పక్కా‘ప్లాన్’

పక్కా‘ప్లాన్’ - Sakshi


- అక్రమాలకు చెక్  

- భూ వినియోగ మార్పిడికి ఇక స్వస్తి

- త్రిసభ్య కమిటీ నియామకం

- రంగంలోకి దిగిన హెచ్‌ఎండీఏ

సాక్షి, సిటీబ్యూరో :
హైదరాబాద్ మహా నగర  అభివృద్ధికి బాటలు వేస్తూ గతంలో రూపొందించిన మాస్టర్‌ప్లాన్ (బృహత్ ప్రణాళిక)ను పక్కాగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగరానికి చుట్టుపక్కల ఉన్న నాలుగు జిల్లాల్లోని 35 మండలాలను కలుపుతూ రూపొందించిన ఈ మాస్టర్‌ప్లాన్  పరిధి మొత్తం 5965చ.కి.మీ. ఉంది.



ప్రధానంగా బృహత్ ప్రణాళికలో భూ వినియోగ మార్పిడికి వెసులుబాటు కల్పించడం వల్లే  కొందరు అక్రమార్కులు దీన్ని  ఆదాయ వనరుగా మార్చుకున్నారని... ఫలితంగా ప్రణాళిక అసలు ఉద్దేశం నెరవేరట్లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ‘మాస్టర్‌ప్లాన్’ పక్కాగా లేకపోవడం వల్లే హెచ్‌ఎండీఏ అక్రమాల పుట్టగా మారింది.



ప్రణాళికలో మార్పులు చేయకుండా హెచ్‌ఎండీఏలో ఆటోమిషన్ (ఆన్‌లైన్ అప్రూవల్స్) విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. మొదట మాస్టర్‌ప్లాన్‌ను పకడ్బందీగా తీర్చిదిద్దితే.. ఇలాంటి అక్రమాలకు తావుండదు. అందుకే దాని పై ప్రత్యేక దృష్టి పెట్టండి’ అంటూ ఇటీవల జరిగిన హెచ్‌ఎండీఏ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్‌ఎండీఏ అధికారులను ఆదేశించారు. అవసరమైతే హెచ్‌ఎండీఏ యాక్ట్ (చట్టాన్ని)ను కూడా సవరించాలని సూచించారు. ముంబయ్, ఢిల్లీ, బెంగళూరు మాస్టర్‌ప్లాన్లను పరిశీలించాక మన మాస్టర్‌ప్లాన్‌లో మార్పులకు గల అవకాశాలు, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిపి నివేదికివ్వాలని సీఎం ఆదేశించారు.  



ఇందుకోసం ప్రత్యేకంగా సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎంజీ గోపాల్, హెచ్‌ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రాలతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న బృహత్ ప్రణాళికలో భూ వినియోగాన్ని 12 రకాలుగా గుర్తించారు. అయితే... అందులో భూ వినియోగ మార్పిడికి అవకాశం కల్పిస్తూ విధి విధానాలు పొందుపర్చడం వల్ల ప్రణాళిక రూపమే మారిపోతోంది. కన్జర్వేషన్ జోన్ కాస్త రెసిడెన్షియల్ జోన్... లేదంటే  ఇండస్ట్రియల్ జోన్, మల్టీపుల్ జోన్‌గా మారుతోంది.  దీనివల్ల భవిష్యత్ నగరం అస్తవ్యస్తంగా నిర్మితమయ్యే ప్రమాదం ఉందని సీఎం అంచనా వేస్తున్నారు. కన్జర్వేషన్ జోన్ అంటే... భూ వినియోగం వ్యవసాయానికే ఉండాలి.



అలాగే ఫారెస్ట్ జోన్ అంటే... అడవులే ఉండాలి. వీటిని మార్పు చేయకూడదు. ఇకపై భూ వినియోగ మార్పిడికి అవకాశం లేకుండా  చర్యలు చేపట్టాలి. లేదంటే భవిష్యత్‌లో మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని సీఎం చెబుతున్నారు. ఇకపై ప్రభుత్వం అవసరమని భావిస్తే తప్ప భూ వినియోగ మార్పిడికి అవకాశం లేని విధంగా మాస్టర్‌ప్లాన్‌ను సరిదిద్దే బాధ్యతను ఆయన హెచ్‌ఎండీఏ భుజస్కంధాలపై పెట్టారు.  

 

నిపుణులతో వర్క్‌షాప్

మాస్టర్‌ప్లాన్‌ను దేశంలోనే గొప్ప ప్రణాళికగా తీర్చిదిద్దేందుకు నిపుణుల ఆధ్వర్యంలో రెండురోజుల పాటు వర్క్‌షాప్ నిర్వహించాలని హెచ్‌ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా నిర్ణయించారు. ఈ వర్క్‌షాప్‌కు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ), అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ (ఆస్కీ), ఇతర టౌన్ ప్లానింగ్ విభాగాల ఉన్నతాధికారులను ఆహ్వానిస్తున్నారు. హైదరాబాద్ మహా నగరాన్ని క్రమపద్ధతిగా అభివృద్ధి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలతో పాటు ప్రజారవాణా, సరుకు రవాణాకు తగిన విధంగా రోడ్ నెట్‌వర్క్, రైల్వే లైన్ల విస్తరణ,  విద్యుత్, తాగునీటి సరఫరా, కమ్యూనిటీ హాళ్లు, క్రీడా ప్రాంగణాలు,  బస్టాండ్లు తదితర అవసరాలను దృష్టిలో పెట్టుకొని మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చే ర్పులకు గల అవకాశాలపై ఈ వర్క్‌షాపులో చర్చించనున్నారు.



ఈ సందర్భంగా నిపుణులిచ్చే సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకొని త్రిసభ్య కమిటీ ఓ నివేదికను రూపొందించి దాన్ని ముఖ్యమంత్రికి అందజేస్తారు. ఆతర్వాత సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే మాస్టర్‌ప్లాన్‌ను మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపడుతుందని అధికారులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top