నేటి నుంచి ‘హరితహారం’

నేటి నుంచి ‘హరితహారం’ - Sakshi


పోయిన వానలను మళ్లీ వెనక్కి తెప్పించే మహా యజ్ఞం సాగుతోంది.. పంట చేల మీది వానరాలను వెనక్కి పంపే గొప్ప యాగం జరుగుతోంది. రాబోయే విపత్తును తప్పించి, జన జాతులను, సకల జీవాలను కాపాడుకునే మహా ‘హరిత’ ఉద్యమం మన  తలుపు తడుతోంది. ఉద్యమాల గడ్డ మనది.. ఉద్యమించే తరుణం ఇది. మరొక్కసారి అందరం చేయి.. చేయి కలుపుదాం.. బడిలో, గుడిలో.. చావడిలో.. చెరువుల్లో.. చేలల్లో.. ఇంటి పరిసరాల్లో.. చెట్లు పెరగటానికి అనువైన ప్రతి చోటా బాధ్యతగా మొక్కలను నాటుదాం.. నీళ్లుపోసి.. పొతం చేసి  కాపాడుకుందాం. మన ఊరికి మనమే పచ్చని చెట్లను హారంగా వేద్దాం. దూరమైన కోయిలమ్మల కమ్మటి రాగం మళ్లీ చెవులారా  విందాం.

 

- మొత్తం మొక్కలు 3.52 కోట్లు

- మొత్తం నర్సరీలు 450

- ఒక్కో నియోజకవర్గంలో నాటే మొక్కలు 40 లక్షలు

- ఒక్కో గ్రామంలో నాటే మొక్కలు 40 వేలు

- మహా ఉద్యమంలా ముందుకు...

- ప్రతి ఒక్కరూ భాగస్వాములే!

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
ప్రస్తుతం జిల్లాలో 9.95 శాతం మాత్రమే అడవులు ఉన్నాయి. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. తక్షణం అటవీ శాతం పెంచి పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా రాష్ట్రం ప్రభుత్వం హరితహారం పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రతి పల్లెను పచ్చని వనంగా మార్చే ప్రయత్నంలో భాగంగా  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఈ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పల్లెలో మొక్కను నాటి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంబించనున్నారు. పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 40 లక్షల మొక్కల చొప్పున జిల్లా వ్యాప్తంగా 3.50 కోట్ల మొక్కలు పెంచాలని నిర్ణయించారు. ప్రతి గ్రామంలో కనీసం 30 నుంచి 40 వేల మొక్కలను పెంచటానికి ప్రభుత్వం సంకల్పించింది.

 

మనందరి బాధ్యత...


దాదాపు 60..70 ఏళ్ల నుంచి చెట్లను నరుక్కుంటూ వస్తున్నాం.. జిల్లాలో ఒకప్పుడు 35 శాతం ఉన్న అడవుల విస్తీర్ణం ఇప్పుడు కేవలం 9.95 శాతానికి పడిపోయింది. వాతావరణ సమతుల్యత దెబ్బ తినకుండా ఉండాలంటే జిల్లా భూ భాగంలో 33 శాతం అడవులు ఉండాలి. ఇంత శాతాన్ని అందుకోవాలంటే ఇప్పుడున్న చెట్లు కాకుండా 10.56 కోట్ల మొక్కలు అదనంగా పెంచాలి. వచ్చే మూడేళ్లలో ఈ లక్ష్యాన్ని అందుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. ఇన్ని కోట్ల మొక్కలు పెంచడం ఒక్క ప్రభుత్వ యంత్రాంగంతో సాధ్యమయ్యేపని కాదు. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజాసంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలి. ప్రతి పౌరుడు బాధ్యతగా మొక్కల నాటినప్పుడే జిల్లా 33 శాతం అడవులతో నిగనిగలాడుతుంది.  

 

అధికారులు నిబద్ధతో మెలగాలి...

‘చెప్పేదే చెయ్యి.. చేసేదే చెప్పు’ ఇదే హరితహారం నినాదం. లక్ష్యాన్ని చేరే క్రమంలో అధికారిక లెక్కలు.. అంచనాలు వాస్తవ విరుద్ధంగా ఉంటున్నాయి. మొక్కలు నాటేందుకు కీలకమైన గుంతల తవ్వకాల్లోనే ప్రభుత్వ యంత్రాంగం డొల్లతనం బయటపడింది. శుక్రవారం నాటి కార్యక్రమానికి ఎన్ని గుంతలు తీశారో అధికారులు ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేకపోయారు. ‘మమ’ అనిపించుకుని కాకి లెక్కలతో నివేదికలు రూపొందించి మభ్య పెట్టే బదులు చేతనైనంతలోనే  నిఖార్సుగా.. నిబద్ధతతో మొక్కలు నాటుదాం. నాటిని ప్రతి మొక్కను కాపాడుకునేందుకు కంకణబద్ధులవుదాం. దేశంలో మూడో పెద్ద కార్యక్రమంగా చరిత్రకెక్కిన హరితహారం పథకానికి అధికారులే నిబద్ధతతో మెలిగి పథకాన్ని విజయవంతం చేయాలని  ప్రజలు కోరుతున్నారు.

 

ఎక్కడ ఎలాంటి మొక్కలు నాటాలి...

పొలంగట్ల మీద:

టేకు, వెదురు, గచ్చకాయ, గోరింట, సుబాబుల్, పండ్ల మొక్కలు

ఇంటి పరిసరాల్లో: కరివేపాకు, మునగ, బొప్పాయి, జామ, ఉసిరి, దానిమ్మ, కానుగ, వేప,

బాదం

పాఠశాలలు, కార్యాలయాలు:

కానుగ, వేప, బాదం, రావి, జువ్వి, మర్రి, నేరేడు, ఉసిరి

రహదారుల పక్కన: ఎర్రతురాయి, పచ్చతురాయి, బాహీనియా, కానుగ, నేరేడు, దిరిశిన, సిస్సు

చెరువుగట్లు: ఈత, తాటి, ఖర్జూర, కొబ్బరి, తెల్లమద్ది, నల్లతుమ్మ

బోడిగుట్టలు: ఉసిరి, సీతాఫలం, మర్రి, రావి, వేప  తదితర మొక్కలు నాటుకోవచ్చు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top