పోడు సాగుపై అటవీ శాఖ అధికారుల దాడి


 పెనుబల్లి :  మండల పరిధిలోని భవన్నపాలెం గ్రామ సమీపంలోని గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూముల్లో పత్తి పంటను అటవీశాఖ అధికారులు గురువారం ధ్వంసం చేశారు. సత్తుపల్లి రేంజ్ పరిధిలోని సుమారు 50 మంది అటవీశాఖ అధికారులు ఉదయం 6 గంటల ప్రాంతంలో గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూమికి చేరుకున్నారు. సుమారు ఆరెకరాల పత్తిపంటను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న గిరిజనులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో అటవీ  శాఖ అధికారులు, గిరిజనుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకదశలో తోపులాట జరిగింఇ. దీంతో ఫారెస్టు అధికారులు వెనుదిరిగారు.



 ఏపుగా ఎదిగాక...

 పెరికికుంట గ్రామానికి చెందిన 25 మంది గిరిజన కుటుంబాలు సుమారు 30 ఎకరాలు పోడు భూమిలో పత్తిని సాగు చేస్తున్నారు. ఏపుగా ఎదిగి కాపుకు వచ్చే సమయంలో ఫారెస్టు అధికారులు మూకుమ్మడిగా పంటపొలాలపై పడి పత్తి పంటను పీకడం పట్ల గిరిజనులు కన్నీరుమున్నీరయ్యారు. సోడె నాగేష్, పద్దం వెంకటప్ప  సాగు చేస్తున్న ఆరెకరాల పత్తిపంటను పూర్తిగా ధ్వంసం చేశారు. సంఘటనా స్థలానికి సీపీఎం మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ సందర్శించి అటవీ శాఖ అధికారుల తీరుపై మండిపడ్డారు. పదేళ్లుగా గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూమిలోని పత్తిపంటను తొలగించడం ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమని విమర్శించారు.



 తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

 తాము పోడు భూముల్లో సాగు చేస్తున్న పత్తి పంటను ఫారెస్టు అధికారులు అన్యాయంగా పీకేశారంటూ పెనుబల్లి తహశీల్దార్ కార్యాలయాన్ని గిరిజనులు సీపీఎం ఆధ్వర్యంలో ముట్టడించారు. ఫారెస్టు అధికారుల వేధింపులు ఆపాలంటూ తహశీల్దార్  తాతారావుకు ఆ పార్టీ మండల కార్యదర్శి శ్రీనివాస్ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాజినేని మంగమ్మ, చిమ్మట విశ్వనాధం, పూజల పోతురాజు, ప్రసాద్, నాగేశ్వరరావు, కొర్సా సత్యం తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top