ప్రచారంలో ఫైటింగ్ సీన్

ప్రచారంలో ఫైటింగ్ సీన్ - Sakshi

  •     నడిరోడ్డుపై తన్నుకున్న కాంగ్రెస్ నాయకులు

  •      రాహుల్ యువసేన కన్వీనర్ వర్సెస్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు  

  •      ఎమ్మెల్యే కవిత ఎదుటే బాహాబాహీ

  •      అడ్డుకున్న శ్రీరాంభద్రయ్య, భరత్‌చందర్‌రెడ్డి, పార్టీ శ్రేణులు

  •  కేసముద్రం, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గవిభేదాలు ఎన్నికల వేళ మరోసారి భగ్గుమన్నాయి. మొదటి నుంచి ఒకరికొకరు పోటీపడుతూ ప్రచారంలో పాల్గొంటున్న ఇద్దరు నాయకుల మధ్య వివాదం చివరికి తన్నులాటకు దారితీసింది. సాక్షాత్తు ఎమ్మెల్యే కవిత, మాజీ ఎమ్మెల్యే శ్రీరాంభద్రయ్య, పీసీసీ సభ్యుడు జెన్నారెడ్డి భరత్‌చంద్‌రెడ్డి ఎదుట ఈ ఫైటింగ్ జరిగింది.



    ప్రత్యక్ష సాక్షుల  ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రాహుల్ యువసేన మండల కన్వీనర్ చిలువేరు సమ్మయ్యగౌడ్ ఎమ్మెల్యే కవిత ప్రచారానికి తన అనుచరులతో బైక్‌ర్యాలీతో హాజరయ్యాడు. అలాగే కాట్రపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుగులోతు దస్రూనాయక్ కూడా ప్రచారంలో పాల్గొన్నాక కేసముద్రంవిలేజ్‌లోని ఓ నాయకుడి ఇంట్లో ఏర్పాటు చేసిన భోజనాల వద్దకు పార్టీశ్రేణులతో కలిసి వెళ్లారు.



    ఈ క్రమంలో దస్రూనాయక్ ఎమ్మెల్యే ఎదుటకు సమ్మయ్యగౌడ్‌ను పిలిపించి తన గ్రామానికి చెందిన తన వ్యతిరేకులను నువ్వు ఎలా ప్రచారానికి పిలుస్తావని అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోతూ దస్రూనాయక్ ఎమ్మెల్యే ఎదుటే సమ్మయ్యగౌడ్‌పై చేయిచేసుకున్నాడు. దీంతో అక్కడున్న ఎమ్మెల్యే కవితతోపాటు మాజీ ఎమ్మెల్యే శ్రీరాంభద్రయ్య, పీసీసీ సభ్యుడు జెన్నారెడ్డి భరత్‌చంద్‌రెడ్డి కంగుతిని ఘర్షణను అడ్డుకున్నారు.



    కంటతడి పెట్టిన సమ్మయ్యగౌడ్‌ను బుజ్జగించి, కారులో తీసుకుని బయల్దేరారు. విషయం తెలుసుకున్న సమ్మయ్యగౌడ్ అనుచరులు అక్కడికి చేరుకున్నారు. శ్రీరాంభద్రయ్య, భరత్‌చందర్‌రెడ్డి కారులో తమతోపాటు సమ్మయ్యగౌడ్‌ను కూర్చొబెట్టుకుని ఆయనకు సర్ధిచెపుతూ అక్కడున్న దస్రూను కూడా కారులోకి రమ్మని పిలిచారు.



    ప్రచార వాహనం నుంచి కారు వద్దకు వెళ్తున్న దస్రూనాయక్‌ను వెంబడించిన సమ్మయ్య అనుచరులు తీరా కారు డోర్ తీస్తుండగానే దస్రూపై మూకుమ్మడిగా దాడి చేశారు. అక్కడున్న నాయకులు ఎందరు అడ్డుకున్నా వారు ఆగలేదు. పరిస్థితి చేయి దాటుతుండడంతో కారులో నుంచి ఇద్దరు నాయకులు దిగి రెండు వర్గాల నాయకులను చెరోవైపు చెదరగొట్టారు.  

     

    స్థానికుల విస్మయం..

     

    ఓట్లడగడానికి వచ్చిన నాయకులు ఇలా కొట్టుకుంటున్నారేమిటంటూ అక్కడున్న ప్రజలు విస్మ యం వ్యక్తం చేశారు. పార్టీలో ఇలా క్రమశిక్షణ లేకుం డా ముందుకెళితే పరిస్థితి చేయిదాటుతుందంటూ మరికొందరు నాయకులు వాపోయారు. కాంగ్రెస్ శ్రేణుల్లో విబేధాలు తరచూ రచ్చకెక్కుతుండడం ఎమ్మెల్యే కవితకు తలనొప్పిగా మారింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top