గల్ఫ్‌ నుంచి ఇండియాకు..


- గల్ప్‌లో మతిస్థిమితం లేని యువకుడు

ఎంపీ కవిత చొరవతో స్వగ్రామానికి చేరిక

 

డిచ్‌పల్లి (నిజామాబాద్‌ రూరల్‌): బతుకు దెరువు కోసం గల్ఫ్‌లోని యూఏఈకు వెళ్లిన యువకుడు అక్కడ మతిస్థిమితం కోల్పోయి ఆస్పత్రి పాలయ్యాడు. విషయం తెలుసుకున్న నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి యూఏఈ శాఖ ద్వారా బాధిత యువకుడిని స్వగ్రామానికి రప్పించారు. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం యానంపల్లికి చెందిన యువకుడు కుమ్మరి సాయికుమార్‌ 2015 జూన్‌లో ఉపాధి కోసం యూఏఈలోని ఉమల్‌కోయిన్‌లో ఉన్న అల్‌–షకీన్‌ రెస్టారెంట్‌లో కార్మికుడిగా వెళ్లాడు. రెండు నెలల క్రితం మతిస్థిమితం కోల్పోయాడు. పెద్ద పెద్ద అరుపులతో రోడ్లపై బట్టలు లేకుండా తిరుగుతూ తోటి కార్మికులకు ఇబ్బందులు కలిగించే వాడు. దీంతో కంపెనీ సాయికుమార్‌ వీసా రద్దు చేసి మరొక వ్యక్తిని తోడుగా ఇచ్చి అతడిని ఇండియాకు పంపించడానికి ప్రయత్నిం చింది. అయితే షార్జా ఎయిర్‌పోర్టులో వింతగా ప్రవర్తించడంతో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అతడిని స్థానిక పోలీసులకు అప్పగించారు.



చికిత్స పొంది వైద్యుడి సర్టిఫికెట్‌ పొందితేనే ఇంటికి పంపించాలని నిర్ణయించారు. ఎయిర్‌పోర్టు వైద్య సిబ్బంది ఇచ్చిన లేఖతో దుబాయ్‌లోని అల్‌–రషీద్‌ హాస్పిటల్‌లో సాయికుమార్‌ను అడ్మిట్‌ చేశారు.  వైద్య ఖర్చుల నిమిత్తం బాధితుడి కుటుంబ సభ్యులు, యానంపల్లి  సర్పంచ్‌ శ్రీనివాస్‌ గౌడ్‌ యూఏఈ జాగృతి చారిటీ కో–ఆర్డినేటర్‌ షేక్‌ అహ్మద్‌ దృష్టికి తీసుకెళ్లి సహాయం చేయాలని కోరారు. షేక్‌ అహ్మద్‌ ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించి వివరాలను జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవితకు, యూఏఈ జాగృతి అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌కు వివరించారు. వైద్యులు సర్టిఫికెట్‌ ఇవ్వడంతో షేక్‌ అహ్మద్‌  ప్లయిట్‌లో సాయి కుమార్‌ను శనివారం స్వగ్రామానికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.  
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top