ఎన్నాళ్లయినా... ఎన్నేళ్లయినా


వైఎస్ తనయ షర్మిలను అక్కున చేర్చుకున్న నల్లగొండ జిల్లా

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దేవరకొండ గుట్టల్లో ఉన్న దేవరచర్లలో పరామర్శ కోసం హనుమా నాయక్ కుటుంబం వద్దకు వెళ్లినప్పుడు కొడుకు రతన్‌సింగ్‌కు కాళ్లవాపులు ఉండడంతో షర్మిల ఆయన కాళ్లపై తన చేతులు వేసి ‘ఏం తాతా? కాళ్లెందుకు వాచాయి?’ అని ఆరా తీయగా ఆయన కళ్లలో కనిపించిన నీళ్లు... ‘మాపై మీ కుటుంబానికి ఇంత ప్రేమా తల్లీ’ అని పలకరించాయి... నాగార్జునసాగర్‌లో కామిశెట్టి వెంకటనర్సయ్య కుటుంబం వద్దకు వెళ్లినప్పుడు ఆయన కూతుళ్లు నోమిని, పార్వతిలు షర్మిలను చూసి వెక్కివెక్కి ఏడ్చినప్పుడు ఆ మహానేత తనయ హృదయం ద్రవించిపోయింది. వాళ్లు కూడా తన తోబుట్టువులే అన్నట్టు... ఆమె కూడా కన్నీటిపర్యంతమయ్యారు. షర్మిల ఏడుస్తుంటే ఆ కుటుంబం అల్లాడిపోయింది... ఇన్నాళ్లు పలకరించిన వాళ్లు లేరమ్మా! ఒక్కదానినే ఉంటున్నా... ఇప్పుడు నువ్వొస్తున్నావంటే ఇంతమంది వచ్చారు అని మిర్యాలగూడలో అక్కిమళ్ల సుందర్ భార్య కృష్ణవేణి ఏడ్చినప్పుడు రాజన్న బిడ్డ కూడా ఉద్వేగాన్ని తట్టుకోలేక కన్నీరు పెట్టారు. నువ్వు ఒంటరి దానివి కాదమ్మా...! నీకు మా కుటుంబం అండగా ఉందంటూ భరోసా ఇచ్చినప్పుడు ఆమె మోములో ఆనందం విరిసింది...

 

ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉద్వేగ సంఘటనలు...

నల్లగొండ జిల్లాలో షర్మిల ఏడు రోజుల పరామర్శయాత్రలో అడుగడుగునా అంతులేని అభిమానం పొంగిపొర్లింది. ఆమె ఏడురోజులపాటు నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో పర్యటించి తన తండ్రి మరణం తట్టుకోలేక ప్రాణాలు విడిచిన 30 మంది కుటుంబాలను పరామర్శించారు. తన తండ్రి చనిపోయిన ఐదున్నరేళ్ల తర్వాత ఆయన కోసం ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించడం కోసం చేపట్టిన యాత్ర అడుగడుగునా ఆప్యాయత, అభిమానం నింపుకుని నడిచింది.

 

ఎన్నాళ్లయినా.. ఎన్నేళ్లయినా ఆ కుటుంబంపై ప్రేమానురాగాలు మరచిపోలేనివని ఈ యాత్ర నిరూపించింది.  ‘బాగున్నారా..’ అంటూ షర్మిల ప్రజలను పలకరించినప్పుడు, హాయ్ అంటూ చేయి కలిపినప్పుడు... వైఎస్సార్‌ను కలిశామనే స్థాయిలో అనుభూతి పొంది ఆనందంతో తిరిగి వెళ్లిపోయారు. మేళ్లచెరువు అయితే జనసంద్రమైపోయింది. షర్మిల వస్తోందని తెలుసుకున్న గ్రామస్తులు వేల సంఖ్యలో ఆమెను చూసేందుకు మెయిన్‌సెంటర్‌కు రావడం గమనార్హం. కొన్నిచోట్ల షర్మిల చేత తమ పిల్లలకు నామకరణం చేయించారు... అన్నప్రాసనలు చేయాలని కోరారు. గ్రామస్తుల మేళతాళాలు, మంగళహారతులు, కోలాటాలు, గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, గిరిజన భాషలో పాటలు పాడుతూ షర్మిలమ్మను తమ గ్రామంలోకి స్వాగతించారు. సూర్యాపేట పరిధిలోని కందగట్లలో అయితే మహిళలంతా దారిపొడవునా రంగురంగుల ముగ్గులు వేసి షర్మిలమ్మను పరామర్శ కుటుంబం వద్దకు తీసుకెళ్లారు.

 

ఆ కుటుంబాల ప్రేమ వెలకట్టలేనిది

తన తండ్రి కోసం చనిపోయిన వారి కుటుం బాల వద్దకు షర్మిల వెళ్లినప్పుడు ఆయా కుటుంబాల సభ్యులు ఆమెపై చూపిన ప్రేమ, ఆప్యాయతలు వెలకట్టలేనివనే చెప్పాలి. షర్మిల తమ ఇంట్లోకి రాగానే వారి కళ్లలో ఆనందబాష్పాలు కనిపించాయి. రెండు చేతులతో నమస్కరించి అందరినీ పేరుపేరునా బాగున్నారా అని షర్మిల పలకరించినప్పుడు వారంతా ఆత్మీయంగా స్పందించారు.  కోదాడ నియోజకవర్గంలోని వెంకట్రాంపురంలో తన చిన్నారిని షర్మిల ఒళ్లో కూర్చోబెట్టుకుని ‘హర్ష’ అని పేరు పెట్టినప్పుడు ఆమె తల్లి రాధ పొంగిపోయింది. షర్మిల మన బిడ్డతో మాట్లాడుతోందని కానిస్టేబుల్ డ్యూటీ చేస్తున్న భర్తకు వెంటనే ఫోన్ చేసి చెప్పి తన సంతోషాన్ని పంచుకుంది. మొత్తమ్మీద షర్మిల ఆ కుటుంబాలను పలకరించిన ఆ అరగంట వారికి ఉద్వేగభరిత అనుభూతులను మిగిల్చింది. షర్మిల వెళ్లిపోయాక వారిని పలకరిస్తే ‘ఆ బిడ్డ మా ఇంటికి వచ్చి వెళ్లిందంటే ఇన్నాళ్ల మా బాధ తీరినట్టే ఉంది’ అని చెప్పడం గమనార్హం.

 

ఏమ్మా.. బాగున్నారా!

షర్మిల కూడా పరామర్శకు వెళ్లిన ప్రతి కుటుంబంలోని వారందరినీ పేరుపేరునా పలకరించారు. వయసుమళ్లిన పెద్దవాళ్లను వారి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. విద్యార్థులు కనిపిస్తే బాగా చదువుకోవాలి.. అమ్మా, నాన్నలను బాగా చూసుకోవాలని సూచిం చారు. పెద్దవాళ్లు కనిపించినప్పుడు ఏమ్మా..! రేషన్ వస్తోందా? వ్యవసాయం బాగుందా?  పంటలు ఎలా ఉన్నాయి? రైతు రుణమాఫీ అయిందా? పింఛన్ వస్తోందా? కరెంటు ఉంటోందా? అని కుశలప్రశ్నలు వేసిన షర్మిల.. అందరూ ధైర్యంగా ఉండాలని , మంచిరోజులు వస్తాయని ధైర్యం చెప్పి వెళ్లారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top