గజిబిజి..గందరగోళం


శాతవాహన యూనివర్సిటీ/మేడిపెల్లి :  ఒకటి నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్షల నిర్వహణ గందరగోళంగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా టైం టేబుల్‌ను అధికారులు పరీక్షలకు ఒక్కరోజు ముందే ప్రకటించారు. దీనికితోడు ఒకేరోజు ఒక్కో తరగతికి ఒక్కో సబ్జెక్ట్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించడంతో ఇటు విద్యార్థులు, అటు ఉపాధ్యాయులు తీవ్ర అయోమయూనికి గురవుతున్నారు.

 

ఆరు నుంచి తొమ్మిది తరగతులకు జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు ప్రశ్నపత్రాలను రూపొందించి పాఠశాలలకు అందిస్తుంది. ఈ ప్రశ్నపత్రాలు ఇప్పటికే మండలాలకు చేరారుు. దీంతో ఆరు నుంచి తొమ్మిది తరగతులకు పెద్ద ఇబ్బంది లేదు. కానీ ప్రాథమిక పాఠశాలలకు జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు ప్రశ్నపత్రాలను అందించదు. 


వీటిని సంబంధిత ఉపాధ్యాయులే రూపొందించి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రశ్నత్రాలు తయూరు చేసేందుకు ఉపాధ్యాయులు మంగళవారం కుస్తీలు పట్టారు. కానీ చాలా పాఠశాలల్లో ప్రశ్నపత్రాలు పూర్తికాలేదని సమాచారం. మరోవైపు నేటినుంచి ఈ నెల 11 వరకు పరీక్షలు పూర్తి చేయూలని విద్యాశాఖ నుంచి ఆదేశాలు రావడంతో కష్టసాధ్యంగా మారిందని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు.

 

ఒక్కో తరగతికి ఒక్కో తీరు..

ఇదివరకు అన్ని తరగతులకు మొదట మాతృభాష(తెలుగు), తర్వాత జాతీయ భాష(హిందీ), అనంతరం ఇంగ్లిష్, తర్వాత గణితం, సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రం పరీక్షలు జరిగేవి. విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా వీటి ప్రకారమే తమ ప్రణాళికలు తయారు చేసుకొనేవారు. కానీ ఈ వార్షిక పరీక్షల నుంచి ఈ విధానాన్ని మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


మారిన షెడ్యూల్ ప్రకారం.. ఒకటి నుంచి ఐదు తరగ తులకు తెలుగు/ఉర్దూ, ఆంగ్లం, గణితం, సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రం, 6,7 తరగతులకు తెలుగు/ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, సోషల్, మాథ్స్, సైన్స్, 8వ తరగతికి గణితం, భౌతిక, రసాయనశాస్త్రం, సోషల్‌సైన్స్, తెలుగు/ఉర్దూ, హిందీ, ఆంగ్లం, జీవశాస్త్రం, 9వ తరగతికి గణితం, భౌతిక, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం, తెలుగు/ఉర్దూ, ఆంగ్లం, హిందీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలున్నారుు.



దీంతో ఉపాధ్యాయులకు ఒక్కో తరగతికి ఒక్కో పరీక్షను ఎలా నిర్వహించాలో పాలుపోవడం లేదు. గతంలో ఒకేరోజు అన్ని తరగతులకు ఒకే సబ్జెక్టు ఉండడంతో పరీక్షల నిర్వహణ సులువుగా జరిగేది. విద్యార్థులకు సైతం ఇబ్బందులు కలిగేవి కావు. కానీ ప్రస్తుత విధానంతో ఇటు విద్యార్థులకు, అటు ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పేలా లేవు.

 

టెన్త్ పరీక్షలతో తిప్పలు..

ప్రస్తుతం జరుగుతున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు ఇన్విజిలేషన్ డ్యూటీలు వేశారు. ఇదే సమయంలో అన్ని తరగతుల పరీక్షలు నిర్వహించడం ఉన్న ఉపాధ్యాయులకు కష్టతరమే. గతంలో పదో తరగతి పరీక్షలు ముగిసిన వెంటనే మిగతా తరగతులకు పరీక్షలు జరిగేవి. దీంతో అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులు వారి వారి సబ్జెక్టుల పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేవారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇన్విజిలేషన్ విధుల్లో ఉన్నవారి సబ్జెక్టుకు సంబంధించిన పరీక్షలు రాయడం విద్యార్థులకు ఇబ్బందిగా మారనుంది. అసలే కొత్త పరీక్ష విధానం, ఆపై సంబంధిత సబ్జెక్టు టీచర్లు లేకుండా పరీక్షలు ఎలా జరుగుతాయో విద్యాశాఖ అధికారులకే తెలియూలి.

 

పరీక్షల తర్వాత ఏం చేయాలి?

పరీక్షలు ఈ నెల 11వ తేదీ వరకు పూర్తైే ...తర్వాత ఉన్న 12 రోజలు ఏం చేయాలనే ప్రశ్నలు అందరిలో వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విద్యాశాఖాధికారులు స్పష్టత ఇవ్వాలని జిల్లాలోని పాఠశాలల యాజమాన్యాలు కోరుతున్నాయి. స్వరాష్ట్రంలో విద్యావిధానం ఏవైపు వెళ్తోందో అర్థం కావడం లేదన్న స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

ప్రశాంతంగా టెన్‌‌త పరీక్షలు

కరీంనగర్ ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మంగళవారం జరిగిన పరీక్షకు మొత్తం 59,855 మంది విద్యార్థులకు 59,576 మంది హాజరయ్యారు. జిల్లా విద్యాధికారి లింగయ్య 13 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లాలోని 79  కేంద్రాలను సందర్శించారుు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top