సీఎంఓలో ‘చేజింగ్ సెల్’

సీఎంఓలో  ‘చేజింగ్ సెల్’


పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇప్పించడమే లక్ష్యం



హైదరాబాద్: నూతన పారిశ్రామిక విధానం కింద కొత్తపరిశ్రమలకు శరవేగంగా అనుమతులు జారీ చేసేందుకోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ)లో ‘చేజింగ్ సెల్’ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు ముఖ్య కార్యదర్శి ఈ విభాగానికి ఎక్స్ అఫీషియో సీఈఓగా వ్యవహరించనున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన కనీసం ఆరుగురు అధికారులతో కూడిన బృందం ఈ విభాగంలో పనిచేయనుంది. ఈ బృందంలో అధికారులతో పాటు కన్సల్టెంట్లు సైతం ఉండనున్నారు. పరిశ్రమలు, సీపీబీ, పురపాలక, పంచాయతీరాజ్, కార్మిక, ఆర్థిక శాఖలతో పాటు సుపరిపాలన కేంద్రం(సీజీజీ) నుంచి నిపుణులైన అధికారులను ఎంపిక చేసి ఈ సెల్‌లో నియమిస్తారు. ఈ సెల్ నెల రోజుల్లో తన కార్యక్రమాలను ప్రారంభించనుంది. 



రాష్ట్రానికి భారీ, మెగా పెట్టుబడుల రాకపై ఈ సెల్ దృష్టి సారిస్తుంది. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ప్రొటోకాల్ ఏర్పాట్లు మొదలు అనుమతులు లభించే వరకు అన్ని వ్యవహారాలను ఈ సెల్ పర్యవేక్షించనుంది. దీనికి సంబంధించిన పురోగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేస్తుంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top