విద్యుత్ చౌర్యంపై నిఘా


ఖమ్మం: వీధిలైట్లు, ఆర్‌డబ్ల్యూఎస్, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు విద్యుత్ బకాయిలు భారీగా పేరుకు పోయాయని, ఆయా శాఖల అధికారులు సకాలంలో బిల్లులు చెల్లించకుంటే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ ఎలా కొనగలమని ట్రాన్స్‌కో సీఎండీ వెంకటనారాయణ ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్‌లు, ఆస్పత్రులు, హాస్టళ్లు వంటి అత్యవసర శాఖలు మినహా  ఇతర శాఖలేవైనా బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ట్రాన్స్‌కో సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో విద్యుత్ సరఫరా, బిల్లుల వసూళ్లు, ట్రాన్స్‌ఫార్మర్ల పనితీరు తదితర అంశాలపై జిల్లా విద్యుత్ అధికారులతో శనివారం ఆయన సమీక్షించారు.



ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాకు సరఫరా అవుతున్న విద్యుత్‌కు, అధికారికంగా విద్యుత్ వినియోగానికి మధ్య వ్యత్యాసం ఉంటోందని, అంటే విద్యుత్ చౌర్యం జరగుతున్నట్టేనని, దీనిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. 50 యూనిట్ల కంటే అధికంగా విద్యుత్‌ను వినియోగిస్తున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాల నుంచి కూడా బిల్లులు వసూలు చేయాలన్నారు. పాత మీటర్లు తొలిగించి కొత్తవి అమర్చాలని చెప్పారు.



 ఒక్కో ఏఈ రెండు గ్రామాలను దత్తత తీసుకొని గ్రామాల్లో చెట్లు నరికించడం, ట్రాన్ ్సఫార్మర్ల నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు చెల్లించే సర్వీస్ చార్జీ తక్కువేనని, వీటినైనా సకాలంలో చెల్లించేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో తరచూ ట్రాన్స్‌ఫార్మర్ల సమస్య ఏర్పడుతోందని, దీనిని నివారించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాల్లో చేపట్టిన ఆర్‌ఏపీడీఆర్‌పీ పనులు సంవత్సరాల తరబడి పెడింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే పూర్తి చేయాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ఉద్యోగుల కొరత  ఉన్న విషయం వాస్తవమేనని, అవసరమైన చోట సిబ్బందిని నియమించేందుకు  ప్రపోజల్స్ తయారు చేసి పంపాలని అన్నారు.



 జిల్లా ఎస్‌ఈ తిరుమలరావు మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదకరంగా ఉన్న 2750 విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించామని, ఇతర ప్రమాదకరమైన లైన్లను గుర్తించి వాటిని మరమ్మతు చేశామని చెప్పారు. ప్రతి నెల జిల్లా అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో పని విధానం పరిశీలించి అవసరమైన సూచనలు ఇస్తున్నామన్నారు. సమావేశంలో ఎన్‌పీడీసీఎల్ డెరైక్టర్లు చంద్రశేఖర్, వెంకటేశ్వర్‌రావు, డీఈలు ధన్‌సింగ్, సురేందర్, నాగప్రసాద్, బాబురావు, సుదర్శన్, ప్రతాప్‌రెడ్డి, రవి, ఏడీలు బాలాజీ, సుస్మిత, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top