రైతన్నలకు కరెంట్ కష్టాలు

రైతన్నలకు కరెంట్ కష్టాలు - Sakshi


* ఆందోళన చెందుతున్న అన్నదాతలు

* పక్షపాతం చూపుతున్న సిబ్బందిపై ఆగ్రహం


ధారూరు: ఒక్క సెంట్ భూమిని కూడా ఎండిపోనివ్వబోమని ప్రభుత్వం చెబుతుంటే విద్యుత్ సిబ్బంది మాత్రం సర్వీస్ చార్జీలు చెల్లించడం లేదంటూ నిర్దాక్షిణ్యంగా సరఫరా నిలిపివేస్తున్నారు.దీంతో సాగుచేసిన వరిపంటలు ఎండుముఖం పట్టాయి. నాగారం గ్రామంలో దాదాపు 20 ట్రాన్స్‌ఫార్మర్లు ఉండగా కేవలం రెండింటికి మాత్రమే విద్యుత్ కనుక్షన్ తీసివేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నాగారం గ్రామ సమీప బోనమ్మగుడి వద్ద ఉన్న ట్రాన్‌ఫార్మర్ నుంచి 30 ఎకరాల వరి పొలాలకు 16 కరెంట్ మోటార్ల ద్వారా నీరందుతుంది.



మూడు నెలల క్రితం వరిని సాగుచేయగా ప్రస్తుతం ఈత దశలో ఉన్నాయి. గ్రామ స్మశానవాటిక దగ్గరి ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో కూడా 15 ఎకరాల్లో వరిని సాగుచేశారు. విద్యుత్ సిబ్బంది బుధవారం రెండింటి ద్వారా సరఫరా అయ్యే విద్యుత్ సరఫరాను తొలగించారు. దీంతో రెండు రోజులుగా సరఫరా లేక వరిపంటలు ఎండుముఖం పడుతున్నాయి. ఇదేమిటని విద్యుత్ సిబ్బందిని ప్రశ్నిస్తే నాలుగు గ్రామాల్లో రూ. లక్ష వసూలు కావాల్సి ఉందని, లైన్‌మెన్ కరెంట్ తీసేయమంటే తీసివేశాం.. మేమేం చేస్తాం.. అని చెప్పడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇకనైనా వెంటనే ఆయా ట్రాన్స్‌ఫార్మర్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని వారు కోరారు.



వెంటనే కనెక్షన్ ఇప్పిస్తాం: కృష్ణమూర్తి, ఏఈ, విద్యుత్ శాఖ

మండలంలోని గ్రామాల్లో వ్యవసాయ కనెక్షన్ల నుంచి దాదాపు రూ.15 లక్షలు వసూలు కావాల్సి ఉంది. అందుకోసం స్పెషల్ డ్రైవ్ చేస్తూ బిల్లులు వసూలు చేస్తున్నాం. ఎవరైనా సర్వీస్ బిల్లు చెల్లించకుంటే వారి పరిధిలోని ట్రాన్స్‌ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నాం. బిల్లులు చెల్లిస్తే వెంటనే కనెక్షన్ పునరుద్ధరిస్తాం. వ్యవసాయ మోటార్ల సర్వీస్ బిల్లు బకాయిలుంటే వెంటనే చెల్లించాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top