కొండచిలువ కళేబరంతో ఆందోళన

కొండచిలువ కళేబరంతో ఆందోళన - Sakshi


చండ్రుగొండ: రైతుకు కోపం వచ్చింది. అర్ధ రాత్రి వేళ వ్యవసాయానికి కరెంటు సరఫరా చేస్తుండడంతో ప్రాణాలు ఫణంగా పెట్టి సాగు చేయాల్సి వస్తుందని రైతులు విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన సంఘటన ఖమ్మం జిల్లా చంద్రుగొండలో జరిగింది. చండ్రుగొండ మండల కేంద్రం లోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ఆదివారం ఆందోళన చేశారు.



శనివారం రాత్రి పొలానికి నీళ్లుపెట్టేందుకు వెళ్లిన ఓ రైతు చేలో కనిపించిన ఏడు అడుగుల కొండచిలువను హతమార్చిన రైతులు, ఆదివారం ఉదయం దాన్ని తీసుకొచ్చి సబ్‌స్టేషన్ ఎదు ట ఉంచి ధర్నా చేశారు. వ్యవసాయానికి పగ లే ఏడుగంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండలంలోని పోకలగూడెం గ్రామానికి చెందిన రైతు బాణోత్ దేవదాస్ మిర్చి తోటకు నీళ్లుపెట్టేందుకు శనివారం రా్ర తి వెళ్లాడు. దారిలో అతనికి ఏడడుగుల కొండచిలువ కనిపించింది. తోటి రైతుల సహాయంతో దాన్ని హత మార్చాడు. వ్యవసాయానికి రాత్రి వేళ కరెంటు ఇవ్వడం మూలంగానే రైతులు అర్ధరాత్రి వేళ చేల వెంట వెళ్లాల్సి వస్తుందని, దీంతో ప్రమాదాల బారిన పడాల్సి వస్తుందని ఆరోపించారు. ఏడగుల కొండచిలువను చూడకుండా తొక్కి ఉంటే రైతు ప్రాణాలు గాలిలో కలిసేవని ఆవేదన వ్యక్తం చేశారు.



ఆదివారం ఉదయం చండ్రుగొండ విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా తాము చంపిన కొండచిలువ కళేబరాన్ని ఉంచి నిర్వహించారు. విద్యుత్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంటపాటు ఆందోళన నిర్వహించి విద్యుత్‌శాఖ ఏఈఈ వెంకన్నకు వినతిపత్రం సమర్పించారు. పోకలగూడెం, బాల్యతండా, వంకనంబర్, కరిశెలబోడు, వెంకటియాతండా, సామ్యతండాలకు చెందిన రైతులు గుగులోతు చందర్, బాణోత్ దేవదాస్, బాణోత్ హనుమ, లావు డ్యా బాలాజి, దారావత్ హర్య, వస్రాం, గుగులోతు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top