ఎక్కడపడితే అక్కడే

ఎక్కడపడితే అక్కడే


హోటళ్లు, రెస్టారెంట్లు,వెల్డింగ్ షాపులు

‘కమర్షియల్’ అవసరాలకు వంట గ్యాస్

బ్లాకులో అమ్మేసుకుంటున్న డీలర్లు

 

 సబ్సిడీ వంట గ్యాస్ ఇళ్లకు బదులు హోటళ్లు, వెల్డింగ్ షాపుల్లో ‘మండిపోతోంది’. పల్లెల్లో కొంతమంది సిలిండర్‌కు నాలుగైదొందలు ఖర్చు చేయలేకపోవడం... నెలనెలా బుకింగ్‌లు చేసుకోకపోవడం... డీలర్లకు వరంగా మారింది. ఏడాదికి ఒక్కో కనెక్షన్‌కూ వచ్చే పన్నెండు సిలిండర్లలో చాలావరకు మిగిలిపోతున్నాయి. వీటిని డీలర్లు పక్కదారి పట్టిస్తున్నారు. యథేచ్ఛగా బ్లాకులో అమ్ముకుంటూ రెట్టింపు సొమ్ము గడిస్తున్నారు.

 - మెదక్ రూరల్

 

 ఒక్కో కుటుంబానికి ఏడాదికి పన్నెండు... నగదు బదిలీ... ఆపై ఆధార్ అనుసంధానం... కంపెనీలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా గృహోపయోగ గ్యాస్ వ్యాపార అవసరాలకు తరలిపోతూనేవుంది. మెదక్ పట్టణంలోని ఏ కమర్షియల్ ప్రాం తంలో చూసినా సబ్సిడీ వంట గ్యాసే కనిపిస్తుంది. హోటళ్లు, వెల్డింగ్ షాపులు, కొత్తగా కట్టే మిల్లులు... ఇక్కడా అక్కడని లేదు... ఎక్కడపడితే అక్కడ ఇవే సిలిండర్లు!  



 పక్కదారి...

 సబ్సిడీ గ్యాస్ దుర్వినియోగం కాకుండా చూసేందుకు ప్రభుత్వం ఆధార్ కార్డును అనుసంధానం చేసింది. ఒక్కో కనెక్షన్‌కు ఏడాదికి పన్నెండు చొప్పున సిలిండర్లను పరిమితం చేసింది. పట్టణాల్లో ఇది బానే ఉందిగానీ... గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి చాలామంది సబ్సిడీ గ్యాస్‌ను ఉపయోగించుకోవడం లేదు. ప్రభుత్వం దీపం పథకం కింద గ్రామాల్లోని మహిళా గ్రూప్ సభ్యులకు సబ్సిడీలపై గ్యాస్‌ను అందిస్తుంది. అయినా గ్యాస్‌పై వంట చేసేది నూటికి సుమారు 5 శాతం మాత్రమే. ఒక్కో సిలిండర్ ధర ప్రస్తుతం రూ.698. ఇందులో రూ.234 సబ్సిడీ లభిస్తుంది. ఎక్కువగా పేదలు, శ్రామికులు నెలకు సిలిండర్‌పై ఇంత మొత్తం ఒకేసారి వెచ్చించలేకపోతున్నా రు. దీంతో గ్రామాల్లో చాలావరకు సబ్సిడీ గ్యాస్ మిగిలిపోతోంది. ఇదే డీలర్లకు వరంగా మారింది. వారి పేరున సిలిండర్లను బ్లాక్‌కు తరలిస్తున్నారు. వ్యాపార అవసరాలకు ఉపయోగించేవారికి సిలిండర్‌పై రూ.100 నుంచి 150 వరకు అదనంగా తీసుకుని సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.



 నెలకు ఐదువేల సిలిండర్లు..!

 మెదక్ పట్టణంతో పాటు మండలంలో అన్ని కంపెనీలకు కలిపి సుమారు 35 వేల గ్యాస్ కనెక్షన్లున్నాయి. కాగా ఓ డీలర్ నెలకు 5 వేలకు పైగా గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లోనే విక్రయిస్తున్నట్లు సమాచారం. లబ్ధిదారుల గ్యాస్ పాస్ పుస్తకాలను తన వద్దనే పెట్టుకుని వారి పేర్లపై గ్యాస్‌ను బుక్‌చేసి బ్లాక్‌లో డెలివరీ చేస్తున్నట్టు విశ్వససనీయ సమాచారం. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమయ్యే సబ్సిడీ మొత్తంలో కొంత డీలరు తీసుకుంటున్నాడు. మిగిలింది వారికి ఇస్తున్నాడు. పట్టణంలోని ఏ హోటల్‌లో చూసినా సదరు డీలరు సప్లై చేసే కంపెనీ సిలిండర్లే కనిపిస్తాయి. దీనిపై పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించి, సిలిండర్లను బ్లాక్‌మార్కెట్‌లోకి తరలిస్తున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top