‘నాన్న.. మీ అల్లుడు త్వరగా రమ్మన్నాడు'

‘నాన్న.. మీ అల్లుడు త్వరగా రమ్మన్నాడు' - Sakshi


స్థలం: తల్లాడ మండలం బాలప్పేట.

సందర్భం: ఓ బుడ్డోడికి అన్నప్రాసన వేడుక.


ఏన్కూరు/తల్లాడ: బుడి బుడి అడుగులేసుకుంటూ ఆ బుడ్డోడు  కేరింతలు కొడుతున్నాడు...! ఆ వేడుకంతా వాడిదే..! అందరూ గోరు ముద్దలు తినిపిస్తూ ముద్దు చేస్తున్నారు. ఈ వేడుక కోసం వాడి తాత పాలెపు శ్రీను(55), ఏన్కూరు నుంచి తన ట్రాలీ ఆటోలో వచ్చాడు. ఆ బుడ్డోడి అల్లరి, ముద్దు ముద్దు మాటలతో ఆ తాత ఆనందభరితుడయ్యాడు.  వచ్చినప్పటి నుంచి వాడిని ముద్దులాడుతూనే ఉన్నాడు. అక్కడి నుంచి ఎంతకీ వెళ్లబుద్ధి కావడం లేదు. అక్కడ నందిని(35) చేస్తున్న సందడి అంతింత కాదు.



అక్కడున్న బంధుమిత్రులందరిలోనూ ఆ బుడ్డోడితో సమానంగా నానా హడావుడి చేసింది ఆమెనే! ఆమె ఆ బుడ్డోడి మేనత్త. వాడి నాన్నకు స్వయానా సోదరి. వేడుక దాదాపుగా పూర్తయింది. అందరూ కబుర్లాడుకుంటూ భోజనాలు ముగించారు. ‘నాన్నా.. మీ అల్లుడు త్వరగా రమ్మన్నాడు. (ఏన్కూరులో) హోటల్‌ మెయింటెనెన్స్తో అక్కడ ఆయనొక్కడే ఇబ్బంది పడుతుంటాడు. మనం త్వరగా వెళ్దాం నాన్నా’ అంది. ఆ తండ్రి సరేనన్నాడు. ‘నందిని దించేసి వెంటనే వస్తా’నని తన కొడుక్కి, కోడలికి, ఇతర బంధుమిత్రులందరికీ చెప్పాడు.



బుడ్డోడిని ముద్దు చేస్తూ.. వాడిని వదిలి వెళ్లలేక.. వెళ్లలేక వెళ్లాడు. నందిని పరిస్థితి కూడా అలాగే ఉంది. తన బుడ్డి అల్లుడి బుగ్గలు వాచిపోయేలా గిల్లి.. గిచ్చి ముద్దు చేస్తూ.. వెళ్లలేక, ఉండలేక భారంగా కదిలింది. ‘నన్ను దించేసి, తాత వెంటనే వస్తాడు’ అని ఆ బుడ్డోడికి చెప్పి, తండ్రితోపాటు బయల్దేరింది.

గడప దాటాక..ఆ ఇద్దరి నుంచి ఒక్కటే మాట..   ‘చిన్నా.. టాటా..!’ 

                               



స్థలం: ఏన్కూరు మండలం గార్లొడ్డు.

సందర్భం: రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు దుర్మరణం.








ఆ తండ్రీకూతుళ్లు.. ఆ బుడ్డోడి లోకం నుంచి ఇంకా బయటకు రాలేదు. వాడి అల్లరి, ముద్దు మాటలు, బుడి బుడి నడక.. గురించి కబుర్లు చెప్పుకుంటున్నారు. మనవడిని వదిలి ఉండలేకపోతున్నానని అతడు బాధగా చెప్పాడు. నా పరిస్థితి కూడా అలాగే ఉందని ఆమె చెప్పింది. ట్రాలీ ఆటో కాస్తంత నెమ్మదిగానే వెళుతోంది. గార్లొడ్డు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో.. పెద్ద శబ్దం. ఏం జరిగిందో తెలుసుకునేంతలోనే ఆ తండ్రీకూతురు స్పృహలో లేరు. తీవ్ర గాయాలు, రక్తసిక్తం.



కొత్తగూడెం నుంచి తల్లాడ వెళుతున్న డీసీఎం వ్యాన్, ఆ ట్రాలీ ఆటో ను ఢీకొంది. పాలెపు శీను అక్కడికక్కడే మృతి చెందాడు, నందినిని 108 సిబ్బంది ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తున్నారు. కొద్ది దూరం వెళ్లాక.. ఆమె కూడా కన్ను మూసింది. వారిద్దరూ వెళ్లిపోయారు.. అనంత లోకాలకు..! బాలప్పేటలో ఆ ఇంట ఆనందం ఆవిరైంది. విషాదం వికటాట్ట హాసం చేసింది. ఆ ఇద్దరి చివరి మాట.. వారందరి చెవులకు పదే పదే వినిపిస్తోంది.

చిన్నా.. టాటా..! 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top