్న ఈత  వనాలు


* ఉపాధిలేక వలసలు

* మామూళ్ల మత్తులో అధికారులు


మునిపల్లి: మండలంలో 2013లోని వివరాల ప్రకారం మొత్తం టీసీఎస్సీలు 5 (మునిపల్లి, తాటిపల్లి, కంకోల్, పొల్కంపల్లి, ఖమ్మంపల్లి) ఉన్నాయి. ఆయా గ్రామాల పరిధిలో సుమారు 2,430 ఈత చెట్లు 59 మంది గీత సభ్యులున్నారు. ఏటా సభ్యత్వానికి గాను 60,750 రెంటల్‌ను ప్రభుత్వానికి చెల్లిస్తున్నారని ఎక్సైజ్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే టీఎస్సీలు 16 గ్రామాలుండగా మరో గ్రామం కొత్తగా సభ్యత్వం పొందింది. అంతారం, బుదేరా, బస్సారెడ్డిపల్లి, బొడపల్లి, చీలపల్లి, పెద్దచల్మెడ, చిన్నచల్మెడ, గార్లపల్లి, గోపులారం, లింగంపల్లి, లోనికలాన్, మన్‌సాన్‌పల్లి, మల్లిఖార్జునపల్లి, మేళసంగ్యం, మక్తక్యాసారం, పిల్లోడి, తక్కడపల్లి గ్రామాలలో గీత కార్మికులున్నారు. 17 గ్రామాల్లో 60 మంది కార్మికులు 60 టీఎస్సీలు, 3,530 ఈత చెట్లకు ప్రభుత్వానికి లక్షా 38వేల 750 రూపాయల రెంటల్‌ను ప్రభుత్వానికి చెల్లిస్తున్నామని ఆయా గ్రామాల గీత కార్మికులు చెబుతున్నారు.



నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో వచ్చిన ఆదాయం కుటుంబ పోషణకు ఏ మాత్రం సరిపోవడం లేదని గీత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొంత మంది గ్రామాలను విడి చి పట్టణాలకు వలస వెళ్లిన ఘటనలున్నాయి. మహబుబ్ నగర్ జిల్లా కొడంగల్ తాలూకా మగ్దూర్ మండలం కొమ్మూర్, సందాస్‌ంపల్లి గ్రామాల నుంచి గీత కార్మికులను కాంట్రాక్టర్‌లు తెచ్చి తాటిపల్లి గ్రామంలో ఈత చెట్ల నుంచి కల్లును తీయిస్తూ డిపోలకు తరలించి తిరిగి గ్రామాలకు కల్లును సీసాల్లో లారీలు, డీసీఎంలలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఇదే కాకుండా మండలంలోని ఆయా గ్రామాలలో పరిస్థితి ఇదే విధంగా ఉందనే అరోపణలు లేకపోలేదు.

 

ఈత వనాలు అంతరించడానికి కారణం..

వర్షాభావ పరిస్థితులు, వృత్తిలో నైపుణ్యం తగ్గడం, ప్రభుత్వ భూములు, కొన్ని సంఘాలకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో చెట్లను పెంచుకునే అవకాశమున్నా గీత కార్మికులు ముందుకు రాకపోవడం వల్ల ఈత వనాలు రోజు రోజుకు అంతరించిపోతున్నాయి. పంటల సాగుకోసం, భూస్వాములు ఈత చెట్లను తొలగించి వ్యవసాయ భూములుగా మారుస్తున్నారు. ప్రస్తుతం గీత కార్మికులకు మంజూరు ఉన్న ఈత చెట్లలో 20 శాతం కూడా లేకుండా పోయాయి.

 

పట్టించుకోని సర్కారు


గీత కార్మికుల భవిష్యత్తును ప్రభుత్వం విస్మరించింది. ఈత పెంపకం కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమని చెప్పవచ్చు. కార్మికులను చైతన్య పరిచి చెట్లను పెంచేలా చర్యలు చేపట్టడం లేదనే విమర్శలున్నాయి. రెంటల్‌ను మాత్రం కార్మికుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తుందని గీత కార్మికులు వాపోతున్నారు.

 

కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం

కల్లు కాంట్రాక్టర్లు నయానో భయానో గీత కార్మికుల దగ్గరనే లెసైన్సులను తీసుకుని నెలసరి వేతనంతో పని చేయించుకుంటున్నారనే విమర్శలున్నాయి. లెసైన్సులు ఉన్న గీత కార్మికులు సొంతంగా షాపు నిర్వహించుకుంటే ఎక్సైజ్ అధికారులతో దాడులు చేయించి కేసు నమోదు చేయిస్తున్న సంఘటనలున్నాయి. కొందరి షాపు నిర్వహకుల దగ్గర నుంచి ప్రతి నెలకు రూ.3-5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు అరోపణలున్నాయి. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి పెద్దమొత్తంలో వసూలు చేస్తుండడం వల్లే పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తనిఖీలు చేస్తున్నామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top