ఫలించిన ‘ప్రేరణ’

ఫలించిన ‘ప్రేరణ’ - Sakshi


సర్ధాపూర్‌లో వెలిగిన అక్షరదీపం

 

సిరిసిల్ల రూరల్ : మండలంలోని సర్ధాపూర్‌లో పోలీసులు అక్షరదీపాన్ని వెలిగించారు. అక్షరాస్యత దినోత్సవం రోజు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న డీఎస్పీ దామెర నర్సయ్య.. జనవరి 26 లోపే అందరినీ సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం.. గ్రామంలోని 154 మందితో వారి పేర్లు రాయించడమే కాదు.. కుటుంబసభ్యులు, ఊరుపేరుతోపాటు సెల్‌నంబర్ కూడా నేర్చుకునేలా చేశారు. శనివారం పోలీసుల ఆధ్వర్యంలో ప్రేరణసభ ఏర్పాటు చేసి విజయోత్స సంబరాన్ని నిర్వహించారు.



ఈ సందర్భంగా డీఎస్పీ నర్సయ్య మాట్లాడుతూ.. అక్షరాస్యతతోనే అన్ని సాధ్యమవుతాయన్నారు. మూడు నెలల క్రితం గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడ సంపూర్ణ అక్షరాస్యత సాధించడం గర్వంగా ఉందన్నారు. ఇందులో ప్రజాప్రతినిధుల చొరవ, యువకుల కృషి ఎంతో ఉందని వివరించారు. ఎస్పీ సహకారంతో ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. సర్పంచ్ అగ్గి రాములును ప్రజాప్రతినిధులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గ్రామంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు సహకరించిన వాలంటీర్లు, ఎంసీవో, వీసీవో, సర్పంచ్, ఎంపీటీసీలను సన్మానించారు.



అంతకుముందు పోలీసు కళాబృందాల ఆటలుపాటలు ఆకట్టుకున్నాయి. సెస్ పర్సన్ ఇన్‌చార్జి దోర్నాల లకా్ష్మరెడ్డి, మాజీ చైర్మన్ చిక్కాల రామారావు, జడ్పీటీసీ పూర్మాణి మంజుల, ఎంపీపీ దడిగెల కమలబాయి, సిరిసిల్ల టౌన్ సీఐ జి.విజయ్‌కుమార్, ఎంపీడీవో మధన్‌మోహన్, సర్పంచ్ అగ్గిరాములు, ఎంపీటీసీ జూపల్లి శ్రీలత, ముస్తాబాద్, ఇల్లంతకుంట, గంభీరావుపేట ఎస్సైలు మారుతి, ఎల్లయ్యగౌడ్, వెంకటకృష్ణ సాక్షరభారత్ మండల కో-అర్డినేటర్ తిరుపతి పాల్గొన్నారు.

 

మూడు గ్రామాలు దత్తత


సిరిసిల్ల పోలీసుస్ఫూర్తితో మండలంలోని రామన్నపల్లి, బస్వాపూర్, బాలమల్లుపల్లి గ్రామాలను దత్తత తీసుకుంటున్నా. అక్కడ సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు ప్రయత్నిస్తా. ఒక గ్రామంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించడమంటే మాటలు కాదు.

 - పూర్మాణి మంజుల, జెడ్పీటీసీ

 

అన్ని గ్రామాలకు విస్తరిస్తాం

ఈ స్ఫూర్తిని మండలంలోని అన్ని గ్రామాలకు విస్తరింపజేస్తాం. చదువుతోనే విలువ. సంక్షేమ పథకాలు వర్తింపజేయాలంటే సంతకం తప్పని సరి అవసరం. వేలిముద్రలు ఉంటే మోసాలు జరిగే అవకాశాల ఎక్కువగా ఉంటాయి. చదువు అందరూ నేర్చుకోవాలి.

 - దడిగెల కమలభాయి, ఎంపీపీ

 

ప్రజల సహకారంతోనే విజయం

ప్రజల సహకారం, డీఎస్పీ దీశానిర్దేశంతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ సంపూర్ణ అక్షరాస్యత సాధించాం. ప్రజల సహకారం ఉంటే ఎంత పెద్ద పనైనా సులువవుతుంది. ప్రజాప్రతినిధులకు, స్వచ్ఛంధంగా చదువు చెప్పిన వాలంటర్లకు ధన్యవాదాలు.

 - జి.విజయ్‌కుమార్, సిరిసిల్ల టౌన్ సిఐ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top