‘బంగారు తెలంగాణే’ లక్ష్యం


  •       స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి

  •      మినీ ఆడిటోరియం ప్రారంభం

  •      పూర్వ విద్యార్థుల సేవలు స్ఫూర్తిదాయకం

  • చిట్యాల : బంగారు తెలంగాణ నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని చల్లగరిగెలో 1984-85 పదో తరగతి పూర్వ విద్యార్థులు రూ.3 లక్షల వ్యయంతో నిర్మించిన మినీ ఆడిటోరియంను స్పీకర్ శనివారం ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో స్పీకర్‌తోపాటు ప్రముఖ సినీ గేయ రచయిత, పూర్వ విద్యార్థి చంద్రబోస్ మొక్కలు నాటారు.



    ఈ సందర్భంగా హెచ్‌ఎం మెండు ఉమామహేశ్వర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్పీకర్ సిరికొండ మాట్లాడారు. చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. సినీ పరిశ్రమను తన పాటలతో ఊర్రూతలూగిస్తున్న చంద్రబోస్ తన స్వగ్రామంలోని పాఠశాల అభివృద్ధికి స్నేహితులతో కలిసి కృషి చేయడం హర్షదాయకమన్నారు. అలాగే పాఠశాల ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని, వాచ్‌మెన్‌ను నియమిస్తామని హామీ ఇచ్చారు. సాగర్ జలాలతో నియోజకవర్గంలో పంటలను సస్యశ్యామలం చేస్తామన్నారు. దోపిడీ, అవినీతి లేకుండా తెలంగాణ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని ఆయన పేర్కొన్నారు.

     

    జన్మభూమి రుణం తీర్చుకుంటా..: చంద్రబోస్

     

    జన్మనిచ్చిన ఊరు కన్నతల్లితో సమానమని, అలాంటి గ్రామానికి సేవ చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ అన్నారు. నా ఊరి కోసం.. నా ఊపిరి ఉన్నంత వరకు సేవ చేస్తూ రుణం తీర్చుకుంటానని అన్నారు. స్నేహితులు పాఠశాల అభివృద్ధి కోసం అన్ని విధాల సహకరిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు 750 సినిమాల్లో 2,900 పాటలు రాసినట్లు పేర్కొన్నారు.



    ఇప్పటి వరకు పాఠశాలలో గేట్, తాగునీటి నల్లాల సౌకర్యం కల్పించానని, మినీ ఆడిటోరియంకు రూ.1.30లక్షలు విరాళంగా ఇవ్వగా.. మిత్రులు రూ.1.70లక్షలు విరాళంగా ఇచ్చారని ఆయన తెలిపారు. అనంతరం తాను రాసిన ‘మౌనంగానే ఎదగమని మొక్కనీకు చెబుతుంది.. ఎదిగినకొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది..’, ‘కనిపెంచిన అమ్మకు అమ్మనయ్యానుగా.. నడిపించిన  నాన్నకు నాన్నయ్యానుగా..’ అనే పాటలు పాడి విద్యార్థులను, ప్రజలను ఊర్రూతలూగించారు.



    అనంతరం పూర్వ విద్యార్థులను స్పీకర్ పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. సమావేశంలో ఎంపీపీ బందెల స్నేహలత, ఎంపీటీసీ సభ్యురాలు బాలగోని శోభ, పీఏసీఎస్ చైర్మన్ కర్రె అశోక్‌రెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్ బండిరాజు, టీఆర్‌ఎస్ జిల్లా, మండల నాయకులు సిరికొం డ ప్రశాంత్, సదావిజయ్‌కుమార్, ప్రతాప్‌రెడ్డి, కుంభం రవీందర్‌రెడ్డి, ఆరేపల్లి మల్లయ్య, ఉప సర్పంచ్ అశోక్, పూర్వ విద్యార్థులు అప్పాల వెంకటరమణ, జగదీశ్వర్, రాజిరెడ్డి, లలిత, హైమావతి, విజయ్‌నాయక్, రమేష్, చంద్రమౌళి, మోహన్‌రెడ్డి, సమ్మయ్య ఉపాధ్యాయులు కొమురయ్య, రాము, నర్సయ్య, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

     

    రేపు జిల్లాకు చెంచుల రాక

     

    భీమారం : భూపాలపల్లి నియోజకవర్గం రే గొండ మండలంలోని చెంచుకాలనీ వాసుల్లో ఒక్కరు మాత్రమే వరంగల్ నగరాన్ని చూశా రు...  నగరానికి కేవలం 45 కిలోమీటర్ల దూ రమే ఉన్నా, వందేళ్లలో ఎవరూ ఇక్కడికి రాలే దు... వారికి పట్టణమంటే ఏంటో కూడా తెలి యదు... ఆ కాలనీని ఇప్పటివరకు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఆవేదన వ్యక్తం చేశారు.



    భీమారంలోని శ్రీసా యి జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్‌డే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథి గా ప్రసంగించారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం తొలిపర్యటనలో చెంచుకాలనీకి వస్తానని హామీ ఇచ్చానని, ఈమేరకు అక్క డికి వెళ్లినట్లు స్పీకర్ తెలిపారు. తన తొలి వేతనం కూడా ఈ కాలనీకే అందించిన ట్లు చెప్పారు. వందేళ్లుగా నగరం ఎరుగని చెంచుకాలనీ వాసులకు వరంగల్ నగరాన్ని చూపిం చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు.



    సెప్టెంబర్ ఒకటో తేదీన ఆ గ్రామస్తులను ఆరు బస్సుల ద్వారా నగరానికి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు చెంచుకాలనీ నుంచి బస్సులు బయలుదేరుతాయని, తొలుత ఖిలావరంగల్‌లోని కాకతీయుల కోటను సందర్శిస్తారన్నారు. రెండు గంటలపాటు కోట అందాల ను  తిలకించిన అనంతరం అక్కడే మధ్యా హ్న భోజనం చేస్తామని చెప్పారు.



    అక్కడి నుంచి వేయిస్తంభాల ఆలయం, భద్రకాళి, రాజరాజేశ్వరి ఆలయాలను సందర్శిస్తామని,  ఇక్కడ మరో రెండు గంటలపాటు గడిపిన తర్వాత సాయంత్రం కలెక్టర్ కిషన్ ఇంటిలో తేనీటి విందుకు గ్రామస్తులతో సహా హాజరుకానున్నట్లు వెల్లడించారు. అనంతరం రామకృష్ణ టాకీస్‌లో శ్రీరామరాజ్యం సినిమా చూసిన తర్వాత తిరిగి గ్రామస్తులతో సహా చెంచుకాలనీకి బయలుదేరనున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి వివరించారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top