ఎంపీ, మాజీ ఎంపీల మధ్య మాటల యుద్ధం

ఎంపీ, మాజీ ఎంపీల మధ్య  మాటల యుద్ధం - Sakshi


సికింద్రాబాద్: నాయకులు మధ్య పోరుకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. ఆ పార్టీలోని ఎంపీ, మాజీ ఎంపీల మధ్య ఆదివారం తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అందుకు సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్షా కార్యక్రమం వేదిక అయింది. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని 10 జిల్లాల నుంచి పార్టీ నాయకులు హాజరయ్యారు. కాగా కార్యక్రమంలో నాయకులకు సభ్యత్వ నమోదు పుస్తకాలు అందజేస్తున్నారు.


ఆ క్రమంలో పాల్వాయి గోవర్థన్ రెడ్డికి పుస్తకాలు అందజేస్తుండగా... కె.రాజగోపాల్ జోక్యం చేసుకుని... రెబల్గా తన కుమార్తెను పోటీ చేయించిన పాల్వాయికి ఆ పుస్తకాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దాంతో పాల్వాయి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ విషయం నీకు ఎందుకు అంటూ పాల్వాయి... రాజగోపాల్రెడ్డిపై ఫైరయ్యారు. దీంతో ఇద్దరు మధ్య చాలా సేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. పలువురు నాయకులు జోక్యం చేసుకుని సర్థి చెప్పినా వారు వినలేదు. సమావేశం అనంతరం కూడా ఇదే అంశంపై వారిరువురు తీవ్ర స్థాయిలో  వాదులాడుకున్నారు.





ఇటీవల తెలంగాణకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె స్రవంతి నల్గొండ జిల్లా మునుగొడు అసెంబ్లీ టిక్కెట్ ఆశించారు. అయితే ఎన్నికల పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని వామపక్ష పార్టీకి కేటాయించారు. దీంతో స్రవంతి ఆ స్థానం నుంచి రెబల్గా బరిలోకి దిగి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కె.రాజగోపాల్ భువనగిరి నుంచి మరోసారి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి... ఓటమి పాలైయ్యారు. ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి మునుగొడు అసెంబ్లీ స్థానం వస్తుంది. తన ఓటమికి గల కారణాల్లో పాల్వాయి కుమార్తె కూడా ఓ కారణమని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారని సమాచారం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top