ఇంకా ఆంధ్రా పెత్తనమేంది?

ఇంకా ఆంధ్రా పెత్తనమేంది? - Sakshi


టీ జేఏసీ చైర్మన్ కోదండరాం



గద్వాల: తెలంగాణ రాష్ట్రం విడిపోయినా ఆంధ్రా పెత్తనం ఇంకా కొనసాగుతూనే ఉందని, దీన్ని తెలంగాణ సమాజమంతా తిప్పికొట్టాలని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. రాష్ట్రం ఏర్పడినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఆదివారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో నిర్వహించిన 1969 తెలంగాణ ఉద్యమకారులు నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. అంతకుముందు పెబ్బేరులో విలేకరులతో మాట్లాడారు. కృష్ణాజలాలు దక్కేవరకు పోరాటం చేయాలన్నారు. ప్రత్యేక రాష్ర్టంలో అందరికీ తిండి దొరికి, గౌరవంగా బతికిన రోజే బంగారు తెలంగాణ ఏర్పడినట్లు అవుతుందని కోదండరాం అభిప్రాయపడ్డారు. శంషాబాద్ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు. రాష్ట్రాలు వేరైనప్పుడు ఇక్కడి విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం సమంజసం కాదన్నారు. ఎన్టీఆర్‌పై అందరికీ అభిమానం ఉన్నా ఇక్కడి వ్యక్తుల పేర్లు పెట్టాల్సిందేనన్నారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వారి పేర్లు పెట్టాలని సూచించారు.



ఎన్నో ఏళ్ల తెలంగాణ పోరాటం ఫలించి రాష్ట్రాన్ని సాధించుకున్నా.. ఇంకా అనేక విషయాల్లో సీమాంధ్రుల జోక్యం చేసుకుంటున్నారన్నారు. నేటికీ అనేక ప్రభుత్వ, ప్రైవేట్‌రంగాలు విడిపోకుండా ఉండడం వల్ల తెలంగాణలో అభివృద్ధికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. బంగారు తెలంగాణ కోసం సమష్టిగా పోరాటం చేద్దామన్నారు. క్షణికావేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోదండరాం కోరారు. ఇంటర్ పరీక్షలు కూడా ఏ రాష్ట్రం వాళ్లు అక్కడే నిర్వహించుకోవాలని తెలంగాణ అధికారులు కోరుతున్నా.. ఆంధ్రా అధికారులు తిరకాసు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంకా తెలంగాణపై పెత్తనం చలాయించేందుకు చూస్తే ఊరుకోమన్నారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top