డమ్మీ శవం కోసం బాలిక హత్య

డమ్మీ శవం కోసం బాలిక హత్య


జీవితాంతం ప్రియుడితో కలసి ఉండేందుకు దారుణం



మహబూబాబాద్‌ రూరల్‌: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ మహిళ ఎప్పటికీ.. అతడితోనే ఉండేందుకు దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడి దగ్గర నుంచి కుటుంబీకులు తరచూ వెనక్కి తీసుకొస్తుండడంతో తాను చనిపోయినట్లు అందర్నీ నమ్మించేందుకు ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. ఇందుకోసం అన్నెంపున్నెం తెలియని బాలికకు తన దుస్తులు వేసి హత్య చేసి.. బావిలో పడేసి పరారైంది. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం లో జరిగిన ఈ హత్య కేసు మిస్టరీ.. వారం  తర్వాత వీడింది. ఆదివారం ఎస్పీ కోటిరెడ్డి ఈ హత్య వివరాలు వెల్లడించారు.



మహబూబాబాద్‌లోని రాజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన పువ్వల భవ్యకు 15 ఏళ్ల క్రితం తన మేనమామ పూర్ణచందర్‌రావుతో వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు. భవ్య బైపాస్‌ రోడ్డులో చిన్నహోటల్‌ నడుపుతోంది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తన హోటల్‌ ఎదురుగా ఉన్న అమ్మా ట్రాన్స్‌పోర్టుకు వచ్చే విజయవాడ పడమటకు చెందిన జంగిలి శ్రీనివాస్‌తో భవ్యకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. భవ్య విజయవాడ వెళ్లి ప్రియుడితోనే ఉంటోంది. ఆమె భవ్య కుటుంబ సభ్యులు విజయవాడ వెళ్లి భవ్యను తీసుకొచ్చారు. అయినా భవ్య విజయవాడకు వెళ్లి వస్తోంది. ఈ క్రమంలోనే తన పోలికలతో ఉండే మరో మహిళను చంపేసి తాను చనిపోయినట్లు నమ్మించాలని భవ్య భావించి శ్రీనివాస్‌తో చెప్పింది. ఈ నెల 13న తన హోటల్‌కు చాక్లెట్‌ కోసం వచ్చిన ఓర్సు అనూష(8)పై భవ్య కన్ను పడింది. ఆమెకు మాయమాటలు చెప్పి తన నైటీ ఇచ్చి, ఆమెను వేసుకోమంది. అనం తరం ఇంట్లోకి తీసుకెళ్లి కర్రతో అనూష తలపై బాదడంతో స్పృహతప్పి పడిపోయింది.



ఆ తర్వాత అనూషపై భవ్య కిరోసిన్‌ చల్లి నిప్పంటించింది. పెద్దమ్మ విజయలక్ష్మితో కలసి భవ్య... శవాన్ని సంచిలో మూటకట్టి ఆటోలో తీసుకెళ్లి ఈదులపూసపల్లి నల్లాల బావిలో పడేసింది. తర్వాత భవ్య నేరుగా విజయవాడకు వెళ్లి తన ప్రియుడు శ్రీనివాస్‌ తో జరిగిన విషయం చెప్పింది. అదృశ్యమైన బాలిక తల్లిదండ్రులు 13న పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఈ నెల 16న మహబూబాబాద్‌ మండలంలోని ఈదులపూసపల్లి గ్రామశివారులోగల నల్లాల బావిలో అనూష మృతదేహం పోలీసులకు లభ్యమైంది. ఈ మృతదేహం అనూషదిగా తొలుత పోలీసులు పోల్చుకోలేకపోయారు. ఫోరెన్సిక్‌ నిపుణుల ప్రాథమిక నివేదిక, బాలిక తల్లిదండ్రుల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. భవ్య, జంగిలి శ్రీనివాస్, కస్తూరి విజయలక్ష్మి ఈ హత్య కేసులో నిందితులుగా తేలడంతో... వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top