ఓరుగల్లులో శ్రీరాముడి పాదముద్రలు

ఓరుగల్లులో శ్రీరాముడి పాదముద్రలు


జిల్లాలో పలుచోట్ల సంచరించినట్లు {పచారంలో పలు గాథలు

జీడికల్, వల్మిడి, ప్రోలకొండకు విశిష్టత


 

 హన్మకొండ కల్చరల్ : భారతీయ సనాతన ధర్మానికి  ప్రతీక  కోదండరాముడు. దశరథుడికి ఇచ్చిన మాట మేరకు రాముడు సీతాదేవి సమేతుడై, లక్ష్మణస్వామి వెంటరాగా గోదావరి నదిని దాటి దక్షిణదేశం వెళ్లాడని 14 ఏళ్లు అరణ్యవాసం చేశాడని శ్రీమద్రామాయణంలో ఉంది. శ్రీరాముడి తల్లి కౌసల్యాదేవి పుట్టినిల్లు దక్షిణకోసల. అంటే తన తల్లి పుట్టినింటి రాజ్యపుభాగాల్లో చాలా కాలం సంచరించాడన్న మాట. ప్రాచీన రహదారుల చరిత్రను పరిశీలిస్తే ఆ కాలంలో కూడా ఉత్తరభారతదేశం వారు దక్షిణదేశం వైపు పోవాలంటే కరీంనగర్ వరంగల్ సరిహద్దుల్లోని గోదావరి నదిని దాటాల్సి వచ్చేదని అర్థమవుతోంది. శ్రీరామచంద్రుడు కూడా దక్షిణభాగ భారతదేశంవైపు వెళుతున్న క్రమంలో ఈ ప్రాంతంగుండానే వెళ్లాడనే కథ ప్రచారంలో ఉంది. జిల్లాలో రాముడి సంచారంపై వివిధ గ్రామాల్లో మౌఖికంగా చెప్పుకునే స్థానిక జానపద కథల్లో వాస్తవ, అవాస్తవాల గురించి తేల్చేందుకు కచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ అనేక గాథలు ఇక్కడ ప్రచారంలో ఉన్నారుు.

 

వాల్మీకి ఆశ్రమమే వల్మిడి



పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలోని రఘురాముడి గుట్ట మీద పూర్వం వాల్మీకి ఆశ్రమం ఉండేదట. దానికి చిహ్నంగా నేటికి వాల్మీకి గుహ కన్పిస్తుంది. గుట్టకు నైరుతి భాగంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. అలాగే గుట్టపై రామాలయంలో పూర్వం అతిపెద్ద పంచలోహ విగ్రహాలు ఉండేవట. వాటిని దొంగలు ఎత్తుకుపోయారనే కథ ప్రచారంలో ఉంది. ఈ గుట్టపై ఎండకాలంలో కూడా నీళ్లు ఉండేలా గుండం కనిపిస్తుంది. వేలాది సంవత్సరాల క్రితం ఇక్కడ  మానవులు నివసించిన ఆనవాళ్లుగా రాక్షస గుండ్ల్లు, బూడిద మట్టి, టైటా పెంకులు  కన్పిస్తాయి. ఇక్కడ రామటెంకిలు దొరికాయని, రాముడు ఈ ప్రాంతం లో సంచరించాడని ప్రజలు విశ్వసిస్తారు. ఈ దేవాలయం భద్రాచలం రామాలయం కంటే పురాతనమైనదని భావిస్తారు. భద్రాచల క్షేత్రంలోని పూజారులు కూడా వల్మిడి రామాలయాన్ని ప్రత్యేకమైనదిగా గుర్తిస్తారు.



ప్రోలకొండలో..



కొడకండ్ల మండలంలో ప్రోలకొండ గుట్ట ఉంది. శ్రీరాముడు వల్మిడి నుంచి బయల్దేరి జీడికల్‌కు వెళ్తూ ప్రోలకొండ గుట్టలోని సొరికెలో విశ్రాంతి తీసుకున్నాడట. ఇక్కడ గుహలో రాముడి పాదాల గుర్తులున్నాయి. పూర్వం ఇక్కడ పెద్దజాతర జరిగేదట. ఆ తర్వాత కాలంలో ఈ ప్రోలకొండగుట్ట మొదటితరం కాకతీయరాజుల నగరంగా అభివృద్ధి చెందింది.



జింకను కొట్టిన చోటే జీడికల్



శ్రీరాముడు వనవాస కాలంలో మాయా లేడీని తరుముకుంటూ వచ్చాడనే కథ ప్రచారంలో ఉంది. జీడికల్ గ్రామానికి కిలోమీటరున్నర దూరంలో గుట్టపై దేవాలయం ఉంది. శ్రీరాముడు సీత కోరిక మేరకు మాయా లేడీని తరుముతూ వచ్చి పట్టుకోలేకపోతాడు. చివరికి మాయ లేడీని చంపడానికి బాణం ఎక్కుపెడుతాడు. దీంతో మాయా లేడీ భయపడిపోయి శ్రీరాముడ్ని శరణు కోరుతుంది. అదే సమయంలో నీళ్ల కోసం శ్రీరాముడు గంగాదేవిని ప్రార్థించి బోటన వేలితో భూమిని నోక్కేసరికి నీటి ఊట వస్తుంది. ఆ నీటితో శ్రీరాముడు సంధ్యావందనం చేసి దాహం కూడా తీర్చుకుంటాడు. ఆ పవిత్రమైన నీటితో తడిసిన జింక కూడా చిత్రరథుడనే గంధర్వుడిగా మారిపోతాడు. విశ్వామిత్రుడి శాపం కారణంగా తాను జింక రూపంలో ఉన్నానని చిత్రరథుడు రాముడికి  తెలియజేస్తాడు. అప్పటి నుంచి ఈ నీటిలో స్నానం చేసిన వారు తమ బాధల నుంచి విముక్తులవుతారని గంధర్వుడు వరమిస్తాడు. ఇక్కడ శ్రీరామనవమి రోజు కాకుండా కార్తీక పౌర్ణమి నుంచి బహుళ ద్వాదశి వరకు ఉత్సవాలు నిర్వహించి శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.   



 సీతారాముడే అడిగి వెలిసిన గుడి



డోర్నకల్‌లో నుంచి పది కిలో మీటర్ల పెరుమాళ్ల సంకీసను దేవుడి సంకీస అని కూడా పిలుస్తారు. పూర్వం ఇక్కడ చిన్నగోపాలస్వామి ఆలయం ఉండేది. ఈ గ్రామదొర అయిన వీరసాని అనే అతడు గోపాలస్వామిమూర్తి స్థానంలో శ్రీతిరుపతి వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాలని తిరుమలలోని పని వారికి విగ్రహాన్ని తయారుచేసే పని అప్పగించాడు. ఆ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి తెచ్చేసరికి అవి శ్రీసీతారామలక్ష్మణ విగ్రహాలుగా మారిపోయూయట. దీంతో మరోసారి వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని తయారు చేయించి తెచ్చేసరికి ఆ విగ్రహం కూడా శ్రీశ్రీసీతారామలక్ష్మణ విగ్రహాలుగా మారిపోయూయట. ఆరోజు రాత్రి రాముడు అతడి  కలలోకి వచ్చి తన విగ్రహాలను ప్రతిష్టిం చాలని అన్నారట. అలా శ్రీరాముడే తన భక్తుడి కలలో కన్పించి వెలిసిన అలయంగా ప్రసిద్ధి చెందింది.



పురాతన రామాలయాలు ఎన్నో..



పెండ్యాల సమీపంలోని నష్కల్‌లో పురాతనమైన రామాలయం ఉంది. ఇక్కడ రాతితో చేయబడిన శ్రీసీతారాముల విగ్రహం వేంచేసి ఉంది. ఇక్కడ 600 ఏళ్లుగా శ్రీసీతారామా కల్యాణా న్ని  అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భం గా 11 రోజులపాటు పెద్దజాతర జరుగుతుంది. చింతనెక్కొండలో మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన రామాలయం ఉంది. వరంగల్ నగరంలోని ఎల్లంబజార్ లో ఉన్న శ్రీసీతారామచంద్రస్వామి అలయం కూడా చాలా పురాతనమైనది. ఆలయంలో ప్రాచీనశిల్ప కళాసౌందర్యం ఉంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top