రైతన్నకు గుండె ‘కోత’

రైతన్నకు గుండె ‘కోత’ - Sakshi


కరీంనగర్ అగ్రికల్చర్ : ఏడుగంటలున్న కరెంటు సరఫరాను 4 గంటలకు కుదించారు. 5 గ్రూపులుగా విభజించి రాత్రి పూట ఇస్తున్న త్రీఫేజ్ కరెంటుపై రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇచ్చే నాలుగు గంటలలోనూ అంతరాయం, మరమ్మతులు, కోతలతో అరిగోసపడుత ున్నారు. లోవోల్టేజీతో మోటార్లు కాలిపోవడం మరో సమస్యగా మారింది. వర్షాలు పడే నైరుతి వెళ్లిపోయింది. ఎండలు కాస్తున్నాయి. వరిపొలాలు పొట్టదశలో ఉండడంతో నీరు తప్పనిసరి. పొలానికి ఏకధాటిగా నీరు పెడితేనే కిందిమడికి నీరందుతుంది. ఇస్తున్న నాలుగు గంటలు వేళాపాలా లేని సరఫరాతో ఆరుతడి పంటలకు సైతం నీరు పారించలేకపోతున్నారు. దీంతో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నా సంబంధిత అధికారులు దృష్టికి రాకపోవడం గమనార్హం.

 

సాగు.. సాధారణం

జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 5.40 లక్షల హెక్టార్లుకాగా.. 6 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో సాధారణ విస్తీర్ణంలోనే వివిధ పంటలు సాగు చేశారు. 1.61 లక్షల హెక్టార్లలో వరి, 53,622 హెక్టార్లలో మొక్కజొన్న, 2.23 లక్షల హెక్టార్లలో పత్తి, 19,385 హెక్టార్లలో సోయాబీన్ సాగవుతోంది. కాల్వనీళ్లు రానందున పంటలన్నీ బావులు, బోర్ల ఆధారితంగా మోటార్ల సాయంతోనే పండిస్తున్నారు. జిల్లాలో 3.63 లక్షల విద్యుత్ కనెక్షన్లతోపాటు అనధికారికంగా మరో 25 వేల కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటివరకు పంటలను కాపాడుకున్నది ఒక వంతైతే..ఆ పంటలను చేతికందించేందుకు అక్టోబర్, నవంబరు నెలలో నీటిని పారించడం అత్యంత కీలకం. ఈ సమయంలోనే సగానికి సగం విద్యుత్ సరఫరా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఖరీఫ్ కాలం ముగిసినప్పటికీ విద్యుత్‌కోతలు రబీని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

 

రాత్రి కరెంటుతో ఇక్కట్లు

ఆరుతడి పంటలకు రాత్రి పూట నీరు పారించలేక రైతులు తండ్లాడుతున్నారు. విద్యుత్తు ప్రమాదాలు, పాములతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పంటలకు నీటిని పారిస్తున్నారు. ఇటీవల కరీంనగర్ మండలం ఆసిఫ్‌నగర్‌లో తండ్రీకొడుకులు రాత్రిపూట  నీరు పెట్టేందుకు విద్యుత్‌షాక్‌తో మరణించారు. వ్యవసాయానికి త్రీఫేజ్ సరఫరాను 5 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపునకు 4 గంటల చొప్పున సరఫరా ఇస్తుండగా.. డి-గ్రూపునకు రాత్రి 10 నుంచి 2గంటల వరకు, ఇ-గ్రూపునకు రాత్రి 2నుంచి 6 గంటల వరకు సరఫరా ఇస్తున్నారు. ప్రతీ వారం గ్రూపు మారుతుంది. అంటే ఐదు గ్రూపులకు 5 వారాలుంటే మూడు వారాలు పగటిపూట, 2 వారాలు పూర్తిగా రాత్రిపూట ఇవ్వడంతో రైతులు పొలాలవద్ద పడిగాపులు కాస్తున్నారు. తెలంగాణలో విద్యుత్ లోటున్నప్పటికీ రైతులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ విద్యుత్ వేళలు పెంచేందుకు సర్కారుతో పాటు అధికారయంత్రాంగం ఆలోచించాల్సి ఉంది.

 

ఉత్పత్తి లేకే కోతలు..

 - గంగాధర్, ట్రాన్స్‌కో డీఈ


తెలంగాణలో విద్యుత్తు ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో లోటు ఏర్పడింది. ఫలితంగా కరెంటు కోతలు అనివార్యమయ్యాయి. 5 గ్రూపులుగా కరెంటు ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో విద్యుత్తు కొనుగోలుకు జరుగుతున్న చర్యలు అమలు జరిగితే రబీ సీజన్‌లో విద్యుత్ లోటును పూడ్చవచ్చు. ఇప్పటికే పరిశ్రమలకు 2 గంటల విద్యుత్ కోత, మండలాలు, మున్సిపాలిటీలు, సబ్‌స్టేషన్ పరిధిలో 8 గంటల చొప్పున కోతలున్నాయి. జిల్లా కేంద్రంలో 6 గంటల విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నాం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top