అప్పనంగా.. అప్పగించేశారు..!

అలీషాను అరెస్ట్ చేసి, స్వాధీనం చేసుకున్న కార్ల ఫొటోను మీడియాకు చూసిస్తున్న పోలీసులు (ఫైల్) - Sakshi

  • సీసీఎస్‌లో రూ. 5 కోట్లు విలువ చేసే 54 కార్ల గోల్‌మాల్

  • ఇవన్నీ ఐదు నెలల క్రితం నేరస్తుల నుంచి స్వాధీనం చేసుకున్నవే

  • ఇందులో ఒక్క వాహనం కూడా ప్రస్తుతం సీసీఎస్‌లో లేదు

  • నచ్చినవాళ్ల నుంచి ఇష్టం వచ్చినంత తీసుకుని కట్టబెట్టేశారు

  • ‘సాక్షి’ పరిశోధనలో బయటపడ్డ మరిన్ని నిజాలు

  • సాక్షి, హైదరాబాద్: మొత్తం 54 కార్లు.. అన్నీ ఖరీదైనవే... వాటి విలువ సుమారు రూ. 5 కోట్ల పైమాటే.. నకిలీ ఎన్‌వోసీలు సృష్టించి ఐదారుగురికి విక్రయించడంతో పాటు ఫైనాన్స్ కంపెనీల నుంచి సైతం డబ్బులు దండుకున్న కేసులకు సంబంధించిన కార్లే. ఇవన్నీ ఐదు నెలల క్రితం నగర క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు పలువురు నేరస్తుల నుంచి స్వాధీనం చేసుకున్నవే. ప్రస్తుతం ఇందులో ఒక్క వాహనం కూడా సీసీఎస్ పోలీసుల వద్దగానీ, కోర్టు ఆధీనంలోగానీ లేవు. నచ్చినవారి నుంచి ఇష్టం వచ్చినంత డబ్బులు దండుకుని గుట్టుచప్పుడు కాకుండా కార్లను కట్టబెట్టేశారు. ఇలా రూ.5 కోట్ల విలువ చేసే 54 ఖరీదైన కార్లు గోల్‌మాల్ చేసేశారు. కానీ ఈ వాహనాలన్నీ కోర్టుకు అప్పగించినట్లు పోలీసు రికార్డుల్లో ఉండటం గమనార్హం. ‘సాక్షి’ పరిశోధనలో వెలుగు చూసిన సీసీఎస్ ఖాకీల మరో బాగోతం ఇదీ.

     

    ఎవరు ఎక్కువ ఇస్తే వారికే..

    నకిలీ ఎన్‌వోసీలు సృష్టించి ఒకే కారును ఐదారుగురికి విక్రయించడమే కాక వాటికి ఫైనాన్స్ కంపెనీల నుంచి డబ్బులు సైతం దండుకుని మోసగించిన క్రైమ్ నంబర్ 218/2014 కేసులో మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తిని సీసీఎస్ ఆటోమొబైల్ టీం పోలీసులు గత ఏడాది సెప్టెంబర్‌లో అరెస్ట్ చేశారు. అతని నుంచి 10 ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఎన్‌వోసీల కారణంగా ఒక్కో వాహనానికి ఐదారుగురు యజమానులు ఉన్నారు. శ్రీనివాస్‌రెడ్డి బాగోతం బయటపడటంతో అతని వద్ద కార్లు కొన్నవారు, ఆ కార్లకు ఫైనాన్స్ చేసిన కంపెనీలు ఆందోళనలో పడ్డాయి. నిజానికి కారు మొదటి యజమాని ఎవరైతే వారికే ఈ వాహనాలు చెందాల్సి ఉంటుంది. అయితే యాజమాన్య హక్కుల సంగతి పక్కనబెట్టిన ఆటోమొబైల్ టీం పోలీసులు ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి కార్లను అప్పగించారు. ఈ పది వాహనాలను సంబంధిత యజమానులకు అప్పగించాలని కోర్టు ఆదేశించి నెలలు గడుస్తున్నా.. ఇంత వరకు వాటికి సంబంధించిన షూరిటీలు కోర్టుకు సమర్పించలేదు. దీంతో ఈ వాహనాలు యజమానులకు చేరలేదు. ఈ వాహనాలు రికార్డుల పరంగా కోర్టు ఆధీనంలో ఉన్నట్లు చూపినా.. ప్రస్తుతం ఒక్క వాహనం కూడా లేదు.

     

     కోర్టు అనుమతి లేకుండానే..

     బేగంపేటకు చెందిన సోహిల్‌ఖాన్ కూడా నకిలీ ఎన్‌వోసీల ద్వారా ఒక్కో కారును ఐదారుగురికి విక్రయించడంతో పాటు పలు ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణం పొంది మోసగించాడు. డిసెంబర్ 13న టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోహిల్‌ఖాన్‌ను అరెస్ట్ చేసి.. ఐదు ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వారం రోజులకే సీసీఎస్‌కు బదిలీ అయ్యింది. దీంతో ఐదు కార్లను కూడా సీసీఎస్ పోలీసులకు జనవరిలో క్రైమ్ నంబర్ 19/2015 కింద అప్పగించారు. అయితే వీటిలో ఒక్క కారు కూడా ఇప్పుడు సీసీఎస్ పోలీసుల వద్ద లేదు. ఈ కార్లను కూడా డబ్బులు తీసుకుని కోర్టుకు తెలియకుండానే అసలైన యజమానులకు ఇవ్వకుండా నకిలీ ఓనర్లకు ఇచ్చినట్లు సమాచారం. సీసీఎస్ క్రైమ్ నంబర్ 12/2013 కేసులో అరెస్ట్ అయిన నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నాలుగు కార్లలో రెండు కూడా కనిపించడం లేదు.

     

     34 కార్లలో ఒక్కటీ లేదు..

    పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ముచ్చర్లవారి తోటకు చెందిన షేక్ ఉమర్ అలీషా (30) మదీనాగూడలో నివాసముంటున్నాడు. ఐబీఎంలో హెచ్‌ఆర్ విభాగంలో కొద్దికాలం పనిచేసిన అతను ఆ సమయంలో సంస్థకు వచ్చే అద్దె కార్ల యజమానులతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత మదీనాగూడలోనే ‘7 క్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించాడు. అద్దె కార్లు కావాలని ప్రకటనలివ్వడంతో పలువురు ఇతనికి వాహనాలను అందజేశారు. అయితే లీజుకు తీసుకున్న కార్ల డాక్యుమెంట్లను తారుమారు చేయడం, దానిపై ఉన్న ఫైనాన్స్ డబ్బులు పూర్తిగా కట్టినట్లు నకిలీ ఎన్‌వోసీలు సృష్టించాడు. అలీషాకు కర్నూలుకు చెందిన శ్రీనివాసరెడ్డి, కడపకు చెందిన రాకేష్‌కుమార్‌రెడ్డితోపాటు మరో 13 మంది సహకరించారు. వీరు ఇలా సుమారు 50కిపైగా కార్లను గోల్‌మాల్ చేశారు. ఒకే కారును ఇద్దరు ముగ్గురికి విక్రయించడం, అదే కారును అద్దెకు తీసుకుని వడ్డీ వ్యాపారుల వద్ద కుదువపెట్టడం చేశారు. నకిలీ ఎన్‌వోసీల ద్వారా ఒకే వాహనంపై పలు ఫైనాన్స్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో రుణం పొందారు. గత ఏడాది డిసెంబర్ 16న క్రైమ్ నంబర్ 289/2014 కేసులో అలీషాను అరెస్ట్ చేసి నకిలీ ఎన్‌వోసీలతో పలువురికి విక్రయించిన 34 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇందులో ఒక్క వాహనం కూడా ప్రస్తుతం పోలీసుల వద్ద లేదు. వీటిలో ఐదు కార్లు మాత్రం వారం క్రితం కోర్టు ద్వారా విడుదలయ్యాయి.

     

    పోలీసుల దొంగ షి‘కార్ల’పై విచారణ

     నేరస్తుల నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలను పంచుకున్న సీసీఎస్ ఖాకీల బాగోతంపై నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించారు. సీసీఎస్ పోలీసుల తీరుపై ‘‘పోలీసుల దొంగ షి‘కార్లు’!’’ కథనం గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన సంగతి తెలిసిందే. కాగా, సీపీ ఆదేశాల మేరకు విచారణాధికారులు గురువారం నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో సదరు అవినీతి అధికారుల నుంచి ఆయా కేసు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎల్బీనగర్‌లోని ఏసీపీ ఇంట్లో కారు, బైక్, నిజాంపేటలోని ఏఎస్‌ఐ ఇంటి నుంచి ఇన్నోవా కారు, హోండా యాక్టివా, ప్రగతినగర్‌లోని ఇన్‌స్పెక్టర్ ఇంటి నుంచి రెండు బైక్‌లు, చిలకలగూడలోని ఎస్‌ఐ నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. ఇవే కాకుండా సీసీఎస్‌లో ఇప్పటివరకూ రికవరీ చేసిన సొత్తుపై విచారణాధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే కత్తిపూడిలోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top