టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా చక్రపాణి


* సభ్యులుగా విఠల్, చంద్రావతి, మతీదుద్దీన్  

* గవర్నర్ ఆమోదంతో అర్ధరాత్రి జీవో జారీ

* నేడు బాధ్యతలు స్వీకరించనున్న చక్రపాణి

* అసంతృప్త ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలకు అవకాశం



సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) తొలి చైర్మన్‌గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రతిపాదనకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అలాగే కమిషన్ సభ్యులుగా ఉద్యోగ సంఘాల నేత సి.విఠల్, మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, ప్రభుత్వోద్యోగి మతీదుద్దీన్ పేర్లను కూడా ఆమోదించారు. దీంతో వీరి నియామకానికి సంబంధించి అర్ధరాత్రికే రాష్ర్ట ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. అయితే ప్రభుత్వం సిఫారసు చేసిన మరో ఐదుగురు సభ్యుల విషయంలో మాత్రం గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.



ఓయూ ప్రొఫెసర్ రాజేశ్వర్‌రెడ్డి, కేయూ ప్రొఫెసర్లు దినేష్‌కుమార్, పి. శ్రీనివాస్, న్యాయవాదులు గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీరంగారావు పేర్లను తిరస్కరించారు. ప్రభుత్వ సిఫారసు జాబితాను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారమే స్వయంగా రాజ్‌భవన్‌కు తీసుకెళ్లి గవర్నర్‌కు అందించారు. అందరి పేర్లను పరిశీలించిన గవర్నర్.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల మేరకు ఐదుగురి విషయంలో అభ్యంతరం తెలిపారు.



నిబంధనల ప్రకారం సభ్యుల్లో సగం మంది విధిగా ప్రభుత్వ ఉద్యోగులై, వారు కనీసం 20 సంవత్సరాల సర్వీస్‌ను పూర్తి చేసుకుని ఉండాలి. అయితే ప్రొఫెసర్లు ప్రభుత్వోద్యోగుల కిందకు రారని, వారు స్వయం ప్రతిపత్తిగల విద్యా సంస్థల్లో పనిచేస్తున్నారని గవర్నర్ పేర్కొన్నట్లు సమాచారం. అలాగే జాబితాలోని ఇద్దరు న్యాయవాదులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌తోనూ ఫోన్‌లో చెప్పినట్లు సమాచారం. దీంతో ఐదుగురి పేర్లను నరసింహన్ తిరస్కరించారు. దీంతో మిగిలిన వారి నియామక ఉత్తర్వుల జారీ విషయంలో ప్రభుత్వం తర్జనభర్జనలు పడింది.



చివరకు కమిషన్ చైర్మన్‌తోపాటు ముగ్గురు సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. వీరంతా ఆరేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. చైర్మన్‌గా నియమితులైన ఘంటా చక్రపాణి గురువారం ఉదయం 11.30 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్‌గా కరీంనగర్ జిల్లాకు చెందిన ఘంటాను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న దాదాపు 1.07 లక్షల ఖాళీల్లో టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయాల్సిన ఉద్యోగాలే 60 వేల వరకు ఉంటాయని అంచనా.



పదవుల భర్తీపై కేసీఆర్ దృష్టి

కాగా, కార్పొరేషన్ పదవుల భర్తీపైనా సీఎం దృష్టి సారించారు. మంత్రివర్గంలో చోటు ఆశించి, భంగపడిన ఎమ్మెల్యేలకు ముందుగా అవకాశం ఇవ్వాలనే యోచనలో ఆయన ఉన్నట్లు తెలిసింది. నామినేటెడ్ పదవుల భర్తీపై కొందరు సన్నిహితులతో సీఎం తాజాగా చర్చించినట్లు సమాచారం. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నవారిని, వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన సీనియర్లు, ఆలస్యంగా చేరినా హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నవారికి, వివిధ రంగాల్లో నిపుణులను కార్పొరేషన్ల పదవులకు నామినేట్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.



తమకు తగిన గుర్తింపు లభించడం లేదని, పార్టీ కోసం కష్టపడినా తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఇప్పటికే టీఆర్‌ఎస్‌లోని పలువురు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షునిగా ఉన్న మందుల సామేలు, పార్టీ మానకొండూరు ఇన్‌చార్జిగా ఉన్న ఓరుగంటి ఆనంద్ వంటివారు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top