పల్లెల్లో రైతులే కథానాయకులు

పల్లెల్లో రైతులే కథానాయకులు - Sakshi

  • ఎంత ఖర్చయినా రైతులను రాజులుగా చేస్తాం: కేసీఆర్‌

  • వచ్చే ఎన్నికల నాటికి తండాలను పంచాయతీలుగా మారుస్తాం

  • మూడు చింతలపల్లి గ్రామసభలో పాల్గొన్న ముఖ్యమంత్రి

  • ఆరు కన్నా ఎక్కువ చెట్లు పెంచే ఇంటికి 2 పాడి పశువులిస్తాం

  • మేడ్చల్‌/శామీర్‌పేట్‌/మేడ్చల్‌ రూరల్‌

    ‘‘నా చిన్నతనంలో రైతులు రాజుల్లా బతికేవారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అన్నివిధాలా నష్టపోయింది. బోర్లు వేసిన రైతులు బొక్కబోర్లాపడ్డారు. నా చిన్ననాటి రైతులను మళ్లీ చూడాలన్నదే నా కల. ప్రతి గ్రామంలో రైతులే కథానాయకులు కావాలి. అందుకే వారికి నీళ్లు, కరెంట్‌తోపాటు ఎకరాకు రూ. 4 వేల చొప్పున రెండు పంటలకు కలిపి రూ. 8 వేలు ఇవ్వాలని నిర్ణయించాం..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ వచ్చిన మూడేళ్లలోనే కరెంట్‌ బాధలు తొలగిపోయాయని, వచ్చే ఏడాది నాటికి గోదావరి జలాలతో ప్రతీ చెరువును నింపి రైతులకు నీరందిస్తామని తెలిపారు.



    మంగళవారం మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట్‌ మండల పరిధిలోని మూడు చింతలపల్లిలో జరిగిన గ్రామసభలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన చిన్నతనంలో మే నెలలో కూడా శామీర్‌పేట్‌ చెరువులో నీళ్లు చూశానని గుర్తుచేసుకున్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు గ్రామాల్లో పొలాల లెక్క తీస్తే వ్యవసాయ శాఖ లెక్కలకు, రెవెన్యూ శాఖ లెక్కలకు పొంతన కుదరడం లేదన్నారు. అందుకే భూ రికార్డులన్నీ సరిచేసేందుకు రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సర్వే చేపడుతున్నట్లు వివరించారు. దేశంలోని 25 ఏజెన్సీలతోపాటు విదేశీ ఏజెన్సీల సహకారంతో మూడు నెలల పాటు ప్రత్యేక డ్రైవ్‌ చేపడతామన్నారు. ‘‘సర్వే చేసేందుకు రెవెన్యూ అధికారులతో మీ గ్రామాలకు వస్తారు. అప్పుడు గ్రామ రైతులంతా కలిసి ప్రతీ గుంట భూమి ఎవరికి చెందిందో గుర్తించి వారి పేర ఉండేలా చూడాలి.



    భూ రిజిస్ట్రేషన్‌కు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు తిరుగుతూ వారికి లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. అందుకే సబ్‌ రిజిస్ట్రార్, ఆర్డీవోలకు అధికారాలు తగ్గించి తహశీల్దార్‌లకు ఎక్కువ బాధ్యతలు ఇస్తున్నాం. ఒక్క రూపాయి లంచం లేకుండానే రైతుల పాస్‌ పుస్తకాలు వారి ఇంటికి కొరియర్‌లో వచ్చేలా చేస్తాం. ఈ లెక్కలన్నీ పక్కా చేసి వచ్చే ఏడాది నుంచి కచ్చితంగా రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున మే–అక్టోబర్‌ నెలలో వారి బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తాం. ఇందుకు రైతు సమన్వయ సమితి ఏర్పాటు చేస్తాం. ఈ సమితి నిర్ధారించిన రైతులకే పెట్టుబడి సాయం అందిస్తాం. సమితిలో రాజకీయంగా కాకుండా ప్రభుత్వం నిర్దేశించిన వారే ఉంటారు. రాష్ట్రంలోని ప్రతీ రైతుకు పెట్టుబడి సాయం అందజేస్తాం. ఎంత ఖర్చైనా రైతులను రాజులుగా మారుస్తాం’’అని చెప్పారు. తాను ప్రధానిని కలిసినప్పుడల్లా తెలంగాణ మూడేళ్లలోనే ఆర్థికంగా ఎలా నిలదొక్కుకుందని అడుగుతారని పేర్కొన్నారు. 21.7 శాతం వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు.



    అందుకే ఇక్కడికి వచ్చా..

    వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలోని తండాలను జనాభా ప్రాతిపదికన గ్రామపంచాయతీలుగా మారుస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తాను మూడు చింతలపల్లికి రావడానికి కారణం వీరారెడ్డి అనే యో«ధుడు పుట్టిన గడ్డ కావడమేనని సీఎం వివరించారు. 1969నాటి తెలంగాణ ఉద్యమంలో చెన్నారెడ్డికి కుడిభుజంగా ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన వీరారెడ్డి, గౌడవెళ్లి వెంకట్రామ్‌రెడ్డిలు వంటి పోరాట యోధులు పుట్టిన జిల్లా మేడ్చల్‌ జిల్లా అని, వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు.



    చూద్దాం.. మీరు గెలుస్తారో? నేను గెలుస్తానో?

    ‘‘మీరు అడిగినా అడగకపోయినా నేను మీ కోరికలు తీరుస్తున్నా. నా కోరికల్లా హరితహారం విజయవంతం చేసి పచ్చటి తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చడమే. నా కోరిక తీరుస్తారా..’’అంటూ కేసీఆర్‌ గ్రామస్తుల్ని అడిగారు. తప్పకుండా తీరుస్తామని ప్రజలు అనడంతో ఇంటికి 6 మొక్కల చొప్పున నాటాలని సీఎం కోరారు. ‘‘తాను జనవరిలో సీక్రెట్‌ సర్వే చేయిస్తా. అప్పుడు ఎవరింట్లో 6 మొక్కలకు మించి పెంచుతూ కనబడితే వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఉచితంగా రెండు పాడి పశువులు అందిస్తా. నేను మొక్కలు పెంచితే పాడి పశువులు ఇస్తా అంటున్నా.. మీరు మొక్కలు పెంచి చూపిస్తాం అంటున్నారు. చూద్దాం... ఇద్దరిలో ఎవరు గెలుస్తారో’’అని అన్నారు.



    గ్రామంపై వరాల జల్లు..

    మూడు చింతలపల్లి గ్రామంపై సీఎం వరాల జల్లు కురిపించారు. గ్రామాభివృద్దికి రూ.15 కోట్లతోపాటు మరో రూ.5 కోట్లు జిల్లా కలెక్టర్‌ వద్ద ఉంచుతానని తెలిపారు. మూడు రోజుల్లో జీవోలు జారీ చేసి 6 నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 15 తర్వాత శామీర్‌పేట్‌ మండలంలోని గ్రామాల అభివృద్ధిపై మరోమారు మండల కేంద్రంలో సమావేశంలో పాల్గొంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్ర«ణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు సు«ధీర్‌రెడ్డి, వివేక్, కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top