స్నేహితుడే నిందితుడు

స్నేహితుడే నిందితుడు - Sakshi


చేవెళ్ల: వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసింది. స్నేహితుడిని చంపేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. సోమవారం చేవెళ్లలోని తన కార్యాలయంలో డీఎస్పీ ఏవీ.రంగారెడ్డి, సీఐ ఉపేందర్ తో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. బంట్వా రం మండల పరిధిలోని ఎన్నారం గ్రామానికి చెందిన సూర్యపేట సులేమాన్(42) చోటీబీ దంపతులు. నాలుగు నెలల క్రితం తమ ఇద్దరు పిల్లలను తీసుకొని మెదక్ జిల్లా సంగారెడ్డి మండలంలోని ఎద్దుమైలారం గ్రామానికి వలస వెళ్లారు. సులేమాన్ స్థానికంగా కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.



ఈక్రమంలో అతడికి అదే గ్రామానికి చెందిన కూలీ కొండకళ్ల సత్యనారాయణతో పరిచయమై స్నేహం ఏర్పడింది. ఇద్దరు కలిసి విందులు చేసుకుంటుండేవారు. సత్యనారాయణ తరచూ సులేమాన్ ఇంటికి వచ్చి వెళ్తున్న తరుణంలో అతడి భార్య చోటీబీతో వివాహేతర సంబంధం ఏర్పడింది. సులేమాన్‌ను చంపేస్తే తమ సంబంధానికి అడ్డు ఉండదని సత్యనారాయణ పథకం వేశాడు. ఈక్రమంలో గతనెల 12న సాయంత్రం 5 గంటల సమయంలో సత్యనారాయణ చేపల కోసం శంకర్‌పల్లికి వచ్చాడు. మద్యం తీసుకొని వైన్స్ వద్ద తాగాడు. అదే సమయంలో శంకర్‌పల్లి చౌరస్తా వద్ద సులేమాన్ ఆయనకు కలిశాడు. ఇద్దరూ ఫత్తేపూర్ రైల్వేట్రాక్ వద్ద కాంపౌండ్‌కు వెళ్లి కల్లు తాగారు.



అప్పటికే చీకటి పడింది. ఓసీసా కల్లును స్నేహితులిద్దరు పార్శిల్ తీసుకున్నారు. కొంతకాలంగా సమయం కోసం ఎదురుచూస్తున్న సత్యనారాయణ, సులేమాన్‌ను చంపేయడానికి ఇదే మంచి సమయం అని భావించాడు. కొద్దిదూరం నడుచుకుంటూ వెళ్లాక కల్లు తాగుదామని సత్యనారాయణ రోడ్డు పక్కన ఉన్న పొదలమాటుకి సులేమాన్‌ను తీసుకెళ్లాడు. అక్కడ కల్లు తాగిన తర్వాత సులేమాన్ పక్కకు వెళ్లి మూత్ర విసర్జన చేస్తుండగా సత్యనారాయణ ఓ  బండరాయిని తీసుకొని అతడి తలపై బాదాడు. కిందపడిన సులేమాన్ తలపై మరోసారి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

 

మరుసటి రోజు హత్య విషయం వెలుగుచూడడంతో ఫత్తేపూర్ పంచాయతీ కార్యదర్శి మాధవి ఫిర్యాదు మేరకు శంకర్‌పల్లి పోలీసులు గుర్తుతెలియని శవంగా కేసు నమోదు చేసుకున్నారు. హత్యకు సంబంధించి మెదక్, రంగారెడ్డి జిల్లాలోని ఠాణాలకు సమాచారం ఇచ్చారు. మరుసటి రోజు హత్య విషయం పత్రికల్లో రావడంతో మృతుడి కుటుంబీకులు, బంధువులు సులేమాన్‌ను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించి అనుమానంతో సత్యనారాయణను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరుపగా నేరం అంగీకరించి పైవిషయాలు తెలిపాడు. ఈమేరకు నిందితుడు సత్యనారాయణను సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రంగారెడ్డి, సీఐ ఉపేందర్‌లు వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top