కేసీఆర్ వస్తున్నారు

కేసీఆర్ వస్తున్నారు - Sakshi


మొదటి వారంలో జిల్లా పర్యటన

మోతెలో ‘పసుపుశుద్ధి’కి శంకుస్థాపన

ఆర్మూరులో రూ.120 కోట్ల తాగునీటి పథకం

నిజామాబాద్‌లో అధికారులతో సమీక్ష

అంకాపూర్ రైతులతో ముఖాముఖి

సీఎంఓ నుంచి జిల్లాకు నేడు అధికారులు

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు త్వరలోనే జి ల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొదటిసారిగా ఇందూరుకు రానున్నారు. ఇందుకోసం అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఎల్లారెడ్డి, ఆర్మూరు ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎ.జీవన్‌రెడ్డి తదితరులు గురువారం సీఎంను కలిసి ఈ విషయమై చర్చించినట్లు తెలిసింది. దాదాపుగా ఆగస్టు మొదటి వారంలో సీఎం జిల్లాలో పర్యటించే అవకాశాలున్నాయని జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందింది.

 

ఎమ్మెల్యేలతో చర్చ

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మోతె గ్రామాన్ని సందర్శించిన కేసీఆర్ అక్కడ పసుపు శుద్ధి కేంద్రం ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన జిల్లా పర్యటన సందర్భంగా మోతెలో పసుపు శుద్ధి కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆర్మూరులో రూ.120 కోట్లతో నిర్మించ తలపెట్టిన రక్షిత మంచినీటి పథకానికి కూడా సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అర్గుల రాజారామ్, గుత్ప ఎత్తిపోతల పథకం నుంచి బాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు చెందిన మిగిలిన మండలాల ఆయకట్టుకు సాగునీరందించే విషయమై పరి  శీలన జరపనున్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల సమక్షంలో నీటిపారుదల శాఖ అధికారులను గుత్ప ప్రాజెక్టు గురించి అడిగి తెలుసుకున్నారు. జక్రాన్‌పల్లి మండలానికి నీరిందించాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు.

 

రైతులతో ముఖాముఖి

ఆర్మూరు, మోతెలో శంకుస్థాపన కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అనంతరం ముఖ్యమంత్రి ఆదర్శ గ్రామం అంకాపూర్‌కు చేరుకుని అక్కడ రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అధునాతన సాగు, అధిక దిగుబడులపై రైతుల అభిప్రాయాలు స్వీకరిస్తారు. అనంతరం నిజామాబాద్‌లో జిల్లా సమగ్రాభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వ హిస్తారు. ఈ కార్యక్రమాలపై సమగ్ర నివేదిక రూపొందించి టూర్ షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు సీఎంఓ అధికారుల బృందం శుక్రవారం మోతె, ఆర్మూరు, అంకాపూర్‌లలో పర్యటించనుంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన కేసీఆర్, సీఎంగా అధికార పర్యటన చేయనుండటంతో నాయకులు, కార్యకర్తలలో ఉత్సాహకర వాతావరణం నెలకొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top