‘లఖ్నాపూర్’ కళకళ

వరదనీటిలో చేపలు పడుతున్న జాలర్లు - Sakshi


భారీ వర్షాలకు నాలుగు రోజుల్లోనే నిండిన ప్రాజెక్టు

ఎట్టకేలకు పారుతున్న అలుగు

సాగులోకి రానున్న 2,600 ఎకరాల ఆయకట్టు

రైతుల్లో చిగురించిన రబీ ఆశలు

 పరిగి/ పరిగిరూరల్ : ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోనే రెండో అతిపెద్దదైన లఖ్నాపూర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఆదివారం తెల్లవారు జాము నుంచి అలుగు పారటం ప్రారంభమైంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో వారం రోజుల్లో ఏకంగా పది అడుగుల నీరు వచ్చి చేరింది. నాలుగేళ్ల తరువాత పెద్ద ఎత్తున పొంగిపొర్లుతోంది. దీంతో ఆయకట్టు రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. 2010లో పూర్తి స్థాయిలో నిండగా తరువాత రెండేళ్లు ప్రాజెక్టులో అడుగు మించి నీరు చేరలేదు. వినాయకచవితికి విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలా అని స్థానికులు ఆందోళన చెందారు. చవితి సమీపించింది మొదలు భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులోకి ఒక్కసారిగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో ఇదంతా వినాయకుని మహిమేనంటూ చర్చించుకుంటున్నారు.  

 

రబీపై రైతన్న ఆశలు..  

లఖ్నాపూర్ ప్రాజెక్టు ఒక్కసారి నిండితే పరిగి, దారూరు మండలాలకు చెందిన ఎనిమిది గ్రామాల్లో 2,600 ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. రైతులు వరుసగా మూడు నుంచి నాలుగు సీజన్లు వరి పంట సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. 2011 నుంచి అంతంత మాత్రంగానే నీరు రాగా గత సంవత్సరం నుంచి వరుసగా ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటుండడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ప్రాజెక్టులోకి వచ్చిన నీటితో ఈ రబీతో పాటు వచ్చే సంవత్సరం సీజన్ వరకు కొదవ ఉండదని రైతులు పేర్కొంటున్నారు.  



సందర్శకుల తాకిడి

మునుపెన్నడూ లేని విధంగా లఖ్నాపూర్ ప్రాజెక్టు పొంగిపొర్లుతుండటంతో వీక్షించేం దుకు సందర్శకుల తాకిడి పెరిగింది. ఆదివారం సెలవు కావటం, అదే రోజు ప్రాజెక్టు అలుగు పారి జలకళను సంతరించుకోవటంతో విద్యార్థులు, ఉద్యోగులు, పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఉల్లాసంగా గడిపారు.

 

చేపల కోసం జాలర్ల వేట

ప్రాజెక్టు పొంగిపొర్లడంతో చేపలు పట్టేందుకు జాలర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు. నీటిలో కొట్టుకుపోతున్న చేపలను వలల సాయంతో పట్టుకున్నారు. పావుకిలో చేప నుంచి ఐదు కిలోల సైజు ఉన్న చేపలు జాలర్లకు చిక్కాయి. పరిగితోపాటు నాగారం, మోమిల్‌కలాన్, లఖ్నాపూర్ తదితర గ్రామాల నుంచి జాలర్లు చేపలు పట్టేందుకు పెద్ద ఎత్తున వచ్చారు. తెల్లవారు జాము నుంచే చేపల వేటను కొనసాగిం చారు. మరో రెండు సీజన్ల వరకు చేపలు పెంచుకునేందుకు అవకాశం రావటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top