మన్నెగూడలో ఫైరింగ్‌ రేంజ్‌!

మన్నెగూడలో ఫైరింగ్‌ రేంజ్‌! - Sakshi


ప్రత్యామ్నాయ స్థలంపై రక్షణ శాఖ సానుకూలత?

ప్యాట్నీ–శామీర్‌పేట, ప్యారడైజ్‌–సుచిత్ర కూడలి

ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి మోక్షం

కంటోన్మెంట్‌ భూములు సేకరించేందుకు ఏర్పాట్లు  




సాక్షి, హైదరాబాద్‌: నిజామాబాద్, కరీంనగర్‌ రహదారులను నగరంతో ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా అనుసంధానించే రెండు భారీ ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి స్థలం ఇచ్చేందుకు రక్షణ శాఖ సానుకూల సంకేతాలిచ్చింది. నగరంలోని స్థలం ఇచ్చి దాని బదులు వికారాబాద్‌ సమీపంలోని మన్నెగూడ వద్ద వంద ఎకరాలకుపైగా భూమిని తీసుకునేందుకు రక్షణ శాఖ సమ్మతించినట్టు తెలిసింది. ఇక్కడ ఫైరింగ్‌ రేంజ్‌ ఏర్పాటు చేసుకోనుంది.



అందుకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందా లేదా అన్న విషయంలో స్పష్టత కోసం కంటోన్మెంట్‌ అధికారులను పరిశీలించాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు కంటోన్మెంట్‌ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అది అనుకూలంగానే ఉంటుందని ఢిల్లీలోని రక్షణ శాఖ ప్రధాన కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఫలితంగా కంటోన్మెంట్‌ మీదుగా రెండు ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమమవుతోంది.



ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా...

నిజామాబాద్‌ జాతీయ రహదారి, కరీంనగర్‌ రాజీవ్‌ రహదారి గుండా నగరంలోకి వచ్చే వాహనాలు శివారు వరకు వేగంగానే వచ్చినా, అక్కడి నుంచి ట్రాఫిక్‌లో ఇరుక్కుని నగరం చేరేందుకు దాదాపు గంటకుపైగా సమయం పడుతోంది. దీంతో ట్రాఫిక్‌ చిక్కుల నుంచి మోక్షం కలిపిస్తూ, వాహనాలు వేగంగా నగరంలోకి వచ్చేలా భారీ వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది జరగాలంటే కచ్చితంగా కంటోన్మెంట్‌ భూముల మీదుగానే నిర్మించాలి.



 ప్యాట్నీ కూడలి నుంచి శామీర్‌పేట వరకు రాజీవ్‌ రహదారిని అనుసంధానిస్తూ ఓ కారిడార్, ప్యారడైజ్‌ కూడలి నుంచి నిజామాబాద్‌ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ సుచిత్ర కూడలి వరకు మరో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించాలని రోడ్లు, భవనాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ రెండు కారిడార్ల నిర్మాణానికి దాదాపు 96 ఎకరాల కంటోన్మెంట్‌ భూమిని సేకరించాలి. సీఎం స్థాయిలో రక్షణశాఖ మంత్రితో గతంలో చర్చించిన మీదట రక్షణ శాఖ దీనికి సానుకూలత వ్యక్తం చేసింది.



‘ఏఓసీ’కి ప్రత్యామ్నాయ మార్గం కూడా...

మరోవైపు సికింద్రాబాద్‌ నుంచి అటు రామకృష్ణాపురం వంతెన మీదుగా ఈసీఐఎల్‌ రోడ్డు.. ఇటు సఫిల్‌గూడ రోడ్డుకు చేరుకునేలా కంటోన్మెంట్‌లోని ఏఓసీ మార్గాన్ని వినియోగిస్తున్నారు. క్రమంగా వాహనాల రద్దీ బాగా పెరగడంతో తమకు ఇబ్బందిగా మారిందని పేర్కొంటూ కంటోన్మెంట్‌ యంత్రాంగం ఆ రోడ్డును మూసేయాలని నిర్ణయించి పలుమార్లు దాన్ని తాత్కాలికంగా అమలు చేసింది. ఆ రోడ్డు మూసేస్తే ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది ఎదురు కానున్నందున ఆ ప్రతిపాదనను విరమించుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపాన్ని రక్షణశాఖ కొట్టిపారేసింది.



ప్రత్యామ్నాయ మార్గాన్ని నిర్మించుకునేందుకు కొంత గడువు ఇస్తామని ప్రకటించటంతో ప్రభుత్వం ఆ అన్వేషణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి కూడా మార్గం సుగమమవుతోందని రోడ్లు భవనాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కంటోన్మెంట్‌ సరిహద్దుల మీదుగా ఉన్న ప్రత్యామ్నాయ రోడ్లను వెడల్పు చేసి వాటిని వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం కంటోన్మెంట్‌కు సంబంధించిన 40 ఎకరాలను సేకరించనుంది. దీనికి కూడా ప్రత్యామ్నాయ స్థలం తీసుకునేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top