గోమాత వ్యథ..

గోమాత వ్యథ..


ఖమ్మం అర్బన్ : ఎంతోమంది అతి పవిత్రంగా భావించే గోవులకు కొందరు దళారులు బతికి ఉండగానే నరకం చూపిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పశుగ్రాసం లేక కొందరు రైతులు పశువులను విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో పాటు తక్కువ ఖర్చుతోనే వాటిని కబేళాకు తరలించేదుకు ఒక్కో కంటెయినర్‌లో లెక్కకు మించి ఎక్కిస్తున్నారు. ఇలా తరలిస్తున్న మూగజీవాలను ఇటీవల అర్బన్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఆరు పశువులను తరలించాల్సిన కంటెయినర్‌లో ఏకంగా 30 నుంచి 80 వరకు రవాణా చేస్తున్నారు.



ఇలా శ్రీకాకుళం, విజయనగరం, ఖమ్మం తదితర జిల్లాల నుంచి హైదరాబాద్‌లోని గోవధ శాలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలో ఊపిరాడక కొన్ని పశువులు మృత్యువాత పడుతుండగా, ఒకదానికి ఒకటి తగలడంతో పలు ఆవులు, దూడలు తీవ్రంగా గాయపడుతున్నాయి. అయితే ఆరెస్సెస్ ప్రతినిధులు, మరికొందరు ఇచ్చిన సమాచారంతో జిల్లా పోలీసులు ఇటీవల పలు పశువులను స్వాధీనం చేసుకుని గోశాలకు తరలించారు.



 గోశాలలోనూ ఇక్కట్లే...

 గత శుక్రవారం ఒక్క రోజే ఖమ్మం అర్బన్,  ఏన్కూర్ తదితర మండలాల నుంచి కంటెయినర్‌ల ద్వారా తరలిస్తున్న పశువులను పోలీసులు పట్టుకుని నగరంలోని గొల్లగూడెం, ధంసలాపురం గోశాలలకు తరలించారు. గొల్లగూడెం గోశాలలో గతంలో ఉన్నవాటికి తోడు మరో 35 పశువులను చేరవేశారు. అయితే అన్నింటికి గ్రాసం సరిపోక అవి ఆకలితో అలమటిస్తున్నాయి. దాతలు ఇచ్చిన కొద్దో..గొప్పో గ్రాసంతోనే గోశాలను నిర్వహిస్తున్నామని, తాగునీరు, గ్రాసం అందించడం పెద్ద ప్రయాసగా మారిందని నిర్వాహకులు చెపుతున్నారు. మూడు పశువులతో ప్రారంభించిన గోశాలలో నేడు 370 పైగా ఉన్నాయని, ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే వీటిని సంరక్షించగలమని చెపుతున్నారు.



 ప్రశ్నార్థకంగా గోవధ నిషేధ చట్టం..

 పోలీసులు పట్టుకున్న పశువులను సమీపంలోని గోశాలలకు తరలిస్తున్నారు. అయితే వీటి సంరక్షణ భారంగా మారుతుండడంతో పలువురు నిర్వాహకులు ఆ పశువులను తమవద్ద ఉంచవద్దంటూ నిరాకరిస్తున్నారు. దీంతో గోవధ నిషేధ చట్టం ప్రశ్నార్థకంగా మారుతుందని జంతుప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ఎస్పీ గోశాలలను సందర్శించి, అక్కడ నెలకొన్న సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని, గోశాలలో వందల సంఖ్యలో పశువులు ఉంటంతో వాటికి అవసరమైన వైద్యం అందించడానికి కూడా ప్రత్యేక వైద్యాధికారిని నియమించాలని కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top