కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త

కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త - Sakshi


క్రమబద్ధీకరణకు సర్కారు పచ్చజెండా

 

అయిదేళ్ల సర్వీసు ఉంటేనే అర్హులు

విధివిధానాలు ఖరారు చేసిన కమిటీ

సీఎంకు నివేదిక సమర్పించిన సీఎస్


 

హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ సర్కారు సన్నద్ధమైంది. ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవ కానుకగా ఈ విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 28 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు లబ్ధి పొందుతారని ఆర్థిక శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు అవసరమయ్యే విధివిధానాలను అధ్యయనం చేసేందుకు గత ఏడాది ఆగస్టు 13న రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నేతృత్వంలో ఏడు విభాగాల ముఖ్య కార్యదర్శుల కమిటీ సుదీర్ఘంగా కసరత్తు చేసింది. గత నెలలోనే ఈ కమిటీ తమ నివేదికను సిద్ధం చేసింది. మార్గదర్శకాలన్నింటినీ అందులో పొందుపరిచింది. ఈ కమిటీ నివేదికతో పాటు ఆర్థిక శాఖ సిద్ధం చేసిన ఫైలు ప్రస్తుతం సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉంది.



సీఎం ఆమోదించిన వెంటనే ఈ ఉత్తర్వులు వెలువడతాయని ఆర్థిక శాఖ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. కమిటీ సిఫారసు చేసిన నిబంధనల ప్రకారం... రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం నాటికి అంటే గత ఏడాది జూన్ 2 నాటికి అయిదేళ్ల సర్వీసు నిండిన కాంట్రాక్టు ఉద్యోగులను ముందుగా రెగ్యులరైజ్ చేస్తారు. రెండో విడతలో అయిదేళ్లు నిండని అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు. అయిదేళ్ల పాటు కాంట్రాక్టు ఉద్యోగులుగానే గుర్తించి.. తర్వాతే రెగ్యులర్ అయ్యే అవకాశం కల్పిస్తారు. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరికీ ఈ క్రమబద్ధీకరణ పథకం వర్తిస్తుంది. ప్రత్యేక ప్రాజెక్టులు, స్కీముల కింద పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వర్తించదు. అంటే... నెలనెలా ప్రభుత్వం ఫుల్ టైమ్ స్కేల్ అందుకుంటున్న వారినే ఇందుకు అర్హులుగా పరిగణిస్తారు. ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టులకు సరిపడే విద్యార్హత, వయసు నిబంధనలున్న అభ్యర్థులకే అవకాశమిస్తారు. ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీ పోస్టుల సంఖ్య మేరకే ఈ నియామకాలుంటాయి. రిజర్వేషన్లు, రోస్టరు పద్ధతిని సైతం అనుసరిస్తారు. పార్ట్ టైం, డైలీ వేజ్ కార్మికులు సైతం ఈ క్రమబద్ధీకరణ పరిధిలోకి రారు.



క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచే ప్రభుత్వ సర్వీసు మొదలవుతుందని.. గతంలో పని చేసిన సర్వీసు లెక్కలోకి రాదని కమిటీ నిర్ణయించింది. కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు టీఆర్‌ఎస్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆర్టీసీ సమ్మె ముగిసిన వెంటనే అందులో పని చేస్తున్న మూడు వేల మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేస్తున్నట్లు స్వయంగా సీఎం ప్రకటించారు. దీంతో మిగతా విభాగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులు సైతం తమకెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top