డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు

డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు - Sakshi


* ఎన్నికల సంఘానికి నివేదిక పుంపుతాం

* అన్ని ప్రక్రియల పూర్తికి 249 రోజులు కావాలి

* హైకోర్టుకు నివేదించిన టీ సర్కార్

* విచారణ వచ్చే వారానికి వాయిదా


 

 సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది డిసెంబర్ రెండో వారంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరతామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. వార్డుల పునర్విభజన, అభ్యంతరాల స్వీకరణ, బీసీ ఓటర్ల గుర్తింపు, రిజర్వేషన్ల ఖరారు తదితర ప్రక్రియలను పూర్తి చేసి ఎన్నికలను నిర్వహించేందుకు 249 రోజులు పడుతుందని ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్‌లో తెలిపింది.

 

 ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత డిసెంబర్ రెండో వారంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరతామని వివరించింది. జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడంతో పాటు స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి అవకాశం కల్పిస్తున్న జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 70జీని చట్ట విరుద్ధంగా ప్రకటించాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో ఇటీవల ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. స్పెషల్ ఆఫీసర్ల నియామకపు జీవో 186ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని కూడా ఆయన కోర్టును కోరారు.

 

 ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. గత విచారణ సమయంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జి.గోపాల్ కౌంటర్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణకు రాగానే అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి ఇందులోని అంశాలను చదివి వినిపించారు. రాష్ట్ర విభజన తరువాత ఐఏఎస్ అధికారుల కేటాయింపులో ఆలస్యం జరిగిందని, పని ఒత్తిడి వల్ల వార్డుల పునర్విభజనను కోర్టు ఆదేశాలిచ్చిన వెంటనే చేపట్టలేకపోయామని ఆయన వివరించారు. కేటాయింపులు పూర్తయిన తర్వాత వార్డుల పునర్విభజనకు ఆదేశాలు జారీ చేశామన్నారు. వార్డుల పునర్విభజన, పునర్విభజన ముసాయిదా ప్రతిపాదనలు, అభ్యంతరాల స్వీకరణ, ప్రభుత్వానికి తుది ప్రతిపాదనల సమర్పణ, ఆమోదించిన ప్రతిపాదనలు గెజిట్‌లో ప్రచురణ, వార్డులు- పోలింగ్ కేంద్రాల వారీ ఓటర్ల జాబితా తయారీ, బీసీ ఓటర్ల గుర్తింపు కోసం ఇంటింటి సర్వే, బీసీ ఓటర్ల జాబితా, అభ్యంతరాల స్వీకరణ, రిజర్వేషన్ల ఖరారు తదితర ప్రక్రియలన్నీ పూర్తి చేసేందుకు 249 రోజులు పడుతుందన్నారు.

 

  వీటిని పరిగణనలోకి తీసుకుని వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కోరారు. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ జోక్యం చేసుకుంటూ, ఇప్పటి వరకు ఏం జరిగిందో ప్రభుత్వం చెప్పిందే తప్ప, అసలు విషయం చెప్పడం లేదన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ప్రభుత్వ కౌంటర్‌పై అభ్యంతరాలుంటే రాతపూర్వకంగా కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top